విషాద ‘గీత’మ్‌..

12 Nov, 2017 04:34 IST|Sakshi
మృతురాలు గీత (ఫైల్‌ ఫొటో)

రోడ్డు ప్రమాదంలోఖమ్మం యువతి దుర్మరణం

పెళ్లి బట్టలు కొనేందుకు వచ్చి అనంత లోకాలకు..

టిప్పర్‌ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు

కాబోయే భర్తతో కలసి బైక్‌పై వెళుతుండగా దుర్ఘటన

మరో రెండు వారాల్లో ఆమె పెళ్లి..

కుటుంబంతో కలసి పెళ్లి బట్టలు కొనేందుకు నగరానికి వచ్చింది..
కాబోయే భర్తతో కలసి షాపింగ్‌ ముగించుకుని బైక్‌పై తిరిగివెళుతోంది.
ఇంతలో టిప్పర్‌ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు ఆమెను కబళించింది.

సాక్షి, హైదరాబాద్‌ :  శుక్రవారం రాత్రి సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం పట్టణానికి చెందిన మెడికల్‌ ఆఫీసర్‌ వాల్యానాయక్, రంజితలకు కూతురు గీత(21), కుమారుడు విశ్వచంద్‌ ఉన్నారు. గీత అనంతపూర్‌లో బీఏఎంఎస్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. సూర్యాపేటకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి శబరీనాథ్‌తో గీత వివాహం నిశ్చయమైంది. ఈ నెల 24న వీరి వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి బట్టలు కొనేందుకు గీత, శబరీనాథ్‌తో పాటు ఇరువురి కుటుంబ సభ్యులు శుక్రవారం నగరానికి వచ్చారు. కొత్తపేటలోని ఓ వస్త్ర దుకాణంలో పెళ్లి బట్టలు తీసుకున్నారు. రాత్రి 11 గంటల సమయంలో శబరీనాథ్, గీత బైక్‌పై ఎల్‌బీనగర్‌ వెళుతుండగా.. వెనుక కారులో కుటుంబసభ్యులు వారిని అనుసరిస్తున్నారు. బైక్‌ యూటర్న్‌ తీసుకుంటుండగా అదే సమయంలో ఎల్‌బీనగర్‌ నుంచి వేగంగా దూసుకువచ్చిన హెవీ టిప్పర్‌(ఏపీ29టీఏ3813) వీరి బైక్‌ను ఢీకొట్టింది.

దీంతో వెనక కూర్చున్న గీత రోడ్డుపై పడిపోగా, శబరీనాథ్‌ డివైడర్‌వైపు పడిపోయాడు. గీత తలపై నుంచి టిప్పర్‌ చక్రం వెళ్లడంతో ఆమె తల నుజ్జునుజ్జు అయి అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. వెనుకనే కారులో వచ్చిన ఆమె తల్లిదండ్రులు గీత మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయారు. మరికొద్ది రోజుల్లో పెళ్లిపీటలెక్కాల్సిన కుమార్తెను ఆ పరిస్థితిలో చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. గాయపడ్డ శబరీనాథ్‌ను ఎల్‌బీనగర్‌ కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్‌ను వదిలేసి డ్రైవర్‌ పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న సరూర్‌నగర్‌ పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించి కేసు నమోదు చేశారు.

పెళ్లి బట్టలు కొనేందుకు వచ్చి అనంత లోకాలకు...

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు