వెంబడించి పట్టేశారు

11 Jan, 2020 13:16 IST|Sakshi
పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి ప్యాకెట్లు

తడలో 180 కిలోల గంజాయి స్వాధీనం

భద్రాచలం నుంచి తమిళనాడుకు తరలించేందుకు యత్నం

ముందస్తు సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు

ఒకరిని అదుపులోకి తీసుకున్న వైనం

పరారీలో మరో వ్యక్తి  

నెల్లూరు, తడ: 180 కిలోల గంజాయిని తడ పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీసుల కథనం మేరకు.. తమిళనాడుకు చెందిన కారు నెల్లూరు వైపు నుంచి అనుమానాస్పదంగా వస్తోందని జాతీయ రహదారి వెంబడి పోలీస్‌స్టేషన్లకు నెల్లూరు సీసీఎస్‌ (క్రైమ్‌) సీఐ శ్రీనివాసన్‌ ద్వారా సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన సూళ్లూరుపేట పోలీసులు ఓ చోట కాపుకాశారు. అయితే కారు తప్పించుకుని వేగంగా తడ వైపు వచ్చేసింది.

పారిపోతుండగా..
తడ ఎస్సై జి.వేణు తన సిబ్బందితో శ్రీసిటీ కూడలి సమీపంలో ఏర్పాటుచేసిన ఇసుక చెక్‌పోస్టు వద్ద కాపుకాశారు. అదే సమయంలో అనుమానాస్పద కారు వేగంగా చెక్‌పోస్టు వద్దకు చేరుకుంది. పోలీసులు పట్టుకునేందుకు అప్రమత్తం కాగా కారు డ్రైవర్‌ వారిని చూసి రూటు మార్చి కారుని తిరిగి తడ వైపు మళ్లించాడు. అదే సమయంలో రహదారికి మరో వైపు కాచుకుని ఉన్న కానిస్టేబుల్‌ రాజేష్‌ అప్రమత్తమై పోలీస్‌ వాహనంలో కారును వెంబడించాడు. కారు తడ బజారు కూడలికి వచ్చి శ్రీకాళహస్తి మార్గంలో తప్పించుకునే ప్రయత్నంలో ఉండగా మోటార్‌బైక్‌ అడ్డు రావడంతో దానిని ఢీకొంది. ఈ ఘటనతో కారు వేగం తగ్గడంతో అందులోని ఓ నిందితుడు కిందకు దూకి పరారయ్యాడు. అనంతరం కారు డ్రైవర్‌ మరికొంత దూరం వెళ్లి వాహనాన్ని వదిలి పరారయ్యాడు. అప్రమత్తమైన కానిస్టేబుల్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించి తొలుత కారులోంచి దిగి పారిపోతున్న వ్యక్తిని వెంబడించి పట్టుకున్నాడు. ఇంతలో ఎస్సై, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పట్టుబడిన తమిళనాడు రాష్ట్రం తిరుచ్చికి చెందిన వీరనన్‌తోపాటు కారుని స్టేషన్‌కి తరలించారు.

తిరుచ్చికి వెళుతుండగా..
కారులో పరిశీలించగా రెండేసి కిలోల చొప్పున ఉన్న 90 ప్యాకెట్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిని తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం నుంచి తిరుచ్చికి తరలిస్తున్నట్లుగా గుర్తించారు. దీని విలువ కొనుగోలు ప్రాంతంలో కిలో రూ.8 వేలు ఉంటుందని బహిరంగ మార్కెట్‌లో పదిరెట్లు అధికంగా ఉంటుందని పోలీసులు గుర్తించారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీఎస్‌ సీఐ శ్రీనివాసన్, సూళ్లూరుపేట సీఐ వెంకటేశ్వరరెడ్డి తడకు చేరుకుని నిందితుడిని విచారించారు. పారిపోయిన వ్యక్తితోపాటు స్మగ్లింగ్‌లో కీలకమైన వ్యక్తులను పట్టుకునేందుకు బృందాలుగా విడిపోయి వివిధ ప్రాంతాలకు తరలివెళ్లారు.

మరిన్ని వార్తలు