460 కిలోల ఆల్ఫ్రాజోలం పట్టివేత

30 Sep, 2017 04:33 IST|Sakshi

లెఫ్‌ సైన్సెస్‌ ల్యాబ్‌ ముసుగులో తండ్రీకొడుకుల అక్రమ వ్యాపారం

పట్టుబడిన మత్తు మందు విలువ రూ 4.60 కోట్లు

సాక్షి, హైదరాబాద్‌: లైఫ్‌ సైన్సెస్‌ ల్యాబ్‌ ముసుగులో ఆల్ఫ్రాజోలం విక్రయిస్తున్న తండ్రీకొడుకులను ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి మొత్తం 460 కిలోల ఆల్ఫ్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్‌లో దీని విలువ రూ 4.60 కోట్లు ఉంటుందని అంచనా. ఎక్సైజ్‌ ఇన్‌చార్జ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అజయ్‌రావు వివరాలను శుక్రవారం మీడియాకు వెల్లడించారు.

సంగారెడ్డి జిల్లా పాశంమైలారం ఇండస్ట్రియల్‌ ప్రాంతంలోని ఒక గోదాంలో నిషేధిత ఆల్ఫ్రాజోలం ఉందనే పక్కా సమాచారం టాస్క్‌ఫోర్స్‌ అధికారులకు అందింది. గోదాంపై దాడి చేసి 10 కిలోల ఆల్ఫ్రాజోలంను స్వాధీనం చేసుకుని సిద్ధార్థ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు కూకట్‌పల్లి లో మరో గోదాంపై దాడులు చేశారు.

అక్కడ ఎనిమిది డబ్బాల్లో నిల్వ చేసిన దాదాపు 450 కిలోల ఆల్ఫ్రాజోలం దొరికింది. పొరుగు రాష్ట్రాల నుంచి దీన్ని దిగుమతి చేసుకొని అక్రమంగా విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. సీఆర్‌పీ లైఫ్‌ సెన్సెస్‌ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న సిద్ధార్థరెడ్డి, ఆతని తండ్రి సీపీరెడ్డి, మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ కల్యాణ్‌రావు, ట్రేడింగ్‌ బిజినెస్‌ ఆడిటర్‌ సెల్వకుమార్‌పై కేసులు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు