బాలుడిపై మహిళా టీచర్‌ లైంగిక వేధింపులు

25 May, 2018 15:48 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చంఢీగర్‌:  విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయురాలు బాలుడిని లైంగికంగా వేధించి కటకటాల పాలయ్యారు. ట్యూషన్‌ పేరుతో బాలుడిని తన ఇంట్లో పెట్టుకొని అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాలుడి తల్లిదండ్రులు చైల్డ్‌లైన్‌ హెల్ప్‌లైన్‌కి సమాచారమివ్వడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆమెను అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. చండీగఢ్‌, సెక్టార్‌ 31లోని రామ్‌దర్బార్‌లో నివాసముండే 34 ఏళ్ల మహిళా టీచర్‌ తన ఇంటి పక్కనే ఉండే 14 ఏళ్ల బాలుడిని లైం‍గికంగా వేధించారు.

పదో తరగతి చదువుతున్న బాలుడికి, అతని చెల్లికి ఆమె 2017 నుంచి ట్యూషన్‌ చెప్తున్నారు. అయితే కొన్ని నెలల క్రితం వారిద్దరినీ వేర్వేరుగా ట్యూషన్‌కి పంపించమని నిందితురాలు తల్లిదండ్రులని కోరింది. అప్పటినుంచి చదువులో చురుగ్గా ఉండే బాలుడు సరిగా చదవడం లేదు. మార్కుల్లో తగ్గుదల గమనించిన తల్లిదండ్రులు అతన్ని ఏప్రిల్‌లో ట్యూషన్‌కి మాన్పించారు. అయితే, తిరిగి ట్యూషన్‌కి పంపించాలని బాలుడి తల్లిదండ్రులని ఆ టీచర్‌ గత నెలలో ఒత్తిడి చేసిందని పోలీసులు వెల్లడించారు. 

వారు ససేమిరా అనడంతో సోమవారం దగ్గుమందు తాగి ఆత్మహత్యకు యత్నించిందని వారు తెలిపారు. పరిస్థితి భయానకంగా మారడంతో బాలుడి తల్లిదండ్రులు చైల్డ్‌లైన్‌ హెల్ప్‌లైన్‌ సూచనతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోస్కో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చండీగఢ్‌ ఎస్పీ నీలాంబరి విజయ్‌ జగదల్‌ తెలిపారు. నిందితురాలిని జ్యూడీషియల్‌ కస్టడీకి తరలించామన్నారు. తనతో టచ్‌లో ఉండాలని సదరు టీచర్‌ బాలుడికి ఒక సిమ్‌ కార్డు కూడా ఇవ్వడం గమనార్హం. 

>
మరిన్ని వార్తలు