కార్లలో వచ్చి తీసుకెళ్లేవారు!

7 Aug, 2018 02:05 IST|Sakshi

శరణాలయంలో బాలికల దీనగాధ

24 మందిని రక్షించిన పోలీసులు

దేవరియా/లక్నో: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో శరణాలయంలోని బాలికలపై లైంగిక దాడులు జరిగిన ఘటన ఇంకా ప్రకంపనలు రేపుతుండగానే అలాంటి మరో ఘటన ఉత్తరప్రదేశ్‌(యూపీ)లోనూ వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని దేవరియాలో ఉన్న ఓ శరణాలయంలోనూ బాలికలపై లైంగిక దోపిడీ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో అక్కడి నుంచి 24 మంది అమ్మాయిలను పోలీసులు రక్షించారు. మరో 18 మంది బాలికల ఆచూకీ తెలియడం లేదు. ఈ శరణాలయాన్ని నడుపుతున్న భార్యాభర్తలతోపాటు అక్కడ పనిచేస్తున్న ఓ మహిళను అరెస్టు చేశారు.

ఏడుస్తూ తిరిగొచ్చేవారు: బాలిక
శరణాలయం నుంచి తప్పించుకున్న పదేళ్ల బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఘోరం వెలుగుచూసింది. రోజూ సాయంత్రం కొంత మంది కార్లలో వచ్చి బాలికలను తీసుకెళ్లేవారనీ, వారితోపాటు కాంచనలత వెళ్లేదని బాలిక పోలీసులకు చెప్పింది. ‘చాలా కార్లు వచ్చి అమ్మాయిలను తీసుకెళ్లేవి. మళ్లీ పొద్దున వాళ్లు తిరిగొస్తూ అందరూ ఏడ్చేవారు’ అని తెలిపింది. కాగా, ఈ శరణాలయానికి ఏడాది క్రితమే అనుమతులు రద్దు చేశామనీ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని యూపీ మంత్రి రీటా బహుగుణ చెప్పారు. 

ఈ అంశంపై విపక్షాల నుంచి నిరసనలు వ్యక్తమవుతుండటంతో యూపీ బీజేపీ ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది.దేవరియా జిల్లా మేజిస్ట్రేట్‌ సుజిత్‌ కుమార్‌ను తక్షణం తొలగిస్తూ సీఎం యోగి ఆదేశాలు ఇచ్చినట్లు యూపీ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి రీటా బహుగుణ జోషి సోమవారం చెప్పారు. దేవరియా ఎస్పీ రోహన్‌మాట్లాడుతూ ‘మా వింధ్యవాసిని మహిళా ప్రశిక్షణ్‌  ఎవం సమాజ్‌ సేవా సంస్థాన్‌లో బాలికలపై లైంగిక దోపిడీ జరుగుతోందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో శరణాలయాన్ని మూసేశాం. దాన్ని నడుపుతున్న గిరిజ, భర్త మోహన్, మహిళా  సూపరింటెండెంట్‌ కాంచనలతను అరెస్టు చేశాం’ అని చెప్పారు.  

మరిన్ని వార్తలు