కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

23 Dec, 2018 04:52 IST|Sakshi
ఉగ్రవాదుల మృతదేహాలను తరలించిన ఆర్మీ క్యాంప్‌ వద్ద భద్రతా బలగాలు

ఆరుగురు ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌

కాల్పుల్లో జకీర్‌ ముసా సన్నిహితుడు హతం

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులకు చావుదెబ్బ తగిలింది. పుల్వామా జిల్లాలోని అవంతిపొరా ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతాబలగాలు అల్‌కాయిదా అనుబంధ సంస్థ అన్సర్‌ ఘజ్వతుల్‌ హింద్‌(ఏజీయూహెచ్‌)కు చెందిన ఆరుగురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయినవారిలో ఏజీయూహెచ్‌ అధినేత జకీర్‌ ముసా సన్నిహితుడు, సంస్థ డిప్యూటీ చీఫ్‌ సొలిహా మొహమ్మద్‌ అఖూన్‌ ఉన్నాడు. ఈ విషయమై కశ్మీర్‌ రేంజ్‌ పోలీస్‌ ఐజీ స్వయంప్రకాశ్‌ పానీ మీడియాతో మాట్లాడుతూ..‘ఉగ్రవాదులు పుల్వామాలోని అవంతిపొరా ప్రాంతంలో నక్కినట్లు నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన బలగాలు ఇక్కడి ఆరంపొరా అనే గ్రామాన్ని చుట్టుముట్టి గాలింపు ప్రారంభించాయి.

ఇంతలోనే భద్రతాబలగాల కదలికల్ని పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి పరారయ్యేందుకు యత్నించారు. ఈ సందర్భంగా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు ఏజీయూహెచ్‌ ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను సోలిహా మొహమ్మద్, ఫైజల్‌ అహ్మద్, నదీమ్‌ సోఫీ, రసీక్‌ మిర్, రౌఫ్‌ మిర్, ఉమర్‌ రమ్జాన్‌గా గుర్తించాం. మృతుల్లో ఏజీయూహెచ్‌లో నంబర్‌ 2గా ఉన్న సోలిహా మొహమ్మద్‌ ఉన్నాడు. ఈ ఎన్‌కౌంటర్‌లో జవాన్లు ఎవరూ గాయపడలేదు’ అని తెలిపారు. మృతదేహాలను సంబంధీకులకు అప్పగించామని వెల్లడించారు. ఘటనాస్థలి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.  
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు