దారుణం: నిద్రిస్తుండగా కత్తితో మెడపై..

11 Feb, 2020 08:30 IST|Sakshi

సాక్షి, చర్ల: దుమ్ముగూడెం మండలంలో భూ తగాదాల నేపథ్యంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు, పోలీసుల కథనం ప్రకారం.. దుమ్ముగూడెం మండలంలోని లచ్చిగూడేనికి చెందిన కారం రామకృష్ణ (35) ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తూ తనకు ఉన్న కొద్దిపాటి సాగుభూమిని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రెండేళ్ల నుంచి అదే గ్రామానికి చెందిన సోందె ముద్దరాజు, అతడి కుమారుడు రవి, కారం రామకృష్ణలకు మధ్య వివాదం సాగుతోంది. వివాదంలో ఉన్న భూమి సోందె ముద్దరాజుకే చెందినదని 8 నెలల క్రితం తహసీల్దార్‌ తేల్చారు. ఆనాటి నుంచి రామకృష్ణ ఆ భూమి జోలికి వెళ్లకుండా వేరే భూమిని సాగుచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కాగా రామకృష్ణను, అతని భార్యను చంపుతామంటూ ముద్దరాజు, రవి తరచూ బెదిరింపులకు పాల్పడుతున్నారు.

ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి సుమారు ఒంటి గంట ప్రాంతంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు రామకృష్ణ ఇంట్లోకి ప్రవేశించారు. ఇద్దరు రామకృష్ణ కాళ్లు చేతులు పట్టుకోగా మరొక వ్యక్తి మెడపై కత్తితో కోశాడు. పక్కనే నిద్రిస్తున్న రామకృష్ణ భార్యకు మెళకువ వచ్చి అడ్డుకోబోయింది. దీంతో కత్తితో ఆమె చేయిపై కోసి కర్రతో తలపై కొట్టి హతమార్చే ప్రయత్నం చేశారు. ఆమె తప్పించుకుని బయటకు వచ్చి గట్టిగా కేకలు వేయడంతో నిందితులు పారిపోయారు. తీవ్రంగా గాయపడిన రామకృష్ణను భద్రాచలం వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి భార్య తులసి ఫిర్యాదు మేరకు దుమ్ముగూడెం సీఐ ఎన్‌.వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు