కొండగట్టులో ఘోర రోడ్డు ప్రమాదం..

12 Sep, 2018 03:30 IST|Sakshi
ప్రమాద స్థలిలో భీతావహ దృశ్యం

43 మందికి గాయాలు.. సగం మంది పరిస్థితి విషమం 

మృతుల్లో 38 మంది మహిళలు.. నలుగురు చిన్నారులు 

ఊపిరి ఆడకపోవడంతోనే ఎక్కువ మంది మృతి! 

శనివారంపేట నుంచి జగిత్యాలకు వెళ్తుండగా ఘటన

సాక్షి బృందం – కరీంనగర్, జగిత్యాల, హైదరాబాద్‌ : జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలో మంగళవారం జరిగిన ఘోరరోడ్డు ప్రమాదం 60 మందిని బలిగొంది. కొడిమ్యాల మండలం శనివారంపేట నుంచి జగిత్యాలకు వస్తున్న ఆర్టీసీ (ఏపీ 29 జెడ్‌ 2319 ఆర్డినరీ) బస్సు కొండగట్టు సమీపంలోని ఘాట్‌ వద్ద లోయలో పడిపోయింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 101 మందిలో 60 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో ప్రమాద స్థలంలోనే 24 మంది మృతి చెందారు. మరో 26 మంది జగిత్యాల ఆస్పత్రిలో, ఏడుగురు కరీంనగర్‌ జిల్లా కేంద్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, 38 మంది మహిళలు ఉన్నారు. 43 మంది క్షతగాత్రులను కరీంనగర్, జగిత్యాల, హైదరాబాద్‌ ఆస్పత్రులకు తరలించారు. డ్రైవర్‌ శ్రీనివాస్‌ మృతి చెందగా, కండక్టర్‌ పరమేశ్వర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. క్షతగాత్రుల్లో సగం మందికిపైగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రమాద ఘటనలో ఊపిరి ఆడకపోవడంతోనే ఎక్కువ మంది చనిపోయారని అభిప్రాయపడుతున్నారు. ప్రమాదం విషయం తెలుసుకుని జిల్లా యంత్రాంగం, వైద్య సిబ్బంది అందరూ హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల కుటుంబాలను ఈటల రాజేందర్, కేటీఆర్, మహేందర్‌రెడ్డి, ఎంపీ కవిత పరామర్శించారు.  

ప్రమాదం జరిగిందిలా.. 
ఆర్టీసీ ఆర్డినరీ బస్సు ఉదయం 10.15 గంటలకు శనివారంపేట నుంచి జగిత్యాలకు బయల్దేరింది. 11.18 గంటల సమయంలో కొండగట్టు జంక్షన్‌ను దాటింది. తర్వాత ఘాట్‌రోడ్డు వద్ద జలబుగ్గ మూలమలుపునకు చేరుకోగానే అదుపు తప్పి పక్కనే ఉన్న ఘాట్‌లోకి దూసుకెళ్లింది. ఏం జరుగుతున్నదో తెలుసుకునే లోపే బస్సు లోయలో పడిపోయింది. బస్సు పడిపోతున్న సమయంలో ప్రయాణికుల హాహాకారాలు వినిపించాయి. మరో అరగంటలో జగిత్యాలకు చేరుకోవాల్సిన బస్సు.. పెను విషాదాన్ని మిగిల్చింది. 

కొంపముంచిన ఓవర్‌లోడింగ్‌ 
బస్సులో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిం చుకోవడమే ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రమాదానికి గురైన బస్సులో సీటింగ్‌ సామ ర్థ్యం 52 మాత్రమే. కానీ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 101 మందిని ఎక్కించుకున్నారు. అంతమంది ఎక్కడంతో ఆ బస్సు కిక్కిరిసింది. దీనికి తోడు కొండగట్టు ఆలయ ప్రాంగణం నుండి గుట్ట కింద వరకు ఉన్న దారి పొడవునా ఆరు ప్రమాదకర మూలమలుపులున్నాయి. ఆ మార్గంలో వాహనాలు నడపాలంటే సుశిక్షుతులైన డ్రైవర్లే ఉండాలి. ఈ క్రమంలో డ్రైవర్‌ శ్రీనివాస్‌ కూడా ఉత్తమ డ్రైవర్‌ అవార్డు గ్రహీతనే. అయితే బస్సు జలబుగ్గ ప్రాంతానికి చేరుకోగానే ఎదురుగా వస్తున్న జీపును తప్పించబోయి డ్రైవర్‌ బస్సును కట్‌ కొట్టాడు. దీంతో బస్సు ప్రయాణికులందరూ ఒకేవైపు ఒరగడంతో బస్సు అదుపు తప్పి లోయలో పడిందని సాక్షులు చెబుతున్నారు. 

రూట్‌ మార్చడంపై విమర్శలు 
అధికారులు రూటును మార్చడం కూడా ప్రమాదానికి కారణమని మృతుల కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి బస్సు శనివారంపేట నుంచి హిమ్మత్‌రావుపేట, రాంసాగర్, తిమ్మయ్యపల్లె, నాచుపల్లి మీదుగా జగిత్యాలకు వెళ్లాల్సి ఉంది. కానీ ఆర్టీసీ అధికారులు పదిరోజుల క్రితమే బస్సు రూటును మార్చి.. శనివారంపేట నుంచి హిమ్మత్‌రావుపేట, రాంసాగర్, తిమ్మయ్యపల్లె నుంచి నేరుగా కొండగట్టు మీదుగా జగిత్యాలకు నడిపిస్తున్నారు. కొండగట్టు స్టేజీ నుంచి ఎక్కువ ఆదాయం వస్తుందనే అధికారులు రూటు మార్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

ఆర్తనాదాలతో దద్దరిల్లిన ఆస్పత్రి 
మృతుల కుటుంబీకుల రోదనలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో జగిత్యాల జిల్లా ఆస్పత్రి దద్దరిల్లింది. మృతదేహాలను సంఘటనా స్థలం నుంచి ఆస్పత్రికి తరలించగానే.. వారి కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులందరూ ఆస్పత్రికి చేరుకున్నారు. కుప్పగా పడి ఉన్న మృతదేహాలను చూస్తూ తమ వారి కోసం వెతుక్కున్నారు. గుండెలు పగిలేలా ఏడ్చారు. ఎవరిని కదిలించినా.. హృదయవిదారక గాథలే వినిపించాయి. చూపరులను కంటతడి పెట్టించాయి. మృతులు, క్షతగాత్రులను చూసేందుకు జిల్లా నలుమూలలతో పాటు కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల నుండి జనం వేల సంఖ్యలో తరలివచ్చారు. 45 మృతదేహాలకు జగిత్యాల ఆస్పత్రిలోనే పోస్టుమార్టం నిర్వహించారు. సుమారు 18 మంది డాక్టర్లతో కూడిన వైద్య బృందం శవపరీక్షలు నిర్వహించింది. 12.10కి ప్రారంభమైన పోస్టుమార్టం ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు సాగింది. తొమ్మిది మృతదేహాలకు కరీంనగర్‌ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. క్షతగాత్రులను జగిత్యాల ప్రధాన ఆస్పత్రికి తరలించేందుకు 15 అంబులెన్స్‌లు, మృతదేహాలను తరలించేందుకు 8 మార్చురీ వ్యాన్‌లను ఉపయోగించారు. పోస్టుమార్టం అనంతరం రాంసాగర్, డబ్బుతిమ్మయ్యపల్లి, హిమ్మత్‌రావుపేట గ్రామాలకు చెందినవారి మృతదేహాలు ఎక్కువగా ఉండటంతో ప్రత్యేక వాహనాల ద్వారా పంపించారు. 

అధికారుల ఘెరావ్‌ 
ఘటనా స్థలాన్ని సందర్శించేందుకు వెళ్లిన కలెక్టర్‌ డాక్టర్‌ శరత్, కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి, జగిత్యాల ఎస్పీ సింధూశర్మను మృతుల కుటుంబీకులు ఘెరావ్‌ చేశారు. గతంలో రెండుసార్లు ప్రమాదాలు జరిగినా చర్యలు తీసుకోలేదని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, క్షతగాత్రులకు రూ.10 లక్షల నష్ట పరిహారం ఇవ్వడంతోపాటు ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మార డంతో స్థానిక నాయకులు వారికి  నచ్చజెప్పారు. 

ఫిట్‌నెస్‌ ఇంకో నెల రోజులుంది
ప్రమాదానికి గురైన బస్సు ఫిట్‌నెస్‌ గడువు మరో నెల రోజులుంది. ఆర్టీఏ నిబంధనల ప్రకారం.. రోడ్డుపై నడవాలంటే ఆ వాహనం ఫిట్‌నెస్‌ చూస్తాం. ఫిట్‌నెస్‌ లేకపోతే వాహనాన్ని పక్కనబెడతాం. అంటే మనం ఆస్పత్రికి వెళ్తే ఆ రోజు వరకు ఉన్న పరిస్థితికి అనుగుణంగానే వైద్యం చేస్తాం. తర్వాత ఏమయ్యేదీ డాక్టర్లు చెప్పలేరు కదా.. వారంలోనే చావొచ్చు, 20 ఏళ్లు కూడా బతకవచ్చు.  
 – కిషన్‌రావు, ఇన్‌చార్జి డీటీసీ, జగిత్యాల... (60 మంది మృతి చెందిన ఘటనను ఉద్దేశించి ఆర్టీఏ అధికారి ఇచ్చిన వివరణ ఇది) 

మృత్యుంజయులు ఈ చిన్నారులు 
కొడిమ్యాల: రాంసాగర్‌ గ్రామానికి చెందిన బైరి కీర్తన తన కూతురు రితన్య, ఏడాది వయసున్న కుమారుడు శివతో కలిసి జగిత్యాలకు బయలుదేరింది. ప్రమాదంలో రితన్య చనిపోగా.. కీర్తనకు తీవ్రగాయాలయ్యాయి. శివ మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. రాంసాగర్‌కే చెందిన కావ్యశ్రీ,, ఉదయశ్రీ అనే కవలలు తాత మెడిచెల్మల రాజేశం (60)తో జగిత్యాల బయలుదేరారు. ప్రమాదంలో రాజేశం మృతిచెందగా.. కవలలు మృత్యుంజయులుగా నిలిచారు.

 
శివ (పైన ), కవలలు కావ్యశ్రీ, ఉదయశ్రీ (కింద)

అడ్డదారే ప్రమాదానికి కారణం
ఘటన జరిగిన మార్గంలో పలు చోట్ల ప్రమాదకర మలుపులున్నాయి. ఇప్పటికే ఆ మార్గంలో రెండుసార్లు ప్రమాదం జరిగింది. 2012 మార్చి 21న అదే మార్గంలోని మరో లోయలో లారీ పడి 11 మంది మృతి చెందారు. రెండేళ్ల క్రితం ఇదే లోయలో ఆటో పడి ఇద్దరు చనిపోయారు. దీంతో ఆ మార్గం నుంచి బస్సులు నడపకుండా ప్రత్యామ్యాయంగా బైపాస్‌ రోడ్డు నిర్మించారు. ఘాట్‌ రోడ్డు నిర్మాణం కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఆర్‌అండ్‌బీ అధికారులు గుర్తించి.. ప్రభుత్వానికి నివేదిక పంపారు. రోడ్డుకి ఇరువైపులా రక్షణ గోడ నిర్మించాలని సూచించారు. గోడ నిర్మించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని.. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ రోడ్డుపై వాహనాలు నడపరాదని చెప్పినా.. గత 3 నెలలుగా ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ వాహనాలకు అనుమతిస్తున్నారు. ఘాట్‌రోడ్డు నుంచి హైవే కిలోమీటరు దూరంలో ఉంటుంది. ప్రత్యామ్నాయ బైపాస్‌ రోడ్డును ఉపయోగిస్తే అదనంగా 5కి.మీ ప్రయాణించాల్సి వస్తుందని భావించిన ఆర్టీసీ అధికారులు.. ఘాట్‌ రూట్లోనే బస్సులు నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జగిత్యాల డిపోలో కాలపరిమితి ముగిసిన సుమారు 20 బస్సులను నడుపుతున్నట్లు తెలిసింది. మరోవైపు కొండగట్టు ఘాట్‌రోడ్‌ పెద్ద వాహనాలకు ప్రమాదం అని తెలిసి గతంలో పెద్ద వాహనాలు నడవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఆర్టీసీ అధికారులు గత 10 రోజుల నుంచి కొడిమ్యాల నుంచి కొండగట్టుకు బస్సు నడుపుతున్నారు. 

దేశంలోనే అతిపెద్ద బస్సు ప్రమాదం!
కొండగట్టు ప్రమాదం దేశంలోనే అతిపెద్దదిగా చెబుతున్నారు. ఆర్టీసీ చరిత్రలో కూడా ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఇదే తొలిసారి. హిమాచల్‌ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌ వంటి ప్రమాదకర ఘాట్‌ రోడ్లు, కొండ చరియలు కలిగిన రాష్ట్రాల్లో జరిగిన ప్రమాదాల్లోనూ ఇంత పెద్ద మొత్తంలో ప్రాణనష్టం జరగలేదు. జమ్మూకశ్మీర్‌లో 2008లో 60 మందితో వెళ్తున్న బస్సు బోల్తా పడగా, 44 మంది మృతి చెందా రు. మరో ప్రమాదంలో ఆ రాష్ట్రంలోనే మరో 51 మంది దుర్మరణం చెందారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో 2012లో  జరిగిన బస్సు ప్రమాదంలో 52 మంది మృతిచెందారు. మహారాష్ట్రలో 2008 లోని నాసిక్‌లో భక్తులతో వెళ్తున్న  బస్సు లోయలో పడిన ఘటనలో 39 మంది ప్రయాణికులు మరణించారు.  మహబూబ్‌నగర్‌ జిల్లా పాలెం వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 45 మంది, మెదక్‌ జిల్లా మాసాయిపేట వద్ద స్కూలు బస్సును రైలు ఢీకొట్టిన ప్రమాదంలో 26 మంది విద్యార్థులు చనిపోయారు. కొండ గట్టు బస్సు ప్రమాదంలో  60 మంది చనిపోవడంతో దేశ చరిత్రలోనే అత్యంత ఘోర ఘటనగా నమోదైంది.

కంటతడి పెట్టిన కేటీఆర్, కవిత
రాయికల్‌ (జగిత్యాల): కొండగట్టు ప్రమాద మృతదేహాలు, క్షతగాత్రులను చూసి మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత, జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ చలించిపోయారు. పరామర్శించేందుకు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన వారు బాధితుల బంధువుల ఆర్తనాదాలు చూసి కంటతడి పెట్టారు.   కాగా, ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు రూ.8 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు, ఆర్టీసీ తరఫున రూ.3 లక్షలు అందిస్తామన్నారు. చనిపోయిన వారిలో రైతులు ఉంటే రైతుబీమా కింద మరో రూ.5 లక్షల పరిహారం అందుతుందన్నారు.  ఓవర్‌లోడ్‌తో బస్సును నడిపించినందుకు జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. 
బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్న కేటీఆర్, మహేందర్‌ రెడ్డి, ఈటల, ఎంపీ కవిత తదితరులు

కాలం చెల్లిన బస్సులు 
ఆర్టీసీ ధనదాహమే 60 మంది చావుకు కారణమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం ఒక్కో ఆర్టీసీ బస్సు 10 లక్షల కిలోమీటర్లు మాత్రమే నడపాలి. అయితే ప్రమాదానికి గురైన బస్సు పెద్దపల్లి జిల్లా మంథని డిపోలో రెండు నెలల క్రితమే 20 లక్షల కి.మీ తిరిగింది. తర్వాత ఆ బస్సును ఉన్నతాధికారుల మెప్పుకోసం జగిత్యాలకు తీసుకొచ్చి కొడిమ్యాల నుంచి జగిత్యాల రూట్‌లో నడుపుతున్నారు. రెండు నెలల కాలంలో ఇప్పటి వరకు ఆ బస్సు అదనంగా మరో 4 లక్షల కి.మీ తిరిగింది. మరోవైపు మూడేళ్ల క్రితం వరకు 8 లక్షల కి.మీ తిరిగిన బస్సులను ఆర్టీసీ స్క్రాప్‌ కింద పక్కన పెట్టేది. తర్వాత 10 లక్షల కి.మీ, 12 లక్షల కి.మీ వరకు పరిమితిని పెంచి ఇటీవల 14 లక్షల కి.మీ తప్పనిసరి చేసిందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ప్రమాదానికి గురైన బస్సుకు 3 నెలల క్రితమే మరమ్మతులు చేసి.. రంగుపూసి రోడ్డెక్కిచ్చినట్లు చెబుతున్నారు. 

ఆ దృశ్యం భయానకం...
ఒక బాంబు పేలుడు జరిగితే ఎంతటి భయానకమైన పరిస్థితి కనిపిస్తుతుందో.. కొండగట్టు బస్సు ప్రమాదం అంతకు మించిన భయానక దృశ్యాన్ని చూపిస్తోంది. బస్సంతా ఛిన్నాభిన్నం.. స్టీరింగ్‌ ఎక్కడకు పోయిందో తెలియదు.. గేర్‌ రాడ్‌బాక్స్‌ తుక్కుతుక్కుగా మారిపోయింది. సీట్లు ఆకృతిని కోల్పోయి భయంకరమైన దృశ్యాన్ని తలపించాయి. ఘాట్‌ రోడ్డు నుంచి వస్తూ స్పీడ్‌ బ్రేకర్ల వద్ద బస్సు పట్టుతప్పింది. నేరుగా 15 మీటర్ల లోతులో ఉన్న గుంతలో పడింది. బస్సు ముందు భాగం వేగంగా వెళ్లి గుంత గట్టు ప్రాంతాన్ని ఢీకొట్టింది. ఇక్కడే బస్సులో నిల్చుని ఉన్న వాళ్లంతా డ్రైవర్‌ పైనా, గేర్‌ బాక్స్‌ ప్రాంతం నుంచి అద్దాల మీద పడి గుంత దరిని ఢీకొట్టారు. ఇక్కడే 15 నుంచి 25 మంది వరకు ప్రాణాలు కోల్పోయి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. సీట్లలో కూర్చున్న వాళ్లు వెనుక భాగంలో నిల్చొని ఉన్న వాళ్లు సైతం ఒక్క కుదుపుకే తీవ్రమైన గాయాలతో, ఇంటర్నల్‌ బ్లీడింగ్‌తో సంఘటనా స్థలిలోనే మృత్యవాతపడ్డారు. మిగిలిన వాళ్లని బయటకు తీసే క్రమంలో స్థానికులు, భక్తులు ఎంత సహాయం చేసినా అంతర్గతంగా తగిలిన గాయాలతో మార్గమధ్యంలో, చికిత్స సమయంలో మృత్యువాతపడ్డట్టు పోలీస్‌ ఉన్నతాధికారులు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా