ఒక ఘరానా దొంగ..ఇంటి చుట్టూ 32 కెమెరాలు

30 Mar, 2018 03:25 IST|Sakshi

భద్రత కోసం ఏర్పాటు చేసుకున్న హైటెక్‌ దొంగ ఖాజం అలీ

అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ సాయంతో పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌తోనూ ఇతడి కుటుంబానికి వైరం 

ఖాజం అలీ చదివింది ఓ ప్రతిష్టాత్మక స్కూల్‌లో.. 

వ్యసనాలకు బానిసై దొంగతనాల బాట

సాక్షి, హైదరాబాద్‌:  ఇంటి చుట్టూ 32 సీసీటీవీ కెమెరాలు.. వీటిలోని ఫీడ్‌ను రికార్డ్‌ చేయడానికి, లైవ్‌లో చూడటానికి నాలుగు డిజిటల్‌ వీడియో రికార్డర్స్‌(డీవీఆర్‌లు).. ఈ మాటలు చెప్పగానే.. ఎవరో పెద్ద రాజకీయ నాయకుడి నివాసమో లేక పోలీసు ఉన్నతాధికారి గృహమో అనుకుంటున్నారా..? కానే కాదు.. అది ఓ ఘరానా దొంగ ఇల్లు. భద్రత కోసం ఈ హైటెక్‌ దొంగ ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఎలక్ట్రీషియన్‌ ముసుగులో ల్యాప్‌టాప్‌ బ్యాగ్‌తో టిప్‌టాప్‌గా తిరుగుతూ పట్టపగలే ఇళ్లలో చోరీలకు పాల్పడే ఇతగాడి పేరు మీర్‌ ఖాజం అలీ ఖాన్‌. ఇతను పదో తరగతి వరకూ ఓ ప్రతిష్టాత్మక పబ్లిక్‌ స్కూల్‌లో చదవడం గమనార్హం. చివరికి నగర పోలీసు విభాగం వినియోగిస్తున్న అత్యాధునిక పాపిల్లన్‌ సాఫ్ట్‌వేర్‌ సాయంతో అతను దొరికిపోయాడు. ఈ ఘరానా నేరగాడి నుంచి రూ.18 లక్షల విలువైన 55 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 

మంచం పట్టి.. వ్యసనాలకు బానిసై.. 
ఆర్‌ఎంపీ డాక్టర్‌ అయిన మీర్‌ అక్బర్‌ అలీ ఖాన్‌ తన కుమారుడు ఖాజం అలీని చదువు నిమిత్తం ప్రతిష్టాత్మకమైన ఓ పబ్లిక్‌ స్కూల్‌లో చేర్పించాడు. ఆ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సమయంలో జరిగిన ఓ ప్రమాదం అతని జీవితాన్ని మార్చేసింది. ఓ భవనంపైన పతంగులు ఎగురవేస్తుండగా ఖాజం కాలు జారి కింద పడటంతో రెండేళ్ల పాటు మంచానికే పరిమితమయ్యాడు. ఈ సమయంలో పరిచయమైన వారు వ్యసనాలు అలవాటు చేయడంతో వాటికి బానిసగా మారాడు. జల్సాలు.. అవసరాల కోసం ఆ స్నేహితులతోనే కలసి చోరీలు చేయడం మొదలుపెట్టాడు. ఇలా వరుస చోరీలు చేసి జైలుకు వెళ్లాడు. జూబ్లీహిల్స్‌ ఠాణాలో నమోదైన కేసులో అరెస్టు అయినప్పుడు నగర పోలీసులు ఇతడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. ఏడాది పాటు జైల్లో ఉన్న అలీ 2016 జూన్‌ 28న బయటకు వచ్చాడు. 

ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టి...: ప్రస్తుతం టోలిచౌకిలోని సూర్యనగర్‌లో నివసిస్తున్న ఖాజం అలీ ఇల్లు ఒకప్పుడు అక్కడి ఫ్లైఓవర్‌ పక్కన ఉండేది. ఈ ఇంటి స్థలానికి సంబంధించి ఇతడి కుటుంబానికి, గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌కు విభేదాలు ఉండేవి. దీంతో నయీమ్‌ నుంచి ముప్పు ఉంటుందనే ఉద్దేశంతో ఖాజం ఇంటి చుట్టూ 32 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాడు. వీటిలోని ఫీడ్‌ను రికార్డ్‌ చేయడానికి నాలుగు డీవీఆర్‌లు ఏర్పాటు చేసుకున్నాడు. నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ అయిన తర్వాత కూడా కొన్నాళ్ల పాటు సీసీ కెమెరాలు కొనసాగించాడు. ఖాజం 2009–2015 మధ్య నగరంతోపాటు సైబరాబాద్, మెదక్‌ ల్లోని 17 పోలీసుస్టేషన్ల పరిధిలో 29 నేరాలు చేశాడు. 2016 సెప్టెంబర్‌ 6 నుంచి అక్టోబర్‌ 16 మధ్య దాదాపు 40 రోజుల్లో 2 ఠాణాల పరిధిలో 9 నేరాలు చేశాడు.

అప్పట్లో చిక్కినా చెప్పకపోవడంతో... 
ఖాజంను మీర్‌పేట పోలీసులు 2016లో అరెస్టు చేశారు. అయితే ఎనిమిదేళ్ల క్రితం మలక్‌పేట, మంగళ్‌హాట్‌లో చేసిన 180 తులాల బంగారం చోరీ కేసుల్ని అతడు చెప్పలేదు. ఈ కేసుల్ని బాధితులు, పోలీసులూ దాదాపు మర్చిపోయారు. అయితే నగర పోలీసు విభాగం కొన్నాళ్ల క్రితం అందుబాటులోకి తెచ్చిన ‘పాపిల్లన్‌’సాఫ్ట్‌వేర్‌ ఖాజం ‘గతాన్ని’విప్పింది. ఆ నేరాలు జరిగినప్పుడు పోలీసులు సేకరించిన వేలిముద్రలు.. పాత నేరస్తుల డేటాబేస్‌తో సరిపోలలేదు. దీంతో ఆ కేసులు పెండింగ్‌లో ఉండిపోయాయి. ‘పాపిల్లన్‌’అనే ఆటోమేటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ ఐడెంటిఫికేషన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇతడికి చెక్‌ చెçప్పింది. ఇందులో ఇప్పటి వరకు అరెస్టు అయిన, వాంటెడ్‌గా ఉన్న పాత నేరగాళ్లతో పాటు వివిధ నేర స్థలాల్లో దొరికిన వేలిముద్రల్ని డిజిటలైజ్‌ చేసిన పోలీసులు వాటిని ఓ సర్వర్‌లో నిక్షిప్తం చేశారు. ఈ సాఫ్ట్‌వేర్‌ వివిధ సందర్భాలు, సమయాల్లో నేర స్థలాల్లో దొరికిన వేలిముద్రల్ని పాత నేరగాళ్లకు చెందిన వాటితో సరిచూసి తక్షణం రిజల్ట్‌ ఇస్తుంది. దీంతో ఖాజం దాచిన రెండు దొంగతనాలు బయటపడ్డాయి. దీంతో సౌత్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలోని బృందం ముమ్మరంగా గాలించి మంగళవారం ఖాజంను పట్టుకుని మలక్‌పేట పోలీసులకు అప్పగించింది.

మరిన్ని వార్తలు