ఆటోను ఢీకొన్న కారు.. ఐదుగురి మృతి 

18 Nov, 2019 09:44 IST|Sakshi

తాగి కారు నడిపిన డ్రైవర్‌ ∙ఆటోను ఢీకొట్టిన కారు

అలీసాగర్‌ శివారులో ఘటన

మృతులంతా జానకంపేటవాసులే..

శుభకార్యంలో పాల్గొనడానికి దర్గాకు వెళ్లిన ఆ ఐదుగురు.. ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. చనిపోయిన వారందరూ జానకంపేట వాసులే.. మృతుల్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. మద్యం మత్తులో కారు నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

సాక్షి, ఎడపల్లి(నిజామాబాద్‌) : జానకంపేట సర్పంచ్‌ తన కూతురు కేశఖండనం కార్యక్రమాన్ని కుర్నాపల్లిలోని అబయ్యదర్గా వద్ద నిర్వహించారు. ఈ శుభకార్యంలో పాల్గొనడానికి గ్రామానికి చెందిన జక్కం బాలమణి(68), గంగామణి(60), కళ్లపురం సాయిలు(68), చిక్కల సాయిలు(60) ఆటోలో వెళ్లారు. భోజనంచేసి ఆటోలో స్వగ్రామానికి తిరిగి వస్తుండగా అలీసాగర్‌ –జానకంపేట గ్రామాల మధ్యనున్న మూలమలుపు వద్ద వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. అ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న బాలమణి, గంగామణి, కళ్లపురం సాయిలు, చిక్కల సాయిలుతోపాటు ఆటో డ్రైవర్‌ నయీం తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్‌ నయీంను నిజామాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కొద్ది సేపటికే ఐదుగురూ మృతి చెందారు. కారులోని వ్యక్తులు మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు