కల్తీమద్యం కేసులో 175 మంది అరెస్ట్‌

10 Feb, 2019 11:53 IST|Sakshi

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో కల్తీసారా తాగి 77 మంది చనిపోయిన ఘటనలో  175మందిని అరెస్టు చేసినట్లు యూపీ పోలీసులు తెలిపారు. వారిపై వివిధ సెక్షన్ల ప్రకారం 297 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఉత్తరాఖండ్‌, యూపీ ప్రాంతాల్లో శనివారం కల్తీసారా తాగి 77 మంది మరణించిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. దీంతో విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 10 మంది పోలీసు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

అక్రమంగా మద్యం తరలించేవారిపై, కల్తీ మద్యం విక్రయించే వారిపై జాతీయ రక్షణా చట్టం (నేషనల్‌ సెక్యూరిటీ యాక్ట్‌) ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సహరన్‌పుర్‌‌‌లో మృతి చెందిన 46 మందికి పోస్టుమార్టం నిర్వహించగా 36 మంది మంది నాటుసారా కారణంగానే మృతి చెందినట్లు తేలింది. కల్తీ మద్యం నిర్వహిస్తున్న వారివద్ద నుంచి 250 లీటర్లు నాటు సారా, 60లీటర్ల విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.


 

మరిన్ని వార్తలు