పోలీసులమని.. నగలు దోచుకెళ్లారు..

24 Jul, 2019 12:31 IST|Sakshi

వృద్ధురాలికి దొంగల బురిడీ

ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ రామచంద్రరావు

సాక్షి, నూజివీడు: పోలీసులమని చెప్పి ముగ్గురు ఆగంతుకులు వృద్ధురాలి నగలు దోచుకెళ్లిన ఘటన నూజివీడు పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి బాధితురాలు చెప్పిన వివరాలు..  పట్టణంలోని వెంకటేశ్వరస్వామి కోవెల వెనుక భాగాన ఉన్న సాయితేజ అపార్ట్‌మెంట్‌లోని 301 ప్లాట్‌లో రిటైర్డ్‌ ఏఓ ప్రత్తిపాటి రాజకుమారి(68) నివసిస్తున్నారు.

ఆమె కూరగాయల నిమిత్తం రైతు బజారుకెళ్లి తిరిగి వస్తుండగా మధ్యాహ్నం 12.40గంటల సమయంలో వెంకటేశ్వరస్వామి కోవెల వద్దకు రాగానే ముగ్గురు  సివిల్‌ డ్రెస్‌లలోనే ఉండి ‘మేము పోలీసులమని, బంగారు గొలుసులు వేసుకుని తిరిగితే ఎలాగని.. వాటిని తీసి సంచిలో వేసుకుని వెళ్లమని’ సూచించారు. దీంతో ఆమె మెడలోని రెండు పేటల తాడును తీయగా, దానిని కాగితంలో పొట్లం కట్టి ఇస్తామని చెప్పి, చేతులకున్న రెండు గాజులు కూడా తీసివ్వమని కోరగా వాటిని తీసిచ్చింది. ఆభరణాలను కాగితంలో పొట్లం కట్టినట్లే కట్టి పొట్లంను ఆమె బ్యాగ్‌లో వేశారు. ఆ తరువాత ఎవరిదారిన వారు వెళ్లిపోయారు.

ఇంటికి వెళ్లిన తరువాత వృద్ధురాలు బ్యాగ్‌లో పొట్లం కోసం వెతకగా అది లేదు. దీంతో తాను మోసపోయాయని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది.  దాదాపు పది కాసులు ఉంటాయని బాధితురాలి ఫిర్యాదులో పేర్కొంది. సీఐ పీ రామచంద్రరావు, ఆమె ఇంటికి వెళ్లి విచారించారు. అలాగే రైతుబజారు నుంచి ఘటన జరిగిన ప్రాంతం వరకు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

మరిన్ని వార్తలు