పైశాచికమా.. ప్రమాదమా?

2 Sep, 2019 09:37 IST|Sakshi
గురజాలలో డాగ్‌ స్క్వాడ్‌తో బాలుడి ఆనవాళ్ల కోసం వెతుకుతున్న పోలీసులు (ఫైల్‌) 

సాక్షి, గుంటూరు :  గుర్తు తెలియని అగంతకులు పైశాచికంగా వ్యవహరిస్తూ చిన్నారులను చిదిమేస్తున్నారా..? లేకా ప్రమాదవశాత్తూ పిల్లలు చనిపోతున్నారా..? ప్రస్తుతం పల్నాడులో ఇదే చర్చ కొనసాగుతోంది. మాచర్ల, గురజాల పట్టణాల్లో చోటుచేసుకున్న సంఘటనలే ఇందుకు నిదర్శనం. మాచర్లలో ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో ఏడేళ్ల బాలుడు అదృశ్యమై నాలుగు రోజుల తర్వాత క్వారీ గుంతలో శవమై తేలాడు. తాజాగా గురజాలలో వారం రోజుల కిందట నాలుగేళ్ల బాలుడు సుభాష్‌ అదృశ్యమై నేటికీ ఆచూకీ లభించలేదు. దుండగులు పిల్లలను కిడ్నాప్‌ చేసి హత్య చేస్తున్నారా..? ఏమైనా ప్రమాదాలకు గురై చిన్నారులు మృత్యువాత చెందుతున్నారా అనే విషయం నేటికీ పోలీసులు తేల్చకపోవడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. అభం శుభం తెలియని చిన్నారుల నిండు నూరేళ్ల జీవితాలు అర్ధంతంగా కొడిగడుతున్నాయి.

అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులకు జీవితకాలం శిక్ష పడుతోంది. ఉన్నతంగా పెంచి ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనుకున్న వారికి తీరని శోకమే మిగులుతోంది. చిన్నారులు అదృశ్యమైన తర్వాత బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేస్తే కిడ్నాప్‌ కేసు నమోదు చేసి సరిపెట్టుకుంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మాచర్లలో, తాజాగా ఆగస్టు 25న గురజాలలో ఇద్దరు బాలురు అదృశ్యం ఆ ప్రాంత వాసుల్లో కలకలం రేపుతుంది. ఆయా కేసుల్లో నిందితులను గుర్తించడం పోలీసులకు సైతం మిస్టరీగానే మిగిలింది. ఆధునిక పరిజ్ఞానం ఎంత ఉన్నా నిందితుల గుర్తింపులో నెలలు గడుస్తూనే ఉన్నాయి. కేసులను కొలిక్కి తీసుకురావడంలో పోలీసుల వైఖరిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సంఘటనలు జరిగిందిలా..
మాచర్లలోని నెహ్రూనగర్‌కు చెందిన వెంకటేశ్వరనాయక్‌  వెల్ధుర్తి మండలంలో ఉపాధ్యాయుడిగా పని చేస్తుంటాడు. ఇంటి వద్ద భార్య సరోజనీబాయ్‌ కుమారుడు సాయిసాధిక్‌ ఉరఫ్‌ సిద్దు (7) ఈ ఏడాది ఏప్రిల్‌ 22న ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు.  తండ్రి ఫిర్యాదుతో మాచర్ల టౌన్‌ పోలీసులు కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు. నాలుగు రోజుల అనంతరం బాధితుడి ఇంటికి కొద్ది దూరంలో ఉన్న క్వారీలోని నీటిలో సిద్దు శవమై తేలాడు. కిడ్నాప్‌ కేసును అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు మార్చి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ ఆ కేసులో మిస్టరీ వీడలేదు. బాలుడు ఆడుకుంటూ వెళ్లి నీటిలో పడ్డాడా లేకపోతే ఎవరైనా తీసుకెళ్లి పడేశారా అనే విషయం పోలీసులకు అంతు పట్టడం లేదు. లేకుంటే మరేమైనా కారణాలున్నాయా అనే కోణాల్లో ఇప్పటికీ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది.  

బాలుడి తల్లిదండ్రులు సైతం తమ బిడ్డను ఎవరో పొట్టనపెట్టాకున్నారని అప్పట్లో అనుమానాలు వ్యక్తం చేసి రూరల్‌ ఎస్పీకి సైతం ఫిర్యాదు చేశారు. తాజాగా గురజాలకు చెందిన గురవయ్య వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తాడు. ఇద్దరు మగ పిల్లలున్నారు. పెద్ద కుమారుడు సుభాష్‌ ఇంటి ఎదురు ఆడుకుంటుండగా  గత నెల 25న గుర్తు తెలియని అగంతకులు కిడ్నాప్‌ చేశారు. విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు. మరో ఐదు రోజులకు (అగస్టు 30వ తేదీన) బాధితుడి ఇంటి సమీపంలోని ముళ్ళ పొదల్లో బాలుడు అదృశ్యం అయిన సమయంలో వేసుకున్న లాగు, టీషర్టు రక్తపు మరకలతో తడిచి వేర్వేరు చోట్ల పడేసి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

రంగలోకి దిగిన పోలీసులు, డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీం సిబ్బంది ఆధారాలు సేకరించారు. పోలీస్‌ జాగిలం కూడా బాలుడు ఇంటి వద్ద నుంచి బట్టలు ఉన్న చోటకు వచ్చి నిలిచిపోయింది. ఎలాంటి క్లూ దొరకలేదు. ఇదిలా ఉంటే మా బిడ్డను ఎవరో హతమార్చారంటూ తల్లిదండ్రులు ఇప్పటికీ గుండెలవిసేలా ఏడుస్తున్నారు. అసలు బాలుడు ఉన్నాడా..? లేదా..? అనే విషయంలో పోలీసులు కూడా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. కిడ్నాప్‌ చేసిన దుండగులు బట్టలకు రక్తపు మరకలు పూశారా? లేకుంటే నిజంగానే పొట్టన పెట్టుకున్నారా? అనే సందేహంలోనే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం బాధితుడికి చెందిన బంధువులను పోలీసులు విచారిస్తున్నారు. 

సీసీ కెమెరాలు ఉన్నట్లయితే...
నియోజకవర్గ హెడ్‌ క్వార్టర్‌గా ఉన్న గురజాలలో కనీసం ప్రధాన రహదారులను కవర్‌ చేసేలా ఒక్కచోట కూడా సీసీ కెమెరాలు లేవు. ప్రధాన దుకాణదారులు, అపార్టుమెంట్లు వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. కనీసం కొందరు కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేందుకు సుముఖత చూపకపోవడంతో పోలీసులు సైతం చేతులెత్తేశారు. అదే సీసీ కెమేరాలు ఉన్నట్లయితే ఇలాంటి సందర్భాల్లో ఉపయోగకరంగా ఉండేదని పోలీసులు చర్చించుకుంటున్నారు.      ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్థానిక ప్రజలకు అవగాహన కల్పించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకోవాలి.  

>
మరిన్ని వార్తలు