ఆశకు పోయి.. అడ్డంగా దొరికాడు..!

8 Feb, 2018 14:45 IST|Sakshi
నల్లగొండ మున్సిపల్‌ కార్యాలయం

చనిపోక ముందే ధ్రువపత్రం ఇప్పించిన రెవెన్యూ అధికార

 హైదరాబాద్‌వాసికి నీలగిరిలో మరణ ధ్రువీకరణ పత్రం

బీమా కంపెనీకి రూ.19 లక్షలు టోకరా 

నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు

నల్లగొండ టూటౌన్‌ : ఆయన విభాగమే రెవెన్యూ.. తన పనులను పక్కన బెట్టి ఇతర విభాగాల్లో వేలు పెట్టి చూశాడు. తన విభాగంలో తీసుకుంటున్న కమీషన్లు సరిపోవని అత్యాశకు పోయాడు.. ఆ అత్యాశే ఇప్పుడు కొంప ముంచింది. కమీషన్ల కోసం కక్కుర్తిపడి చనిపోని వ్యకిక్తి మరణ ధ్రువీకరణ పత్రం ఇప్పించి పోలీసులకు అడ్డంగా దొరికాడు. ఈ ఘటన నీలగిరి మున్సిపాలిటీలో వెలుగుచూసింది. ఏ ఆధారం లేకుండా హైదరాబాద్‌కు చెందిన వ్యక్తికి నీలగిరిలో మరణ ధ్రువీకరణ పత్రం మంజూరు అయ్యిందంటే మన మున్సిపాలిటీ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. డిప్యుటేషన్‌పై  నీలగిరి మున్సిపాలిటీలో పనిచేస్తున్న రెవెన్యూ అధికారి (ఆర్వో) ఆరీపోద్దీన్‌పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్‌ సుల్తాన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రవిశంకర వర్మ అలియాస్‌ కృష్ణమోహన్‌ శర్మ 2016లో మృతిచెందినట్లు నీలగిరి మున్సిపాలిటీ నుంచి మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేశారు.

జిల్లా కేంద్రానికి చెందిన మాజీ కౌన్సిలర్‌ సోదరుడు కృష్ణమోహన్‌ శర్మ గుంటూరులో ఆత్మహత్య చేసుకున్నాడని.. అక్కడ మరణ ధ్రువీకరణ తీసుకుంటే ఆయనకు వచ్చే బీమా డబ్బులు రావని, సాధారణ మరణంతో చనిపోయినట్లు ధ్రువపత్రం ఇప్పించాలని మున్సిపల్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్వోను సంప్రదించాడు. ఆయన కుటుంబానికి బీమా (ఇన్సూరెన్స్‌) కార్యాలయం నుంచి డబ్బులు రావాలంటే సర్టిఫికెట్‌ తప్పని సరి అని చెప్పాడు. ద్రువపత్రం జారీ చేసినందుకు కొంత నగదు ముట్టజెప్పుతానని ఆర్వోతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. సుమారుగా రూ. 50 వేలకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. తర్వాత జనన, మరణ ద్రువపత్రాల విభాగం ఉద్యోగులపై ఒత్తిడితెచ్చి మరణ ధ్రువీకరణ పత్రం ఇప్పిం చాడు. నల్లగొండ పట్టణానికి ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తికి మరణ ద్రువీకరణ పత్రం జారీ చేసిన విషయం బహిర్గతం కావడంతో రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. 
 

బీమా కంపెనీకి టోకరా..
మున్సిపల్‌ ఉద్యోగులు జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రంతోనే కృష్ణమోహన్‌ శర్మ హైదరాబాద్‌లోని బీమా కార్యాలయంలో రూ.19 లక్షలు క్లయిమ్‌ చేశారు. ఇలా కృష్ణమోహన్‌ శర్మ బీమా కంపెనీకి టోకరా పెట్టాడు. ఆయనకు తెలిసిన నల్లగొండలోని మాజీ కౌన్సిలర్‌ సోదరుడి ద్వారా ఇక్కడి ధ్రువపత్రం సంపాదించారు. రూ.19 లక్షల క్లయిమ్‌పై అనుమానం వచ్చిన బీమా కంపెనీ కార్యాలయం బాధ్యులు హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం బయట పడింది. అక్కడి పోలీసులు వచ్చి మున్సిపల్‌ కార్యాలయంలోని ఆర్వోతో పాటు మరో ఇద్దరు ఉద్యోగులను హైదరాబాద్‌కు తీసుకెళ్లి విచారించి వారి నుంచి పూర్తి వివరాలు రాబట్టారు. పోలీసుల విచారణలో కృష్ణ మోహన్‌శర్మ చనిపోకుండానే బీమా డబ్బులు క్లయిమ్‌ చేసినట్లు తేలింది. అసలు మరణ ద్రువీకరణ పత్రం ఇవ్వడంతోనే ఇది సాధ్యమైనట్లు పోలీసుల విచారణలో తేలింది. కృష్ణమోహన్‌ శర్మ, మాజీ కౌన్సిలర్‌ సోదరుడు, మున్సిపల్‌ ఆర్వోలపై కేసులు నమోదు చేసి పోలీసులు రిమాండ్‌కు పంపారు. దాంతో ఇక్కడి కార్యాలయంలో అవినీతి, అక్రమాలకు అలవాటు పడిన కొంతమంది ఉద్యోగుల వల్ల మరో మారు  నీలగిరి మున్సిపాలిటీ పేరు రాష్ట్ర రాజధానిలో చర్చనీయాశమయ్యింది. 


పోలీసులు సమాచారం ఇచ్చారు
మరణ ధ్రువపత్రం జారీ చేసిన విషయంలో హైదరాబాద్‌ పోలీసులు ఆర్వో అరీపోద్దీన్‌ అరెస్ట్‌ విషయంపై ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటాం. 
– కె. వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ కమిషనర్‌ 

మరిన్ని వార్తలు