3 లక్షలు.. 3రోజులు.. 3ముక్కలు

22 Oct, 2017 04:46 IST|Sakshi

విలాసాలకు అలవాటు పడిన సంపన్నులే మాఫియా టార్గెట్‌.. ప్రతీనెలా దాదాపు 100 మంది కేరళ, గోవాకు తరలింపు

మూడు రోజులు రిసార్టుల్లో మకాం.. పేకాటతో పాటు విందు, వినోదాలు

‘మారియట్‌’లో ప్రధాన నిందితుడు సంజయ్‌ అగర్వాలే దీనికి సూత్రధారి

సాక్షి, హైదరాబాద్‌: మూడు లక్షలు... మూడు రోజులు... మూడు ముక్కలు... నగరంలో విలాసాలకు అలవాటు పడిన సంపన్నులే టార్గెట్‌గా సంజయ్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని మాఫియా సాగిస్తున్న వ్యాపారమిది. మారియట్‌ హోటల్‌లో కాసినో బట్టబయలు అయిన ఘటనలో ప్రధాన నిందితుడే ఈ సంజయ్‌ అగర్వాల్‌. రాజధానిలో పేకాట శిబిరాల నిర్వహణపై నిషేధాజ్ఞలు ఉండడంతో ఆసక్తి ఉన్న వారిని కేరళ, గోవాలకు తరలిస్తూ.. అక్కడే ఆటకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రతీనెల రెండో శనివారం వచ్చిందంటే చాలు చాలా మంది ఇలా కేరళబాట పడుతున్నారు. పేకాట కోసం రూ. 3 లక్షలు చెల్లిస్తే.. విమాన ప్రయాణంతోపాటు ఇతర వసతులు అన్నీ ఉచితంగా ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం ఇంటి నుంచి రిసీవ్‌ చేసుకుని వెళ్లి తిరిగి సోమవారం సాయంత్రం ఇంటి వద్ద దిగబెడుతున్నారు. సికింద్రాబాద్‌ నామాలగుండు ప్రాంతానికి చెందిన సంజయ్‌కుమార్‌ అగర్వాల్‌ను ఈ తతంగానికి సూత్రధారిగా గుర్తించిన నగర పోలీసులు ఆయనకు సంబంధించి వివరాలపై ఆరా తీస్తున్నారు. క్రికెట్‌ బుకీలతోనూ సంబంధాలు, గోవా ట్రిప్‌లపైనా వివరాలు సేకరిస్తున్నారు.

టూరు సాగుతుందిలా...
మూడు రోజులపాటు కేరళ వెళ్లి మూడు ముక్కలాట ఆడుకోవాలనుకునేవారు నాలుగు రోజుల ముందే పేరు నమోదు చేసుకోవాలి. ప్రయాణానికి రెండు రోజుల ముందు రూ.3 లక్షలు చెల్లించాలి. శుక్రవారం మధ్యాహ్నం ఇంటి ముందుకు క్యాబ్‌ వస్తుంది. శంషాబాద్‌ తీసుకెళ్లి విమానం ఎక్కిస్తారు. రాత్రికల్లా కొట్టాయం లేదా త్రివేండ్రంలో దిగగానే అక్కడి నుంచి మళ్లీ క్యాబ్‌లలో 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో కొండలు, కోనలు, నదుల మధ్యన ఉండే రిసార్ట్స్‌కి తీసుకువెళ్తారు.

సికింద్రాబాద్, సీతాఫల్‌మండి, కంటోన్మెంట్, బేగంపేట్, సింథికాలనీ, ఆబిడ్స్, బేగంబజార్‌ తదితర ప్రాంతాల నుంచి పలువురు వ్యాపారవేత్తలు, బిల్డర్లు, ప్రజాప్రతినిధులు మొత్తంగా 100 మంది వరకు ప్రతీనెల కేరళ వెళ్లి వస్తున్న జాబితాలో ఉన్నట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారాన్ని చూసుకునేందుకు 10 మంది ఏజెంట్లు ఉన్నట్లు పేకాటరాయుళ్లు చెబుతున్నారు. ఇందులో ఐదుగురు పాతబస్తీ బేగంబజార్‌కు చెందిన వారు కాగా మిగతావారు సింథికాలనీ, బేగంపేట, సీతాఫల్‌మండికి చెందినవారుగా సమాచారం. నగదు రూపంతోపాటుగా కార్డు స్వైపింగ్, పాత కస్టమర్ల నుంచి చెక్కులు కూడా నిర్వాహకులు స్వీకరిస్తున్నారు.

ఎవరీ అగర్వాల్‌?
సీతాఫల్‌మండి నామాలగుండు ప్రాంతానికి చెందిన సంజయ్‌ అగర్వాల్‌ తొలుత నగరంలో విచ్చలవిడిగా నడిచిన పేకాట క్లబ్‌ల్లో పనిచేసేవాడు. అలా రూ.200లకు పని చేస్తూ క్రమేణా పేకాట శిబిరాలు నిర్వహించే స్థాయికి ఎదిగాడు. ప్రధానంగా విలాసాలకు అలవాటు పడిన సంపన్నులను టార్గెట్‌ చేసుకునేవాడు. విమానాల్లో ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి పేకాట శిబిరాలు ఏర్పాటు చేయడం, గోవాలో పలు క్రికెట్‌ బెట్టింగ్‌లు ఈయన నేతృత్వంలో జరిగినట్లు ప్రచారంలో ఉంది. గతంలో ఇలాంటి కేసుల్లోనే జైలుకు వెళ్లిన అగర్వాల్‌... బెయిల్‌పై వచ్చాక కూడా అవే అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

సకల సదుపాయాలు
పేకాట కోసం వెళ్లినవారందరికీ శుక్రవారం రాత్రి నుంచే రాజభోగాలతో కూడిన వసతులు అందుబాటులో ఉంచుతారు. పేకాటకు సంబంధించిన లావాదేవీలకు మాత్రమే ముందుగా చెల్లించిన రూ.3 లక్షలు వాడుతారు. మద్యం, ఆహారం, భోజనం అంతా నిర్వాహకులు ఉచితంగానే ఏర్పాటు చేస్తారు. రిసార్టులో చేరింది మొదలు.. తిరిగి బయటకు వచ్చే వరకు ముంబై, రష్యా నుంచి రప్పించిన యువతుల నగ్న ప్రదర్శనల మధ్య పేకాట సాగుతుంది. ముందుగా చెల్లించిన రూ. 3 లక్షలు పేకాటలో చేజారితే అంతే సంగతులు. డబ్బు గెల్చుకున్నవారు ఉంటే నగరానికి వచ్చాక చెల్లిస్తారు.
స్వర్గం చూపించారు

సంజయ్‌ అగర్వాల్‌ నేతృత్వంలో నాలుగుసార్లు కేరళ వెళ్లాను. మూడుసార్లు త్రివేండ్రం, ఒకసారి కొట్టాయం సమీపంలోని రిసార్ట్‌కు వెళ్లి వచ్చాను. వివిధ రాష్ట్రాలతోపాటు రష్యా తదితర దేశాలకు చెందిన పలువురు యువతులతో సపర్యలు చేయిస్తారు. మద్యం సేవిస్తూ పేకాట ఆడుతుండగానే.. యువతుల నగ్న నృత్యప్రదర్శనలు ఉంటాయి. అత్యంత ఖరీదైన మద్యం మాత్రమే అందుబాటులో ఉంచుతారు. ముందస్తు ఆట డబ్బులు చెల్లిస్తే చాలు ఇంటి నుంచి వెళ్లి తిరిగి ఇంటికి చేరుకునే వరకు అన్నివిధాలా వాళ్లే చూసుకుంటారు.
– పేకాట ప్రియుడు, సీతాఫల్‌మండి

మరిన్ని వార్తలు