పట్టాలపై ‘సిట్టింగ్‌’.. విద్యార్థుల మృతి

14 Nov, 2019 11:17 IST|Sakshi

కోయంబత్తూర్‌: రైలు కింద పడి నలుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థులు మృతి చెందిన ఘటన కోయంబత్తూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అయిదుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థులు బుధవారం రాత్రిపూట రైలు పట్టాలపై కూర్చున్నారు. అదే సమయంలో వేగంగా వచ్చిన చెన్నై-అలాప్పుజా ఎక్స్‌ప్రెస్‌ రైలు వారిపై నుంచి వెళ్లడంతో నలుగురు అక్కడికక్కడే మరణించగా ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. కోయంబత్తూరు దగ్గరలోని సూలూరు బ్రిడ్జ్‌  దగ్గర ప్రమాదం చోటుచేసుకుంది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలంలో దొరికిన మందు బాటిళ్లు, ప్లాస్టిక్‌ కప్పులు ఆధారంగా వారు మద్యం సేవించడానికి పట్టాలపైకి వెళ్లినట్లు తెలుస్తోంది.

మృతులు స్థానిక ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు సిద్దిఖ్‌ రాజా(22), రాజశేఖర్‌ (20), గౌతమ్‌(23), కరుప్పసామీ(24)లుగా గుర్తించారు. వీరితోపాటు అక్కడే ఉన్న మరో విద్యార్థి విగ్నేశ్‌ తీవ్రగాయాలతో ఆసుపత్రిపాలయ్యాడు. గౌతమ్‌, కరుప్పసామీ 2018లోనే ఇంజనీరింగ్‌ పూర్తవగా పరీక్షల కోసం నగరానికి వచ్చారు. రాజశేఖర్‌ మూడో సంవత్సరం, మిగతా ఇద్దరు నాలుగో సంవత్సరం చదువుతున్నారు. పరీక్ష రాసిన అనంతరం రౌతర్‌ పాలెంకు వెళ్లగా రైలు ప్రమాదంలో విగతజీవులుగా మారారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు