నిష్పక్షపాత దర్యాప్తుకు ఆదేశించిన సీఎం జగన్‌

28 Jan, 2020 08:22 IST|Sakshi
పలాసలోప్రదర్శనగా ఆస్పత్రికి చేరుకున్న విద్యార్థులు

ఇంటర్‌ విద్యార్థిని హత్యాచార ఘటనపై ప్రజాగ్రహం 

పలాస, కాశీబుగ్గ జంట పట్టణాల్లో ప్రజా సంఘాల నిరసన 

నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ 

8 గంటలకుపైగా నిరసనలు, బైఠాయింపు 

పోలీసుల వలయంలో మృతదేహం స్వగ్రామం తరలింపు 

పరిశీలించిన ఎస్పీ అమ్మిరెడ్డి 

ఉద్దానం భగ్గుమంది.. అత్యాచారం చేసి బాలికను హతమార్చిన మృగాళ్లను రెండు రోజులవుతున్నా పట్టుకోలేనందుకు కోపోద్రిక్తమైంది. పోలీసులు అలసత్వం వహించారని ఆరోపిస్తూ పలాస–కాశీబుగ్గ జంట పట్టణాల్లో ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు సోమవారం భారీ ఆందోళన చేపట్టాయి. వజ్రపుకొత్తూరు మండలం ధర్మపురం గ్రామానికి చెందిన బాలిక అర్ధరాత్రి మాయమై పట్టాలపై శవమై తేలిన విషయం విదితమే. నిందితులను శిక్షించి తక్షణమే న్యాయం చేయాలని పోస్టుమార్టం చేస్తున్న ఆసుపత్రి ముందు జనం బైఠాయించారు. తల్లిదండ్రుల ఇంటికి మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలించేందుకు పోలీసులు యత్నించగా వీరు అడ్డుకున్నారు.

చదవండి: రాత్రి మాయమై తెల్లవారేసరికి శవమై..!

దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. జిల్లా ఎస్పీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి వచ్చి పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో బాలిక మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులు, ఆందోళనకారులను వారించి నిందితులను పట్టుకుంటామని తెలిపారు. ఇదిలావుండగా నిష్పక్షపాత దర్యాప్తునకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. బాలిక హత్య గురించి పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్‌ సీదిరి అప్పలరాజు సీఎం దృష్టికి తీసుకువెళ్లగా తీవ్రంగా స్పందించిన సీఎం... పోస్టుమార్టం రిపోర్టు పరిశీలించి నిజనిజాలు పరిగణనలోకి తీసుకుని ఎటువంటి ప్రలోభాలకు, ఎవరి ప్రమేయానికి తావులేకుండా నిష్పక్షపాత నిర్ధారణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు.    
     
కాశీబుగ్గ మూడు రోడ్ల కూడలి వద్ద బైఠాయించిన ఆందోళనకారులు  

ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే ఉద్దానం ఒక్కసారిగా భగ్గుమంది. హత్యాచారానికి గురైన ఇంటర్‌ విద్యార్థిని ఘటనలో నిందితులను పట్టుకోవడంలో అలసత్వం వహిస్తున్న పోలీసుల తీరుపై ప్రజా సంఘాల నిరసనలు మిన్నంటాయి. ఈ మేరకు పలాస, కాశీబుగ్గ జంట పట్టణాలను ఆందోళనకారులు అష్ట దిగ్బంధనం చేశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేసే వరకూ మృతదేహాన్ని తరలించొద్దని పలాస సామాజిక ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు పోలీసుల రక్షణ వలయంలో మృతురాలి స్వగ్రామానికి తరలించారు. 

సాక్షి, కాశీబుగ్గ/వజ్రపుకొత్తూరు రూరల్‌: వజ్రపుకొత్తూరు మండలం ధర్మపురంలో నివాసముంటున్న ఇంటర్‌ విద్యార్థిని శనివారం అర్ధరాత్రి పలాస రైలు పట్టాలపై అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం విదితమే. ఆదివారం సంఘటనా స్థలం నుంచి మృతదేహాన్ని పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి రైల్వే పోలీసులు తరలించారు. సోమవారం అక్కడ వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. ఈమె మృతదేహాన్ని అంబులెన్స్‌లో కాశీబుగ్గ పోలీసుల రక్షణ వలయంలో తరలించే ప్రయత్నం చేస్తుండగా గ్రామస్తులు, పరిసర ప్రాంత ప్రజలు, కుటుంబ సభ్యులు, బంధువులు అడ్డుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ఎందుకు తాత్సార్యం చేస్తున్నారని పోలీసులను నిలదీస్తూ ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది.  

కాశీబుగ్గ మూడు రోడ్ల కూడలి వద్ద మానవహారం... 
ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ఆందోళనకారులు ప్లకార్డులు పట్టుకుని ప్రతీ కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. ఇప్పటికే పోలీసులకు చిక్కిన అనుమానిత వ్యక్తి గురించి, కేసులో పురోగతి గురించి బయటకు వెళ్లడించకపోవడంపై కారణం ఏమిటని నిలదీశారు. తక్షణమే ప్రభుత్వం తరపున వచ్చి అధికారులు సమాధానం చెప్పందే కదలబోమని కాశీబుగ్గ మూడు రోడ్ల కూడలి వద్ద భైఠాయించారు. ఈ క్రమంలో కాశీబుగ్గ సీఐ వేణుగోపాలరావు. మరో ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్‌ఐలు, కానిస్టేబుళ్ల సహా నలభై మంది స్పెషల్‌ పోలీసులు చుట్టు ముట్టారు.

కాశీబుగ్గ కేటీరోడ్డులో భారీ ర్యాలీ 

ఈ ఆందోళన సాయంత్రం ఐదు గంటల వరకూ కొనసాగింది. ఇదేక్రమంలో పోలీసుల రక్షణ వలయంలో అంబులెన్స్‌లో మృతదేహాన్ని బాతుపురం గ్రామానికి తరలించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయకుండా మృతదేహాన్ని తరలించడంపై ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. చివరకు పోలీసులు, స్పెషల్‌ బెటాలియన్‌ సిబ్బంది చెదరగొట్టారు.
 
మృతదేహాన్ని పరిశీలించిన ఎస్పీ  
వైద్యుల సమక్షంలో ఆస్పత్రి మార్చురీలో విద్యార్థిని మృతదేహాన్ని ఎస్పీ అమ్మిరెడ్డి, ప్రత్యేక క్రైం టీంతో పరిశీలించారు. అనంతరం కుటుంబ సభ్యులు, ఆందోళనకారులతో మాట్లాడారు. నిందితులను పట్టుకుంటామని వారిని వారించారు.  

ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే లేఖ 
పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్‌ సీదిరి అప్పలరాజు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. దిశ యాక్టు ప్రకారం దర్యాప్తు చేపట్టి, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. దీనిపై సీఎం వెంటనే స్పందించి తన స్వహస్తాలతో రాసిన లేఖలో విద్యార్థిని హత్య కేసులో పోస్టుమార్టం పరిశీలించి నిజనిజాలు పరిగణలోకి తీసుకుని ఎటువంటి ప్రలోభాలకు అధికారులు గురికాకుండా, ఎవరి ప్రమేయానికి తావులేకుండా నిష్పక్షపాత నిర్ధారణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.  ఈ మేరకు బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు