కుప్పకూలిన కోచింగ్‌ సెంటర్‌; ఐదుగురు మృతి

25 Jan, 2020 19:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో భవనం కుప్పకూలిన మరో ఘటన విషాదాన్ని నింపింది. భజన్‌పురా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం శనివారం కూలిపోయింది. పైకప్పు కూలిన ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్టుగా స​మాచారం. వీరిలో నలుగురు విద్యార్థులుకాగా, ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. గాయపడిన  మరో 13మంది విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ఈ భవనంలో కోచింగ్‌ సెంటర్‌ నడుస్తుండటంతో  పలువురు విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకుపోయినట్టుగా అనుమానిస్తున్నారు.

మూడు అంతస్తుల భవనం రెండవ, మూడవ అంతస్తులో నిర్మాణం జరుగుతోందని, సాయంత్రం 5 గంటల సమయంలో అకస్మాత్తుగా కూలిపోయిందని  సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే రక్షణ సహాయక చర్యలను చేపట్టడానికి ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ (డిఎఫ్ఎస్) బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని ఏడుగురిని రక్షించినట్లు డిఎఫ్‌ఎస్ అధికారి తెలిపారు. సుమారు 15 మంది శిధిలాలలో చిక్కుకున్నట్టుగా అనుమానిస్తున్నామన్నారు. మరోవైపు ఈ ప్రమాదంపై వచ్చిన ట్వీట్లకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానీ, మరికొద్ది సేపట్లో సంఘటనా స్థలానికి వెళ్లబోతున్నానని ట్వీట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు