బాలికపై 6 నెలలలుగా పది మంది అత్యాచారం

12 Feb, 2020 14:48 IST|Sakshi

సోలాపూర్: మహారాష్ట్రలోని షోలాపూర్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ 16 ఏళ్ల దళిత బాలికపై పది మంది కామాంధులు ఆరు నెలలుగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను బెదిరించి వేరు వేరు ప్రదేశాలకు తరలిస్తూ ఈ దారుణానికి పాల్పడ్డారు. గత మంగళవారం షోలాపూర్‌లోని ఓ గుడి వద్ద ఏడుస్తున్న బాలికను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షోలాపూర్‌కు చెందిన బాలిక(16) తల్లితో కలిసి నగరంలో నివాసం ఉంటుంది. తండ్రి కొద్ది రోజుల క్రితమే మృతి చెందారు. ఆమె జీవనోపాధి కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటూ తల్లికి సహాయం చేసేది. ఈ క్రమంలో ఆమెకు ఐదుగురు యువకులతో స్నేహం ఏర్పడింది. 

కాగా, ఆరు నెలల క్రితం బాలిక స్నేహితులు ఐదుగురు ఆమె ఇంటికి వచ్చి మాయమాటలు చెప్పి నగరంలోని ఓ రహస్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అనంతరం అక్కడికి మరో ఐదుగురు యువకులు వచ్చారు. మొత్తం పదిమంది కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.  ఈ విషయం ఇంట్లో చెబితే చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయారు. ఇలా గత ఆరు నెలలుగా అనేకసార్లు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.

గత మంగళవారం కూడా బాలికపై అత్యాచారానికి పాల్పడిన దుండగులు.. అనంతరం ఆమెను ఓ గుడి వద్ద వదిలి వెళ్లారు. ఒంటరిగా ఏడుస్తున్న బాలికను గమనించిన స్థానికులు ఆమె దగ్గరకు వెళ్లి ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుడి వద్దకు చేరుకున్న పోలీసులు  నీరసంతో ఉన్న బాలికకు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం  బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. పదిమంది నిందితుల్లో ఐదుగురు బాలిక స్నేహితులేనని, వారిని అరెస్ట్‌ చేశామని పోలీసులు పేర్కొన్నారు. మిగతా ఐదుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. నిందితుల్లో కొంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా