బాలుడి మృతి: తండ్రే హత్య చేశాడని అనుమానం

10 Aug, 2019 11:02 IST|Sakshi
కనకయ్య, మంచంపై చింతల అక్షయ్‌ మృతదేహం

బాలుడు మృతి చెందినప్పటి నుంచీ కనిపించని తండ్రి

పెళ్లికి అడ్డుగా ఉండడమే కారణమా ?

శాలిగౌరారం మండలం తిరుమలరాయినిగూడెంలో ఘటన

సాక్షి, నకిరేకల్‌: నాలుగు సంవత్సరాల బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం మండల పరిధిలో కలకలం రేపుతోంది. రాత్రి వరకు బాగానే ఉన్న బాలుడు తండ్రి వద్ద పడుకొని తెల్లవారే సరికి శవంగా మారడం పలు అనుమానాలకు దారితీస్తుంది. కన్న కొడుకును పెంచి పెద్దచేసి భవిష్యత్‌లో ప్రయోజకుడిగా తీర్చిదిద్దాల్సిన తండ్రి కసాయిగా మారాడా అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ హృదయవిదారక సంఘటన మండలంలోని తిరుమలరాయినిగూడెంలో శుక్రవారం చోటు చేసుకుంది.

ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం జాజిరెడ్డిగూడెంకు చెందిన చింతల కనకయ్యకు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం చౌళ్లరామారంనకు చెందిన ఓ యువతితో మొదట వివాహం జరిగింది. కుటుంబ గొడవల కారణంగా ఆమె కనకయ్యతో విడాకులు తీసుకొని మరో పెళ్లి చేసుకుంది. వీరికి పిల్లలు లేరు. అనంతరం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లిన కనకయ్య ఎల్‌బీనగర్‌లో నివాపం ఉంటూ రోజువారి కూలి పనులకు వెళ్లేవాడు. ఈ క్రమంలో జనగాం జిల్లా కేంద్రానికి చెందిన స్వప్న కుటుంబ సభ్యులు కూడా హైదరాబాద్‌లో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ నేపధ్యంలో స్వప్నతో కనకయ్యకు పరిచయం ఏర్పడింది.

అనంతరం కొంత కాలం క్రితం వారికి పెళ్లి అయింది. ప్రస్తుతం కనకయ్య–స్వప్న దంపతులకు కుమార్తె, కుమారుడు అక్షయ్‌(4) ఉన్నారు. అనంతరం కొంత కాలంగా వీరు హైదరాబాద్‌లోని దమ్మాయిగూడలో నివాసం ఉంటూ రోజువారి కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో గత కొంత కాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు అధికం కావడంతో కొన్ని రోజులుగా భార్యభర్తలు దూరంగా ఉంటున్నారు.

కొడుకుని తీసుకొని పెదనాన్న ఇంటికి వచ్చిన కనకయ్య 
భార్యాభర్తల గొడవలతో దూరంగా ఉంటున్న కనకయ్య బిడ్డను తల్లిదగ్గర ఉంచి కొడుకు అక్షయ్‌ను తీసుకొని  నెలన్నర క్రితం తిరుమలరాయినిగూడెంలో ఉంటున్న తన పెదనాన్న చింతల రాములు ఇంటికి వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. మృతుడు అక్షయ్‌కు తండ్రి కనకయ్య అంటే అనేకమైన ఇష్టం. తండ్రిని విడిచి క్షణం కూడా ఉండేవాడుకాదు. అడపాదడపా కూలి పనులకు వెళ్లే కనకయ్య ఇంటికి రాగానే అక్షయ్‌ తండ్రి వద్దకు వెళ్లేవాడు. ఈ క్రమంలో రోజువారి మాదిరిగానే గురువారం రాత్రి భోజనం అనంతరం కొడుకు అక్షయ్‌ను తనవద్దనే పడుకోబెట్టుకొని నిద్రించాడు.  

తెల్లవారే సరికి శవంగా...
తెల్లవారే సరికి అక్షయ్‌ ఇంటిముందు మంచంలో పడుకొని ఉన్నాడు. తెల్లవారుజామున నిద్రలేచిన చింతల రాములు కుటుంబ సభ్యులు ఇంటిముందు మంచంలో అక్షయ్‌ కళ్లు మూసుకొని ఉండటాన్ని గమనించి దగ్గరకు వెళ్లి చూడగా మృతిచెంది ఉన్నాడు. దీంతో లబోదిబోమనడంతో చుట్టు పక్కలవారు వచ్చి అక్షయ్‌ను పరిశీలించగా చిన్నారి అప్పటికే మృతిచెంది ఉన్నాడు. ఇంట్లో కనకయ్య లేకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. అయినా కనిపించకపోవడంతో అతనే హత్య చేసి పారిపోయాడని పోలీసులకు సమాచారం అందించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కనకయ్యే అక్షయ్‌ని హత్య చేసి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. 

పెళ్లికి అడ్డుగా ఉన్నాడని...
మొదటి నుంచీ గొడవలు పడే లక్షణాలు కలిగిన కనకయ్యకు మొదటి భార్య విడాకులు తీసుకొని వెళ్లిపోవడం, రెండవ భార్య ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత కుటుంబ గొడవలతో దూరంగా ఉండటంతో మూడవ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. దాంతో పెళ్లికి కుమారుడు అక్షయ్‌ అడ్డుగా మారడంతో తనకు మరో మహిళతో పెళ్లి  కాదని భావించిన కనకయ్య గొంతునులిమి హత్యచేసి పారిపోయాడని స్థానికులు భావిస్తున్నారు. 

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ 
తిరుమలరాయినిగూడెంలో చిన్నారి చింతల అక్షయ్‌ హత్యాస్థలాన్ని సీఐ క్యాస్ట్రో  పరిశీలించారు. చిన్నారి హత్యకు గల కారణాలను చింతల రాములు కుటుంబీకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చింతల రాములు ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నకిరేకల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు. 

మరిన్ని వార్తలు