ముగ్గురు ఖాకీలపై వేటు!

25 Dec, 2019 09:34 IST|Sakshi

ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు,

ఒక కానిస్టేబుల్‌పై అవినీతి ఆరోపణలు

ఇసుక వ్యాపారులతో వసూళ్లు,

అవినీతి ఆరోపణలే ప్రధాన కారణం?

సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేసిన ఎస్పీ రెమో రాజేశ్వరి

సాక్షి, మహబూబ్‌నగర్‌ : కాపాడాల్సిన కంచె చేను మేస్తే? జిల్లాలో కొందరు పోలీసు అధికారుల తీరు ఇదే చందంగా ఉంది. బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించడంతో పాటు అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వారు దందాలకు అలవాటుపడ్డారు. అవినీతి అలవాటుపడిన కొందరు పోలీస్‌ సిబ్బంది దర్జా వెలగబెడుతున్నారు. నిత్యం డబ్బు దండుకోవడమే కాకుండా మందు పార్టీల్లో మునిగి తేలుతూ ఆశాఖకు మాయని మచ్చ తీసుకొస్తున్నారు. పోలీస్‌ శాఖపై ఉన్నత అధికారులు ఎంత దృష్టి పెట్టిన.. క్షేత్రస్థాయిలో అవినీతికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మిడ్జిల్‌ మండల పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్‌ కానిస్టేబుల్స్‌ ఎండీ సాదతుల్లా(144), చంద్రునాయక్‌ (350), మూసాపేట పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రాజు(2320)లను ఎస్పీ రెమా రాజేశ్వరి మంగళవారం సస్పెన్షన్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ముగ్గురు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో ప్రత్యేకంగా విచారణ చేసి ఆ తర్వాత వేటు వేసినట్లు తెలిసింది. ప్రస్తుతం సస్పెన్షన్‌కు గురైన సిబ్బంది ఇసుక వ్యాపారుల దగ్గర ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడ్డారని, ఒక్కో ట్రాక్టర్, టిప్పర్‌కు ఇంత రేటు ఏర్పాటు చేసి వసూలు చేసినట్లు సమాచారం. దీనిపై సిబ్బంది పడిన ఒకరిద్దరు ఇసుక వ్యాపారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. 

ఇసుక వ్యాపారులే టార్గెట్‌ 
మహబూబ్‌నగర్‌ జిల్లాలో కొన్ని పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇసుక వ్యాపారం జోరుగా సాగుతుంది. ఇసుక రూపంలో డబ్బులు అధికంగా వస్తున్న క్రమంలో పోలీసులు సైతం దీనిపై కొంచెం ఎక్కువ దృష్టి పెట్టారు. దీంట్లో ప్రధాన పాత్ర కానిస్టేబుల్స్‌ పోషిస్తున్నారు. రాత్రి, తెల్లవారుజాము వేళలో ఇసుక రీచ్‌లకు ద్విచక్ర వాహనాలపై వెళ్లి వసూళ్లు చేస్తున్నారు. దందాలను ఆపాల్సిన వారే అనధికారిక కార్యకలాపాలకు తెరదీస్తున్నారు.

మరిన్ని వార్తలు