కలకలం రేపిన బాలుడి దుస్తులు

31 Aug, 2019 10:33 IST|Sakshi
డాగ్‌ స్క్వాడ్‌ తో పరిశీలిస్తున్న పోలీసులు 

 ఇంటికి సమీపంలోని ముళ్ల పొదల్లో లభ్యం

అనుమానం రేకెత్తిస్తున్న కేసు 

సాక్షి, గురజాల(గుంటూరు) : పల్నాడులో చిన్నారుల అదృశ్యం... ఆపై హత్యగావించబడటం కలకలం రేపుతోంది. ఆరు నెలల కిందట మాచర్ల పట్టణంలో బాలుడు అపహరణకు గురై అనంతరం నాలుగు రోజుల వ్యవధిలోనే చెరువులో శవమై తేలాడు. పోలీస్‌ సబ్‌ డివిజన్‌లో ఆ ఘటన మరువక ముందే గురజాలలో ఆదివారం అదృశ్యమైన నాలుగేళ్ల బాలుడు సుభాష్‌ జాడ నేటికీ తెలియలేదు.  బాలుడి దుస్తులు రక్తపు మరకలతో ఇంటికి కూతవేటు దూరంలోనే శుక్రవారం లభ్యమవ్వడం కలకలం రేపింది. ముళ్లకంపపై బాలుడు సుభాష్‌ అదృశ్యమైన సమయంలో వేసుకున్న లాగు, మరికొంత దూరంలో ముళ్లకంపలో రక్తపు మరకలతో కూడిన టీ షర్టు దొరికింది. అదే విధంగా ఓ  పుర్రె దర్శనమివ్వడం ఆందోళనకు గురిజేసింది.  

అక్కడక్కడ రక్తపు మరకలు , ఒక కత్తెర, ఆ ప్రాంతంలోనే తల వెంట్రుకలు వంటి  ఆనవాళ్లు కనిపించాయి. బాలుడిని ఎవరైనా కిడ్నాప్‌చేసి తీసుకెళ్లి హత్యచేశారా.. ? కావాలనే ఈ విధంగా ఆ ప్రాంతంలో బాలుడి దుస్తులు వేసి వెళ్లారా....?  అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా వ్యక్తులు  బాలుడిని ఎత్తుకెళ్లి  హత్యచేసి ఆ ప్రాంతంలో దుస్తులు వేశారా..? మరి మృతదేహం ఎక్కడ ఉంది అనేది తేలాల్సి ఉంది. మూడు రోజుల కిందట పోలీసులు డ్రోన్‌ కెమెరాలు, డాగ్‌ స్క్వాడ్‌ , సిబ్బందితో కలిసి  పరిశీలించిన సమయంలో ఎక్కడా కనిపించని ఈ దుస్తులు ఇప్పుడు ఎలా దర్శనమిచ్చాయనే సందేహాలొస్తున్నాయి.

రంగంలోకి దిగిన క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌.
అదృశ్యమైన బాలుడి దుస్తులు కనిపించగానే ఆ ప్రాంతానికి డీఎస్పీ ఆర్‌ శ్రీహరిబాబు, పట్టణ సీఐ దుర్గాప్రసాద్, రూరల్‌ సీఐ కోటేశ్వరరావు, పట్టణ ఎస్‌ఐ పి.బాలకృష్ణ తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఒక చోట బాలుడు లాగు మరికొంత దూరంలోనే  రక్తంతో వున్న బాలుడి టీ షర్టు లభ్యమయ్యాయి. అక్కడక్కడ రక్తపు మరకలు, వెంట్రుకలు కనిపించాయి. గుంటూరు నుంచి క్లూస్‌ టీంను రంగంలోకి దింపారు. బాలుడికి సంబంధించిన వివరాలు , రక్తపు మరకల నమూనాలు సేకరించారు. డాగ్‌ స్క్వాడ్‌ ఆ ప్రాంతంలో పడివున్న  కత్తెర, రక్తపు మరకలు  వాసన చూసి రెండు మార్లు బాలుడి ఇంటి వద్దకు మూడు మార్లు ఆ ప్రాంతంలోనే ముళ్లపొదల వద్దకు వెళ్లి ఆగిపోయింది. 

మరిన్ని వార్తలు