రెచ్చిపోయిన మానవమృగాలు

18 Mar, 2018 03:12 IST|Sakshi

     బాలికపై సామూహిక అత్యాచారం 

     14 మంది లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలి ఆరోపణ 

పినపాక: ఓ గిరిజన బాలికపై 14 మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలు శనివారం రాత్రి ఈ విషయం విలేకరులకు తెలిపింది. పినపాక మండలం జానంపేట  పాండురంగాపురం గ్రామానికి చెందిన బాలిక(15) ఎనిమిదో తరగతి చదువుతూ 4 నెలల క్రితం మధ్యలోనే మానేసింది. తల్లి వెంకటమ్మతో కలసి కూలి పనులకు వెళుతోంది. ఈ నెల 11న తన పుట్టిన రోజు సందర్భంగా చాక్లెట్లు, బిస్కెట్లు కొనుక్కునేందుకు షాపు వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో ఆటోలో వచ్చిన ఇద్దరు యువకులు ఆమెను కిడ్నాప్‌ చేసి జానంపేట అమరారం శివారులోని అడవుల్లోకి తీసుకెళ్లారు. అక్కడ వారితోపాటు మరో నలుగురు యువకులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.

అనంతరం గ్రామంలోని ఓ ఇంటికి తీసుకెళ్లి మరో నలుగురు అత్యాచారం చేశారు. అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై దుగినేపల్లి పంచాయతీ శివారులోని అడవుల్లోకి తీసుకెళ్లి అక్కడా మరో నలుగురు అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను అమరారంలోని ఒక ఇంట్లో ఉంచారు. 12న ఉద యం ఐదు గంటలకు మెలకువ వచ్చిన బాలిక జానంపేట నుంచి నేరుగా భూపాలపల్లి జిల్లా వాజేడు మండలం గుమ్మడిదొడ్డిలోని బంధువుల ఇంటికి వెళ్లింది.

కూతురు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన వెంకటమ్మ 14న ఏడూళ్ల బయ్యారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో బాలిక తన బంధువులతో కలిసి పినపాక మండలం పాండురంగాపురం వచ్చి విషయం తల్లికి చెప్పింది. ఈ ఘటనపై  ఏఎస్‌ఐ కె.లక్ష్మయ్యను వివరణ కోరగా.. బాలిక ఆచూకీ కనిపించడం లేదని వెంక టమ్మ 14న ఫిర్యాదు చేసిందని, దానిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. మణుగూరు డీఎస్పీ ఆర్‌.సాయిబాబాను వివరణ కోరగా కేసు వివరాలు సేకరించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.  

>
మరిన్ని వార్తలు