వయసు 16..కేసులు 23

23 Oct, 2019 05:00 IST|Sakshi

కరడుగట్టిన బాలనేరస్తుడ్ని అరెస్టు చేసిన పోలీసులు

ఇప్పటికే నాలుగుసార్లు జువైనల్‌ హోంకు

అతని వయసు 16 ఏళ్లు.. నేర చరిత్రేమో ఘరానా దొంగకు ఏ మాత్రం తీసిపోదు. నగరంలోని వివిధ పోలీస్‌ స్టేషన్ ల్లో అతనిపై 23 కేసులు నమోదై ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగకమానదు. ఇతనితో పాటు ఓ మేజర్‌ బి.గణేష్, మరో ఇద్దరు బాల నేరస్తులను ముషీరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసి జువైనల్‌ హోంకు తరలించారు.

ముషీరాబాద్‌: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంకు చెందిన పి.వెంకటేశ్వర్లు భార్య పిల్లలతో బతుకుదెరువు కోసం నగరంలోని అశోక్‌నగర్‌కు వచ్చాడు. హాస్టల్‌లో పనిచేసుకుంటూ జీవనం సాగించేవారు. అతని కుమారుడు పి.వీరబాబు అలియాస్‌ వినోద్‌ అలియాస్‌ వీరా నాల్గవ తరగతి చదువుతున్న సమయంలో పక్క విద్యార్థి చెయ్యి విరిచాడు. దీనితో పాఠశాల యాజమాన్యం వీరబాబుకు టీసీ ఇచ్చి పంపించింది. ఆ తర్వాత ఇతన్ని కూకట్‌పల్లిలోని పెద్దమ్మ దగ్గరకు పంపించగా, చోరీలకు పాల్పడం నేర్చుకున్నాడు. ఈ క్రమంలో బాచుపల్లి పీఎస్‌లో 2 కేసులు, మియాపూర్‌లో 11 కేసులు, కూకట్‌పల్లిలో 1 కేసు, సనత్‌నగర్‌లో 1 కేసు, సైదాబాద్‌లో 1 కేసు.. మొత్తం 16 కేసులు నమోదయ్యాయి. ఇతనితో వేగలేక తల్లిదండ్రులు స్వగ్రామానికి వెళ్లిపోయారు. వీరబాబు నాలుగుసార్లు అరెస్టై జైలు (జువైనల్‌ హోం)కు వెళ్లాడు. రెండుసార్లు అక్కడి నుంచి తప్పించుకున్నాడు.

తాజాగా హోంలో తోటి బాల నేరస్తున్ని విపరీతంగా కొట్టి తప్పించుకున్నాడు. జువైనల్‌ హోంలో పరిచయమైన బాకారానికి చెందిన బుషిపాక గణేష్‌ దగ్గరకు వెళ్లాడు. వీరిద్దరు రాంనగర్‌ లక్ష్మమ్మ పార్కు వద్ద ఉండే బాల నేరస్తుడు మద్దెల సిద్దార్థ అలియాస్‌ సిద్దూ, హరినగర్‌కు చెందిన విద్యార్థి నాంపల్లి సాల్‌మ¯Œ రాజులతో కలసి చోరీలకు పాల్పడటం ప్రారంభించారు. ఈ క్రమంలో ముషీరాబాద్, నల్లకుంట, చిక్కడపల్లి, గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలో మరో 7 కేసులు నమోదయ్యాయి. మంగళవారం గోల్కొండ క్రాస్‌ రోడ్స్‌లో వీరు అనుమానాస్పదంగా సంచరిస్తున్న వీరిని పోలీసులు పట్టుకుని విచారించారు. ద్విచక్ర వాహనాలను, సెల్‌ఫోన్లను, బంగారు గొలుసులను చోరీ చేసినట్లు అంగీకరించారు. వారి నుంచి రూ.1.70 వేల రెండు యాక్టివాలు, 2 సెల్‌ఫోన్లు, ఒక్క ముత్యాల దండ, 25 తులాల వెండి పట్టగొలుసులు స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్‌ జోన్  డీసీపీ విశ్వప్రసాద్, చిక్కడపల్లి ఏసీపీ నర్సింహారెడ్డి, ముషీరాబాద్‌ డీఎస్పీ గంగాధర్, డీఐ వెంకన్న, డీఎస్‌ఐ బాలరాజు తెలిపారు.

మరిన్ని వార్తలు