కడసారి చూపు కోసం వెళ్లి...అంతలోనే!

31 Oct, 2019 08:21 IST|Sakshi
బోల్తా కొట్టిన బొలేరో ట్రక్కు, గాయపడ్డ గార విష్ణు, చేయి విరిగిన అన్నపూర్ణమ్మ

కృష్ణా జిల్లా వీరవల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం 

వంగర మండలం శ్రీహరిపురం..

గ్రామానికి చెందిన 40 మందికి గాయాలు  

కూలి పనిచేస్తే తప్ప పూటగడవని బతుకులు... తమ బంధువు మృతి చెందడంతో కడసారి చూపు కోసం పయనమయ్యాయి... కృష్ణా జిల్లాలో అతను నివసించిన ప్రాంతానికి కాసేపట్లో చేరుకుంటారనగా... టైరు పంచర్‌ కావడంతో వారు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడింది... ఒకటా రెండా.. ఏకంగా 45 కుటుంబాలు ఒక్కసారిగా ఘొల్లుమన్నాయి.  ఈ దుర్ఘటనలో 40మంది గాయపడగా.. వారిలో తొమ్మిదిమంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులంతా వంగర మండలం శ్రీహరిపురం గ్రామస్తులు. తలకు, చేతులు, కాళ్లకు గాయాలై కట్లతో... విరిగిన శరీర భాగాలతో వారు పడుతున్న అవస్థ కుటుంబ సభ్యులను కలచివేస్తోంది. అందరూ ఒకే ప్రాంతానికి చెందినవారు కావడంతో ప్రమాద వార్త తెలియగానే ఊరంతా ఆర్తనాదాలతో ప్రతిధ్వనించింది. 

సాక్షి, వంగర(శ్రీకాకుళం) : చెన్నై – కోల్‌కతా జాతీయ రహదారిపై కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి వద్ద బుధవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వంగర మండలం శ్రీహరిపురం గ్రామానికి చెందిన 40 మందికి గాయాలయ్యాయి. వీరిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీహరిపురం గ్రామానికి చెందిన బొత్స అప్పలనాయుడు కుటుంబంతో సహా 30 ఏళ్ల క్రితం కృష్ణాజిల్లా ఉంగుటూరుకు వలస వెళ్లాడు. వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అప్పలనాయుడు ఈ నెల 29న మృతిచెందినట్లు గ్రామస్తులకు సమాచారం అందింది. దీంతో శ్రీహరిపురంలో ఉన్న వారంతా అప్పలనాయుడుకు బంధువులు కావడంతో పరామర్శ కోసం అదేరోజు సుమారు 45 మంది ఉంగుటూరుకు పయనమయ్యారు. శ్రీహరిపురం నుంచి ప్రయివేటు వాహనంలో విశాఖపట్నం వరకు వెళ్లి రాత్రి 8 గంటలకు రాయగడ–గుంటూరు ఎక్స్‌ప్రెస్‌లో పయనమయ్యారు. బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు కృష్ణాజిల్లా నూజివీడు రైల్వేస్టేషన్‌లో దిగారు. అక్కడి నుంచి బొలేరో ట్రక్కు(లగేజీ వ్యాన్‌) ద్వారా హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా ఉంగుటూరుకు పయనమయ్యారు.

మార్గమధ్యంలో బాపులపాడు మండలం వీరవల్లి సమీపంలో తెల్లవారుజామున 4 గంటల సమయంలో ట్రక్కు టైర్‌ పేలడంతో పల్టీ కొట్టింది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న వారంతా తుళ్లిపోయారు. కొందరికి కాళ్లు, చేతులు విరగ్గా, మరికొందరికి తల, మెడ, నడుము భాగాల్లో తీవ్రగాయాలయ్యాయి. వీరవల్లి ప్రాంతం క్షతగాత్రుల రోదనలతో మిన్నంటింది. అందులో ఉన్న కొంత మంది క్షతగాత్రులు 108 అంబులెన్సుకు సమాచారం ఇచ్చారు. హనుమాన్‌ జంక్షన్, గన్నవరం, నూజివీడు వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రామవరప్పాడులోని ఎన్‌.టి.ఆర్‌.హెల్త్‌ యూనివర్సిటీ న్యూ గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరు క్షతగాత్రులు స్థానికంగా ఉన్న బంధువులు, ఇతర ఆస్పత్రులను ఆశ్రయించి చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై వీరవల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.  

ఐసీయూలో చికిత్స.. 
మొత్తం 40 మందికి గాయాలు కాగా, వారిలో బొత్స రామకృష్ణ(60), బోగి తవిటినాయుడు, ఆబోతుల అప్పలనాయుడు (ఖుషి), గార విష్ణుమూర్తి, గార సత్తెమ్మ, బుగత లక్ష్మినారాయణ(48), బుగత అన్నపూర్ణమ్మ(రంగమ్మ)(52), వావిలపల్లి ముత్యాలమ్మ(45), బొత్స రమణ (35), ఉత్తరావెల్లికృష్ణమూర్తిల పరిస్థితి విషమంగా ఉంది. వీరిలో కొందరు వెంటిలేటర్, ఐసీయూ విభాగాల్లో చికిత్స పొందుతున్నారు. బొత్స పాపారావు, గార కృష్ణవేణి, బొత్స శంకరరావు, బెవర శారదమ్మ, బొత్స రాము, బుగత రామారావు, బుగత సూర్యుడమ్మ, బోగి రాము, బొత్స ఆదిలక్ష్మి, బొత్స గణపతి(పోలినాయుడు), బొత్స తవిటినాయుడు, బొత్స సత్యనారాయణ, గార తవిటినాయుడు, గార సింహాలునాయుడు, గార వరహాలమ్మ, బుగత పోలినాయుడు, బొత్స శ్రీను, గార సన్యాసిరాజులతోపాటు మరో 13 మందికి సైతం గాయాలయ్యాయి.   

ఘొల్లుమన్న గ్రామం.. 
శ్రీహరిపురంలో ఇంటింటా విషాదం అలుముకుంది. ఇక్కడ 230 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అందులో 45 కుటుంబాల్లో ఇంటికి ఒకరు చొప్పున పరామర్శకు వెళ్లి గాయపడ్డారు. దీంతో ఆయా కుటుంబాల వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.    

అందరి పరిస్థితీ దయనీయమే... 
కూలి పనిచేస్తే తప్ప పూటగడవని బతుకులు వారివి. తమ బంధువు మృతిచెందడంతో కడసారి చూపు కోసం పయనమై క్షతగాత్రులుగా మిగిలారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో పోరాటం చేస్తున్న వావిలపల్లి ముత్యాలమ్మది దయనీయ స్థితి. తలభాగం, పొట్టలో ఎముకులు విరిగిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గతంలో భర్త మరణించగా, పెళ్లీడుకొచ్చిన కుమార్తె ఉంది. అపస్మారక స్థితిలో ఉన్న బొత్స రామకృష్ణ కుటుంబానికి అదే దీనగాథ. కాయకష్టంతో కుటుంబాన్ని పోషిస్తున్న రామకృష్ణ ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉండడంతో భార్య నిర్మల, ముగ్గురు కుమారులు, కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఆబోతుల అప్పలనాయుడు నిరుపేద. ఇంటి పెద్ద దిక్కుగా ఉన్న తన భర్త ప్రాణాలను కాపాడాలని భార్య లక్ష్మీ వేడుకుంటోంది. మరో క్షతగాత్రుడు బుగత లక్ష్మీనారాయణ కుటుంబ నేపథ్యం దయనీయం. కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఇప్పుడు ఈ ప్రమాదం జరగడంతో భార్య, పిల్లలు బోరున విలపిస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేదని, మెరుగైన వైద్యసేవలందించి ప్రభుత్వం ఆదుకోవాలని వారంతా వేడుకుంటున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా