జామకాయలు తీసుకురాలేదని.. ఛాతిలో గుద్ది

29 Jan, 2020 09:51 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లక్నో : జామకాయలు కొనుక్కుని రాలేదని ఓ విద్యార్థిని తోటి విద్యార్ధులు తీవ్రంగా కొట్టి చంపారు. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని లఖీంపూర్‌ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అమీన్‌నగర్‌ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఫర్మాన్‌ ఖురేషి అనే విద్యార్థి  6వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో శనివారం పాఠశాల ముగిసిన తర్వాత జామకాయ విషయంలో ముగ్గురు స్నేహితులతో గొడవ ఏర్పడింది. అనంతరం తమకు సోమవారం జామకాయలు కొనుక్కొని రావాలని ముగ్గురు విద్యార్థులు ఫర్మాన్‌ను డిమాండ్‌ చేశారు. దీనికి ఫర్మాన్‌ నిరాకరించాడు. మరుసటి రోజు తమ బంధువు తైహిద్‌తో కలిసి పాఠశాలకు వచ్చిన ఫర్మాన్‌ జామకాయలు తీసుకు రాలేదు. ఈ విషయం తెలుసుకున్న ముగ్గురు కోపానికి గురై విద్యార్థిపై తీవ్రంగా దాడి చేశారు. విద్యార్థిని కింద పడేసి అతనిపై కూర్చొని ఛాతిపై కొట్టారు.

ఇది గమనించిన పాఠశాల ఉపాధ్యాయులు పోలీసులలకు సమాచారం ఇచ్చారు. తీవ్ర గాయాలైన విద్యార్థిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించాడని వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. పాఠశాలకు చేరుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఖురేషి తండ్రి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్‌ 302(హత్య) కేసు కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఇదిలా వుండగా తాము ఉద్దేశ్యపూర్వకంగా విద్యార్థిని చంపలేదని కేవలం కడుపులో మాత్రమే కొట్టామని నిందితుల్లోని ఓ విద్యార్థి తెలిపాడు. కాగా ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ.. నిందితుల్లో ఒకరు మాత్రమే మృతిడిని కొట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు పేర్కొన్నారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగినట్లు అనిపిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ముగ్గురు నిందితులను జువైనల్‌ హోంకు తరలించామని తదుపరి విచారణ కొనసాగుతుందని ఆయన తెలిపారు

మరిన్ని వార్తలు