175 కేజీల గంజాయి పట్టివేత

6 Jul, 2020 11:34 IST|Sakshi
గంజాయి, నిందితులను చూపుతున్న పోలీసులు

నలుగురి అరెస్ట్, కారు స్వాధీనం

భద్రాచలంఅర్బన్‌: కారులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న నలుగురిని పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. భద్రాచలం టౌన్‌ సీఐ వినోద్‌ రెడ్డి కథనం ప్రకారం.. పట్టణంలోని బ్రిడ్జ్‌ సెంటర్‌ వద్ద ఆదివారం టౌన్‌ ఎస్‌ఐ మహేష్‌ వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా వస్తున్న కారును ఆపి తనిఖీ చేయగా, గంజాయి లభ్యమయింది. షేక్‌ ముజామీల్, షేక్‌ డబ్రేజ్, షేక్‌ ఇమ్రాన్, షేక్‌ రేష్మా అనే వ్యక్తులు ఏపీ 15 ఏసీ 4748 నంబర్‌గల కారు ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. కారులో ఉన్న సుమారు రూ. 25,80,000 విలువైన 175 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరపర్చగా, రిమాండ్‌ విధించారు.

‘ఖమ్మం’ ఘటనలో మరికొందరి ప్రమేయం!
ఖమ్మంఅర్బన్‌: ఖమ్మం నగరంలో రెండు రోజుల క్రితం రూ.44 లక్షల విలువైన గంజాయి పట్టుబడిన ఘటనలో పోలీసులు ఇప్పటికే శంకర్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనలో మరికొందరి ప్రమేయం కూడా ఉందని ప్రచారం సాగుతోంది. గంజాయి దందాపై రవీంద్రనాయక్‌ పేరుతో ఆది వారం జిల్లా ఎస్పీ(కమిషనర్‌)కి సైతం ఫిర్యాదు చేసినట్లు ఒక ప్రకటన వెలుగు చూసింది. ఖమ్మం శ్రీనగర్‌ కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌కు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో నిలిపి ఉన్న ట్రాక్టర్‌ ట్రక్కులో అడుగు భాగంలో నిల్వ ఉంచిన రూ. 44 లక్షల విలువైన 440 కేజీల విలువైన గంజాయిని గత శుక్రవారం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్న విషయం విదితమే. మహబూబాబాద్‌ జిల్లా ఇస్లావత్‌ తండాకు చెందిన శంకర్‌ అనే నింది తుడు నిషేధిత గంజాయిని ఒడిశా రాష్ట్రం నుంచి ఖమ్మం జిల్లా మీదుగా మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఇప్పటికే శంకర్‌తో పాటు, గంజాయి తరలింపు సమయంలో ఎస్కార్టుగా ఉన్న సాన్య అనే యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. గంజాయి దందాపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తే మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు