డబ్బులు దొంగిలించిన మహిళల అరెస్టు

12 Oct, 2019 10:54 IST|Sakshi

న్యూఢిల్లీ: ఏటీఎమ్‌ వద్ద మాజీ సైనికుడి నుంచి డబ్బులు దొంగిలించినందుకు ముగ్గురు మహిళలను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాలు.. దక్షిణ ఢిల్లీలోని హౌజ్‌ ఖాస్‌ గ్రామంలో నివసిస్తున్న 73 ఏళ్ల  వ్యక్తి ఏటీఎమ్‌ నుంచి రూ.40,000 విత్‌డ్రా చేసి బయటకు వస్తున్న సమయంలో ముగ్గురు మహిళలు ఆయనను అడ్డుకొని బెదిరించి జేబులో నుంచి డబ్బులు లాక్కొని వెళ్లిపోయారు. ఆ సమయంలో ఏటీఎమ్‌లో, చుట్టుపక్కలా ఎవరూ లేకపోవడంతో నిరాశ్రయుడైన ఆ వృద్ధుడు చూస్తూ ఉండిపోయాడు. అనంతరం పోలీసులను ఆశ్రయించాడు. ఏటీఎమ్‌లో డబ్బులు తీస్తున్న సమయంలో ఇద్దరు మహిళలు ఏటీఎమ్‌లోకి వచ్చారని.. వారిని బయట నిల్చొమని చెప్పినా వినలేదని.. అక్కడ సమయానికి ఎవరు లేకపోవడంతో ఏమీ చేయలేకపోయానని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు. 

ఈ క్రమంలో సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించగా ఆ ముగ్గురి నిందితుల బాగోతం బయటపడింది. అనంతరం ముగ్గురు మహిళలు దొంగింలించిన డబ్బులను పంచుకోడానికి ఓ పార్కులోకి వచ్చారని సమాచారం అందడంతో అప్రమత్తమైన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించిన మొత్తాన్ని పోలీసులు బాధితుడికి అందించారు. నిందితులు మధ్యప్రదేశ్‌లోని రాజ్ఘర్ జిల్లకు చెందిన వారని, వీరికి మరో కేసుతో కూడా సంబంధం ఉందని పోలీసులు వెల్లడించారు. పండగలు, వేడుకలు వంటి సీజన్లలో నగరానికి వచ్చి రద్దీ ఎక్కువగా ఉండే బ్యాంకులు, మార్కెట్లు, ఏటీఎమ్‌ ప్రదేశాలలో సంచరించి అనుకూలంగా ఉన్న సమయంలో ఇలా వ్యక్తుల నుంచి డబ్బులు, ఆభరణాలు దొంగిలిస్తారని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు