రెండేళ్ల పాపపై అకృత్యం, హత్య

4 May, 2018 14:48 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మోర్బీ: కామ పిశాచాలకు మరో చిన్నారి బలైంది. గుజరాత్‌లోని మోర్బీ పారిశ్రామిక వాడలో బుధవారం సాయంత్రం తప్పిపోయిన రెండేళ్ల చిన్నారి అత్యాచారం, హత్యకు గురైంది. పోలీసుల వివరాల ప్రకారం.. మోర్బీలోని సిరామిక్‌ ఫ్యాక్టరీలో పనిచేసే వలస కూలీ దంపతుల కూతురు బుధవారం రాత్రి కిడ్నాప్‌కు గురైంది. బాలిక తల్లిదండ్రులు ఆమె కోసం ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఆ రోజు రాత్రంతా గాలించినా ఆచూకీ లభించలేదు. కాగా, అపహరణకు గురైన చిన్నారి దగ్గర్లోని చెరువు వద్ద శవమై కనిపించిందని గురువారం సాయంత్రం పోలీసులు వెల్లడించారు.

ప్రాథమిక విచారణలో చిన్నారి అత్యాచారానికి గురైనట్లు తెలుస్తోందని వారు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత బాలిక మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసు ఉన్నతాధికారి ఒకరు అన్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన ఆగంతకులను పట్టుకునేందుకు ముమ్మర దర్యాప్తు కొనసాగుతోందని ఆయన తెలిపారు.

వలస కార్మికుల సిరామిక్‌..
సౌరాష్ట్ర ద్వీపకల్పంలో మోర్బీ ఒక పారిశ్రామిక పట్టణం. ఇక్కడ ప్రధానంగా సిరామిక్‌, గడియారాల పరిశ్రమలు ఉన్నాయి. సిరామిక్‌ ఫ్యాక్టరీల్లో వలస కార్మికులే ఎక్కువగా పని చేస్తుంటారు. పొట్టచేత పట్టుకొని ఇక్కడికి వస్తే తమ గారాల కూతురుకు ఈ గతి పట్టిందని ఆ వలస కూలీలు కన్నీరు మున్నీరవుతున్నారు. 12 ఏళ్లలోపు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన వారికి మరణదండన విధిస్తూ కేంద్రం పోక్సో చట్టానికి సవరణలు తెచ్చి 15 రోజులు గడుస్తున్నా దేశంలో అకృత్యాలు మాత్రం ఆగడం లేదు.

మరిన్ని వార్తలు