పసిపాపను బలిగొన్న ఇంజక్షన్‌

12 Oct, 2017 12:49 IST|Sakshi
పాపను పట్టుకొని విలపిస్తున్న తల్లిదండ్రులు

45 రోజులకే నూరేళ్లు నిండాయా..?

అమావాస్య రోజు పుట్టిన మా అష్టలక్ష్మీ ఎక్కడ..?

మిన్నంటిన తల్లిదండ్రుల రోదన

మృతదేహంతో రోడ్డుపై ఆందోళన

పరారీలో ఆసుపత్రి సిబ్బంది

నిండా రెండు నెలలు కూడా లేని ఓ ముద్దులొలికే చిన్నారిని ఇంజక్షన్‌ కాటేసింది. మొదటి సంతానంగా ఆ తల్లిదండ్రులకు కూతురు జన్మించగా.. సరస్వతి మాత పుట్టిందనుకున్నారు. రెండో సంతానంగా కూడా పాపే జన్మించడంతో లక్ష్మీదేవి వచ్చిందనుకున్నారు. కానీ వారి ఆశలు ఆవిరయ్యాయి. 45 రోజుల వారి చిన్నారి ఇంజక్షన్‌ వికటించి మృతిచెందడంతో తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతం.

పెద్దపల్లి, ఇల్లందకుంట(హుజూరాబాద్‌): ఇల్లందకుంట మండలకేంద్రంలో నివాసముంటున్న అప్పాల విజయ్‌–హారిక దంపతులు. వీరికి ఇద్దరు అమ్మాయిలు. పెద్ద కుతూరు రియా. చిన్నమ్మాయి నెల క్రితం అమావాస్య రోజున జన్మించింది. ప్రతిరోజు అంగన్‌వాడీ సెంటర్‌లో సరుకులు తీసుకునేందుకు తల్లి హారిక వెళ్తుంది. ఈక్రమంలో బుధవారం ఇల్లందకుంట ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో పని చేసే ఆశ కార్యకర్త చిన్నారికి ఇంజక్షన్‌ ఇప్పించాలని, తీసుకురావాలని తెలిపింది. దీంతో తల్లి హారిక తన మరిది వినయ్‌ను తీసుకొని ఆసుపత్రికి వెళ్లింది. మొదట సులోచన అనే ఆశ కార్యకర్త పోలియో చుక్కలను వేసింది.

తర్వాత రెండో ఏఎన్‌ఎంలు సునీత, అరుణ పెంటావ్యాక్సినేషన్‌ చేశారు. అప్పటికి పాప ఏడుస్తుండడంతో ఏమి కాదంటూ ఇంజక్షన్‌ చేశారు. ఇంటికి తీసుకెళ్లి పడుకోబెట్టారు. కొద్ది సమయం తరువాత పాప తలకు నూనె పెట్టేందుకు ఎత్తుకోగా.. చలనం లేకపోవడంతో వెంటనే జమ్మికుంట ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. చలనం లేదని, ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లమని వైద్యులు సూచించారు. అప్పటికే చిన్నారి చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. తన పాప మృతికి కారణం వైద్య సిబ్బందే అంటూ కుటుంబసభ్యులు, కాంగ్రెస్‌ నాయకులు, గ్రామస్తులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది అక్కడినుంచి పరారయ్యారు.

రెండు గంటలపాటు..
చిన్నారి మృతికి కారణమైన వైద్య సిబ్బందిని తొలగించాలంటూ ఇల్లందకుంట ప్రధాన దారిపై గ్రామస్తులు దాదాపు రెండు గంటలపాటు బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఎస్సై నరేష్, తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి విషమించడంతో ఆర్‌డీఓతోపాటు జిల్లా వైద్యాధికారికి సమాచారం అందించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జమ్మికుంట సీఐ ప్రశాంత్‌రెడ్డి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

గతంలోనూ..
3సంవత్సరాల క్రితం తన పెద్ద కుతూరు లక్కీ(రియా)కి కూడా ఈ ఆసుపత్రిలో ఇంజక్షన్‌ వికటించిందని, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాప్రాయం తప్పిందని తండ్రి విజయ్‌ తెలిపారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది సరిగా ఉండడం లేదని, ఇష్టారాజ్యంగా.. దురుసుగా ప్రవర్తిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు.

మరిన్ని వార్తలు