డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో 67 రోజుల జైలు శిక్ష

18 Sep, 2018 04:08 IST|Sakshi

మహబూబ్‌నగర్‌ క్రైం: డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసుల చరిత్రలో ఇప్పటి వరకు 30 రోజుల వరకు జైలు శిక్ష విధించిన సందర్భాలు ఉన్నాయి. కానీ తాగి వాహనం నడిపిన ఓ వ్యక్తికి ఏకంగా 67 రోజుల జైలు శిక్ష విధించిన ఘటన ఇది. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ పోలీసులు ఆదివారం రాత్రి తనిఖీలు చేపట్టగా ఐదుగురు వాహనదారులు మద్యం తాగినట్లు తేలింది. సోమవారం ఉదయం వీరిని ట్రాఫిక్‌ సీఐ అమర్‌నాథ్‌రెడ్డి జిల్లా మొబైల్‌ కోర్టులో హాజరుపర్చారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తి తేజో కార్తీక్‌ కేసులను పరిశీలించగా.. ఓ వ్యక్తి మోతాదుకు మించి మద్యం తాగి కనీస స్పృహ లేకుండా వాహనం నడిపినట్లు తేలింది. దీంతో జడ్జి 30 రోజుల జైలు శిక్ష, రూ.4,500 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. అయితే సంబంధిత వాహనదారుడు జరిమానా చెల్లించకపోవడంతో మరో 37రోజులు అదనంగా జైలు శిక్ష విధించడంతో మొత్తంగా ఆ వ్యక్తికి 67 రోజుల జైలు శిక్ష పడింది. ఇదే సందర్భంగా మరో వాహనదారుడికి 10 రోజుల జైలు శిక్ష, రూ.2,500 జరిమానా, ఇంకో ముగ్గురికి ఒక్కొక్కరికి ఐదు రోజుల జైలు శిక్షతో పాటు ముగ్గురికి కలిపి రూ.9వేల జరిమానా విధించారు.

మరిన్ని వార్తలు