62 ఏళ్లు.. 113 క్రిమినల్‌ కేసులు

19 Aug, 2018 11:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వందకు పైగా క్రి​మినల్‌ కేసులున్న గ్యాంగ్‌స్టర్‌ బష్రీన్‌ అలియాస్‌ మమ్మీని ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు శనివారం సాయంత్రం అరెస్టు చేశారు. తన ఎనిమిది మంది కొడుకులు, మిగతా గ్యాంగ్‌ సభ్యులతో కలిసి పలు నేరాలకు మమ్మీ పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. విదేశాల్లోనూ జరిగిన పలు నేరాల్లోనూ వీరి హస్తం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా నమోదైన 113 కేసుల్లో మోస్ట్‌ వాంటెడ్‌ లిస్టులో మమ్మీ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

ఉపాధి కోసం వచ్చి నేరవృత్తి
రాజస్తాన్‌కు చెందిన బష్రీన్‌ 17 సంత్సరాల క్రితం తన కొడుకులతో కలిసి ఉపాధి నిమిత్తం ఢిల్లీకి వలస వచ్చింది. డబ్బులు సులువుగా సంపాదించాలనే ఉద్దేశంతో నేర వృత్తిని ఎంచుకుంది. తన ఎనిమిది మంది కొడుకులతో కలిసి దొంగతనం, హత్యలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు వంటి పలు నేరాలకు పాల్పడింది. ఈ ముఠా సభ్యులు ఎనిమిది నెలల క్రితం ఒకరిని హత్య చేసేందుకు ఒప్పందం చేసుకొని అతడిని అడవిలోకి తీసుకెళ్లి అతి దారుణంగా చంపి, అక్కడే కాల్చివేశారు. కొన్ని రోజుల తర్వాత ఆ ప్రాంతంలో దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హత్య కేసును దర్యాప్తుచేసిన పోలీసులు మమ్మీని తప్పా మిగిలిన నిందితులను అరెస్టు చేశారు. మమ్మీని పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారింది. శనివారం సంగం విహార్‌లో ఉంటున్న తన బంధువులను కలవడానికి వచ్చిన మమ్మీని  పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు.   

మరిన్ని వార్తలు