నిర్మాతపై కోర్టులో కేసు వేసిన దర్శకుడు

27 May, 2019 14:25 IST|Sakshi

చేతన్‌ భగత్‌ రాసిన ‘2 స్టేట్స్‌’ నవల ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘2 స్టేట్స్‌’. అడవి శేష్, శివానీ రాజశేఖర్‌ హీరోహీరోయిన్లు. వెంకట్‌ రెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ ఎంఎల్‌వి సత్యనారాయణ (సత్తిబాబు) ఈ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దాదాపు 70 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ అర్థాంతరంగా ఆగిపోయింది. స్టోరి విషయంలో దర్శకునికి, నిర్మాతకు మధ్య విబేధాలు తలెత్తడంతో చిత్రీకరణ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో దర్శకుడు వెంకట్‌ రెడ్డి.. చిత్ర నిర్మాత ఎంఎల్‌వి సత్యనారాయణపై కోర్టులో కేసు వేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు వెంకట్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘వివి వినాయక్‌ దగ్గర అసిస్టెంట్‌ దర్శకుడిగా పని చేసిన నేను ‘2స్టేట్స్‌’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాను. షూటింగ్‌ ప్రారంభిచడానికి ముందే హీరో, హీరోయిన్‌, నిర్మాతకు కథను పూర్తిగా వినిపించి అందరి అనుమతి తీసుకున్నాను. ఆ తర్వాతే షూటింగ్‌ మొదలు పెట్టాను. ఇప్పటికే దాదాపు 70 శాతం షూటింగ్‌ పూర్తయింది. ఇప్పటి వరకూ వచ్చిన అవుట్‌పుట్‌ విషయంలో మా టీం చాలా సంతృప్తిగా ఉంది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత ఎంఎల్‌వి సత్యనారాయణ పేపర్‌, సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం కూడా చేశారు’ అన్నారు.

అయితే ‘సినిమా బాగా వస్తున్న సమయంలో కథలో మార్పులు చేయాల్సిందిగా నిర్మాత నన్ను కోరాడు. అందుకు నేను తిరస్కరించాను. దాంతో ఈ ప్రాజెక్ట్‌ నుంచి నన్ను తప్పించేందుకు నిర్మాత నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి నన్ను​ తొలగించే ప్రయత్నం జరుగుతుందని తెలిసి నేను నిర్మాత ఎంఎల్‌వి సత్యనారాయణపై కోర్టులో కేసు వేశాను. ఈ నెల 30 లోపు వివరణ ఇవ్వాల్సిందిగా కోర్టు నిర్మాతను ఆదేశించింది. ఈ సినిమాకు నేను దర్శకత్వంతో పాటు.. భాగస్వామి, ప్రాఫిట్‌ హోల్డర్ని కూడా. ‘2స్టేట్స్‌’ రిమేక్‌ రైట్స్‌లో భాగంగా చేసుకున్న అగ్రిమేంట్‌ ప్రకారం ఈ సినిమాకు దర్శకత్వం వహించే హక్కులు పూర్తిగా నాకే ఉన్నాయ’న్నారు.

మిగిలిన 30 శాతం షూటింగ్‌ను తాను కాకుండా.. మరేవరైనా పూర్తి చేయాలని ముందుకు వస్తే వారి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. కోర్టుతో సంప్రదించిన తర్వాత మిగతా విషయాలు బయటపెడతానని దర్శకుడు వెంకట్‌ రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు