దయ లేని విధి

20 Nov, 2019 08:26 IST|Sakshi
తల్లిదండ్రులతో బాలుడు(ఫైల్‌) 

ఆ చిట్టితండ్రి కన్ను తెరిచి రెండేళ్లు కూడా కాలేదు. అప్పుడే ఆ కళ్లు శాశ్వతంగా మూతబడ్డాయి. పలుకు నేర్చుకుని ఏడాదైనా నిండలేదు. అప్పుడే ఆ గొంతు మూగబోయింది. తప్పటడుగులు వేయడం ఇంకా ఆపనేలేదు. బతుకే ముగిసిపోయింది. ఒక్క నిమిషం.. ఒకే ఒక్క నిమిషం వేచి ఉంటే ఆ పిల్లాడు అమ్మ దగ్గర ఆడుకునేవాడేమో. ఆ ఒక్క నిమిషం గాభరా పడకుండా ఉంటే ఈ పాటికి నాన్న మెడపై చేతులు వేస్తూ అల్లరి చేస్తుండేవాడేమో. దయ లేని విధి ఆ కనికరం చూపలేకపోయింది. అమ్మానాన్నలతో సరదాగా బైక్‌పై వెళ్తున్న బాలుడిని కాటికి పంపి తన వికృత రూపం చూపింది.

సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్‌: ఎచ్చెర్ల మండలం చిలకపాలెం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండేళ్ల బాలుడు హిమశంకర్‌ కన్నుమూశాడు. రెప్పపాటులో జరిగిన ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు గాయాలతో బయటపడగా.. వారికి శోకాన్ని మిగుల్చు తూ ఈ బుజ్జాయి అనంత లోకాలకు వెళ్లిపోయాడు. ఈ విషాదకర దృశ్యాన్ని చూసి అక్కడున్న వారంతా కంటతడి పెట్టారు. పొందూరు మండలం మజ్జిలపేట గ్రామానికి చెందిన తమిరి శ్రీను, భువనేశ్వరి దంపతులు తమ కుమారుడు హిమశంకర్‌ను తీసుకుని శ్రీకాకుళం పట్టణంలోని బలగకు వచ్చారు. బలగలోని భువనేశ్వరి కన్నవారింటి వద్ద హిమశంకర్‌ చక్కగా ఆడుకున్నాడు. వీరు పొందూరు నుంచి వచ్చేటప్పుడు కింతలి, కనిమెట్ట మార్గం గుండా వచ్చారు. తిరుగు ప్రయాణంలోనూ ఇదే దారిలో వెళ్లాలి. అయితే పొందూరు మండలం లోలుగులో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి అక్కడ నుంచి రాపాకపై నుంచి మజ్జిలపేట వెళ్లాలని నిశ్చయించుకున్నారు.

ఈ మార్పే బాలుడి మరణానికి కారణమైందేమో. బంధువుల ఇంటికి వెళ్లేందుకు శ్రీకాకుళం నుంచి జాతీయ రహదారిపై చిలకపాలెం వరకు వచ్చిన వీరు.. ఆ కూడలి వద్ద ఆర్‌అండ్‌బీ రోడ్డుకు యూటర్న్‌ చేస్తుండగా.. అటుగా వస్తున్న లారీ అకశ్మాత్తుగా బైక్‌ను వెనుక నుంచి ఢీకొంది. తల్లి ఒడిలో కూర్చుని ఉన్న బాలుడు తుళ్లిపడిపోవడంతో తలకు బలంగా గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. భువనేశ్వరి కాళ్లకు గాయాలు కాగా, శ్రీను చిన్న గాయాలతో బయటపడ్డాడు. హెల్మెట్‌ పెట్టుకోవడంతో ఈ యనకు ఏమీ కాలేదు. ఆ ఒక్క నిమిషం పాటు లారీడ్రైవర్‌ గానీ, శ్రీను గానీ ఎవరు వేచి ఉన్నా ఈ ప్రమాదం జరగకుండా ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 

మొదటి సంతానం.. 
శ్రీను, భువనేశ్వరి దంపతులకు హిమశంకర్‌ మొదటి సంతానం. దీంతో గారాబంగా పెంచారు. వృత్తి రీత్యా వీరు బంగారు ఆభరణాలు తయారు చేస్తుంటారు. కళ్లెదుటే కన్న కొడుకు చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఆ దృశ్యాలు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించాయి. 108లో క్షతగాత్రులను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలిం చారు. ఎచ్చెర్ల ఎస్‌ఐ రాజేష్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కూడలిలో నిలిచిపోయిన ట్రాఫిక్‌ క్రమబద్దీకరించారు. గ్రామానికి చెందిన బాలుడు చనిపోవడంతో మజ్జిలిపేట అంతా విషాదంలో మునిగిపోయింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా