జూ పార్క్‌లో కూలిన భారీ వృక్షం.. మహిళ మృతి

20 Apr, 2019 20:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి జూపార్కులో చెట్టు నెలకొరగడంతో ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు, జూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్‌కు చెందిన నిఖత్‌ ఫాతిమా (60) కుటుంబ సభ్యులతో కలిసి నెహ్రూ జూలాజికల్‌ పార్కు సందర్శనకు వచ్చింది. శనివారం సాయంత్రం ఈదురు గాలులకు పెద్ద వర్షం రావడంతో భారీ చెట్టు కూలి నెలకొరిగాయి. జూలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న నిఖత్‌ ఫాతిమాపై భారీ చెట్టు పడటంతో తీవ్ర గాయాలకు గురైంది. దీంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా.. మృతి చెందినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. దీంతో పాటు మరో 10 మందికి స్వల్ప గాయాలకు గురైనట్లు పోలీసులు, జూపార్కు అధికారులు తెలిపారు. 

సంఘటన స్థలాన్ని సందర్శించిన ఫారెస్ట్‌ అధికారులు
పార్క్‌ సందర్శనకు వచ్చిన ఓ సందర్శకురాలు మృతి చెందడం...పదిమందికి పైగా సందర్శకులు గాయాల పాలవడంపై హెడ్‌ ఆఫ్‌ ద ఫారెస్ట్‌ పీసీసీఎఫ్‌ ప్రశాంత్‌ కుమార్‌ ఝా విచారం వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. జూపార్కు డైరెక్టర్‌ సిదానంద్‌ కుక్రెట్టి, జూ క్యూరేటర్‌ క్షితిజాలు జూలో నెలకొరిగిన చెట్ల ప్రదేశాలను పరిశీలించారు.  ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు. 

గాలివాన దెబ్బకు నేలకూలిన చెట్లు
శనివారం సాయంత్రం నగరంలోని వివిధ ప్రాంతాల్లో కురిసిన గాలి వానకు పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో గోడలు కూలాయి.చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీరునిలిచిపోయింది. సాయంత్రం 6 గంటల వరకు 47 చెట్లు కూలినట్లు, 18 ప్రాంతాల్లో నీరు నిలిచిపోయినట్లు జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదులందాయి. వాన సమస్యలపై అందిన ఫిర్యాదులకు తక్షణమే స్పందిస్తూ జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్‌ (డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌) బృందాలు రంగంలోకి దిగి తక్షణ సహాయక చర్యలందించాయి. బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్‌, కామినేని ఆస్పత్రి,  హైకోర్టు వెనుక భాగంలో, హుస్సేనిఆలం పీఎస్‌ ముందు, మిశ్రీగంజ్‌ ఆయా హోటల్‌,  శాలిబండ పీఎస్‌ వెనుక, హుస్సేనీఆలం హనుమాన్‌ మందిర్‌ వద్ద,తదితర ప్రాంతాల్లో  చెట్లు నేలకూలాయి. 

పాతబస్తీలోని నూర్‌ఖాన్‌ బజార్‌లో కొత్తగా నిర్మించిన భవనం పిట్టగోడ కూలింది. దాంతోపాటు చెట్లు కూడా నేలకొరిగి అక్కడున్న మూడు బైక్‌లపై పడ్డాయి. ఫలక్‌నుమా రైల్వేస్టేషన్‌ పార్కింగ్‌ ప్రదేశంలో భారీ చెట్టు నేలకూలింది.  ఆయా ప్రాంతాల్లో గాయపడ్డవారికి డీఆర్‌ఎఫ్‌ బృందాలు ప్రాథమిక వైద్యసేవలందించాయి. జోనల్‌ కమిషనర్లు అప్రమత్తంగా ఉండి, అత్యవసర ఫిర్యాదులపై క్షేత్రస్థాయి బృందాలు తక్షణ సాయమందించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ దానకిశోర్‌ సూచించారు. లోతట్టు ప్రాంతాలపై అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఇంజినీర్లకు సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

>
మరిన్ని వార్తలు