ముగ్గురు అన్నదమ్ములు.. 33 కేసులు

18 Feb, 2020 11:39 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ సురేందర్‌, పోలీసులు స్వాధీనం చేసుకున్న కారు

దాబాలో దోపిడీ ఘటనలో ఇద్దరు నిందితుల అరెస్టు

అన్నదమ్ములు కలిసి తరచూ చోరీలు

 వివరాలు వెల్లడించిన ఏసీపీ సురేందర్‌

సాక్షి, కొత్తూరు(రంగారెడ్డి) :  కొత్తూరు మండల పరిధిలోని తిమ్మాపూర్‌ శివారులో జాతీయ రహదారి పక్కనున్న ఓ దాబాలో ఆదివారం తెల్లవారుజామున యజమానిపై దాడి చేసి దోపిడీకి పాల్పడిన ఘటనలో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. సోమవారం స్థానిక ఠాణాలో షాద్‌నగర్‌ ఏసీపీ సురేందర్‌ కేసు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టకు చెందిన సయ్యద్‌ సోహిల్, సయ్యద్‌ సాహిల్, సయ్యద్‌ మొహమ్మద్‌ ముగ్గురు అన్నదమ్ములు. వీరికి నగరంలోని టోలీచౌకికి చెందిన ఎండీ షారూఖ్, షాలిబండకు చెందిన అలీబిన్‌ హుస్సేన్‌ స్నేహితులు. వీరు ఈనెల 16న ఎక్కడైనా చోరీ చేద్దామని పథకం వేశారు. వీరంతా కలిసి తమ స్నేహితుడు అబ్దుల్‌ రాయిస్‌కు చెందిన కారును పని ఉందని చెప్పి తీసుకున్నారు.

అనంతరం నగరం నుంచి జాతీయ రహదారి మీదుగా అర్ధరాత్రి సమయంలో షాద్‌నగర్‌ వరకు వెళ్లారు. ఎక్కడా చోరీకి అనువైన ప్రాంతం కనిపించకపోవడంతో తిరుగు పయణమయ్యారు. తిమ్మాపూర్‌ శివారులోని అమూల్య దాబాను గమనించారు. అక్కడ సాహిల్, సోహైల్, అలీబిన్‌ హుస్సేన్‌ గోడ దూకి దాబాలోకి వెళ్లగా కారులో ఉన్న మరో ఇద్దరు కాపలాగా ఉన్నారు. దాబాలో నిద్రిస్తున్న యజమాని భరత్‌రెడ్డిపై చాకుతో దాడి చేసి రూ. 8,500 నగదు, స్మార్ట్‌ఫోన్‌ను చోరీ చేసి కారులో హైదరాబాద్‌ వైపునకు పారిపోయారు. కొద్దిపేపటికి దాడి నుంచి తేరుకున్న అనంతరం బా«ధితుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. నిందితులు వినియోగించిన కారు సోమవారం కొత్తూరు వైపునకు వస్తుందనే సమాచారంతో స్థానిక వై జంక్షన్‌ కూడలిలో వాహనాలను తనిఖీ చేపట్టారు. పోలీసులను గమనించిన నిందితులు కారును ఆపకుండా ముందుకు వెళ్లారు.

దీంతో పోలీసులు వారి వాహనాన్ని వెంబడించి పెంజర్ల కూడలికి సమీపంలో ఓ వెంచర్లో పట్టుకున్నారు. వారిని విచారించగా దాబాలో దోపిడీ నేరాన్ని అంగీకరించారు. కారులో ఉన్న సోహైల్, షారూఖ్‌ను రిమాండుకు తరలించగా మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా సాహిల్, సోహైల్, మొహమ్మద్‌పై నగరంలోని పలు ఠాణాల్లో 33 చోరీ కేసులు ఉన్నట్లు తెలిపారు. వీరిపై పీడీ యాక్టు నమోదు చేయనున్నట్లు ఏసీపీ చెప్పారు. కేసును ఒకే రోజులో ఛేదించిన కొత్తూరు ఇన్‌స్పెక్టర్‌ చంద్రబాబు బృందాన్ని ఈ సందర్భంగా ఏసీపీ సురేందర్‌ అభినందించారు.  

సీసీ కెమెరాల సాయంతో.. 
దాబాలో జరిగిన దోపిడీ కేసును పోలీసులు సీసీ కెమెరాల సాయంతో ఒకేరోజు ఛేదించారని ఏసీపీ సురేందర్‌ తెలిపారు. దాబాలో సీసీ కెమెరాలు ఉండటంతో నిందితులను సులువుగా పట్టుకున్నామన్నారు. ప్రజలు హోటళ్లు, ఇళ్ల ఎదుట ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు