దారుణం: బాలికపై సామూహిక అత్యాచారం

28 Feb, 2020 08:40 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: మృగాళ్లు రెచ్చిపోయారు.. అభం శుభం తెలియని బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మూడు రోజులు ముగ్గురు కామాంధులు అత్యాచారానికి పాల్పడడం కరీంనగర్‌లో కలకలం సృష్టించింది. తీవ్ర అస్వస్థతకు గురైన బాలికను ఆస్పత్రికి తరలించగా.. ఈ అమానుష ఘటన గురువారం వెలుగుచూసింది. నిర్భయ, సమత కేసుల్లో నిందితులకు న్యాయస్థానం ఉరి శిక్ష విధించినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కరీంనగర్‌లోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన బాలిక(9) ఆదర్శనగర్‌లో మూడో తరగతి చదువుతోంది. తండ్రి ఆటోడ్రైవర్‌ కాగా.. తల్లి వస్త్ర దుకాణంలో పని చేస్తోంది. తల్లిదండ్రులు పనులకు వెళ్లగా.. బాలికకు జ్వరం రావడంతో ఇంటి వద్ద ఉంటోంది. వీరి ఇంటికి సమీపంలో ఉండే వినోస్‌(20) సోమవారం బాలికను ఆడుకుందామని చెప్పి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం రవితేజ(18), మరో బాలుడికి చెప్పాడు. ముగ్గురూ కలిసి మంగళ, బుధవారాల్లో పైశాచికంగా అత్యాచారానికి ఒడిగట్టారు.

బాలిక తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లగా విషయం బయటపడింది. త్రీటౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలికను ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. గురువారం ఉదయం నుంచి పోలీసులు సంబంధిత సాక్షులు, అక్కడి ప్రాంతంలో నివాసం ఉండే పలువురిని విచారించారు. మరికొందరిని పోలీసుస్టేషన్‌కు పిలిపించి విచారణ జరిపారు. సంబంధిత సాక్ష్యాధారాలు, ఘటన జరిగిన ప్రాంతంలో పలు ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయంలో ఇప్పటికే పలువురు సాక్షులను విచారించి స్టేట్‌మెంట్లు రికార్డు చేస్తున్నట్లు తెలిసింది. ఒకటి, రెండు రోజుల్లో నిందితుల అరెస్టు చూపించనున్నట్లు సమాచారం.  

చాలా రోజుల నుంచి కన్నేసి...
భవన నిర్మాణ పనులు చేసే యువకుడు వినోస్‌ చాలా రోజుల నుంచే బాలికపై కన్నేసినట్లు తెలుస్తోంది. బాలిక తల్లిదండ్రులు లేని సమయంలో మూడు రోజులపాటు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అభంశుభం తెలియని అభాగ్యురాలిపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో కరీంనగర్‌లో కలకలం రేపింది.

పోలీసు కమిషనర్‌ విచారణ 
అంబేద్కర్‌నగర్‌లో గురువారం కరీంనగర్‌ పోలీసు కమిషనర్‌ వీబీ.కమలాసన్‌రెడ్డి పర్యటించి విచారణ జరిపారు. అత్యాచారం జరిగిన ఇంటిని పరిశీలించారు. బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు సేకరించారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని కాలనీవాసులు, కుటుంబ సభ్యులు కమిషనర్‌ను కోరారు. కాగా, బాలికపై అత్యాచారం చేసిన నిందితులపై పోక్సో, అత్యాచార కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు త్రీటౌన్‌ సీఐ విజ్ఞాన్‌రావు తెలిపారు. 

మహిళల ఆందోళన
మద్యందుకాణాల వల్లనే ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయని నిరసిస్తూ కరీంనగర్‌ అబ్కారీ డీసీ కార్యాలయం ఎదుట దళిత సంఘాలు, బీజేపీ నాయకులు, వివిధ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఆదర్శనగర్‌బోర్డు వద్ద ఉన్న మద్యం దుకాణం వద్ద మందుబాబుల ఆగడాలు మితివీురుతున్నాయని, మద్యం మత్తులోనే బాలికపై అత్యాచారం చేశారని ఆరోపించారు. అనంతరం ఆదర్శనగర్‌లో ఉన్న మద్యం దుకాణంపై చర్యలు తీసుకోవాలని ఆబ్కారీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన తర్వాత ఆబ్కారీ టౌన్‌సీఐ తాతాజీకి వినతిపత్రం అందించారు. స్థానిక కార్పొరేటర్‌ కుర్ర తిరుపతి, కార్పొరేటర్లు జయశ్రీ, విజయ, నాయకులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు