ఐపీఎల్‌ బెట్టింగ్‌: మరికొందరు బాలీవుడ్‌ స్టార్స్‌ 

3 Jun, 2018 16:04 IST|Sakshi
అర్బాజ్‌ ఖాన్‌ (ఫైల్‌ ఫొటో)

బార్‌ డ్యాన్సర్లతో సోను జలాన్‌ దందా

సెల్‌ఫోన్‌తో మాటలు రికార్డు.. ఆపై బెదిరింపులు

బాలీవుడ్‌ ప్రముఖుల పేర్లు వెల్లడించిన అర్బాజ్‌ ఖాన్‌

ముంబై : ఐపీఎల్‌ బెట్టింగ్‌ విచారణలో భాగంగా సల్మాన్‌ తమ్ముడు అర్బాజ్‌ ఖాన్‌ను విచారించిన పోలీసులుకు విస్తుపోయే విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈ కేసులో అరెస్ట్‌ అయిన సోను జలాన్‌ వాంగ్మూలంతో థానే పోలీసులు అర్భాజ్‌ ఖాన్‌ను విచారించిన విషయం తెలిసిందే. ఈ విచారణ అనంతరం ఈ రాకెట్‌తో సంబంధమున్న మరింత మంది పేర్లు పోలీసులకు తెలిసినట్లు జాతీయ మీడియా వర్గాలు కథనాలు ఉటంకిచాయి. 

పోలీసులకు అర్భాజ్ ఏడుగురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లు వెల్లడించాడని, ఆ పేర్లు విని పోలీసులు షాకయ్యారని తెలుస్తోంది. ఇక సోను జలాన్ ను విచారించగా, కోమల్, గాయత్రి అనే ఇద్దరు బార్ డ్యాన్సర్లతో తాను సిండికేట్ అయి దందాను నడిపించినట్టు చెప్పడంతో, వారిని నేడో రేపో అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్దమైనట్లు సమాచారం. సోను జలాన్‌కు ఫోన్‌లో రికార్డు చేసే అలవాటుందని, అందులో భాగంగానే సెలబ్రిటీలతో మాట్లాడేవేళ, ఆ మాటలను తన సెల్ ఫోన్ లో రికార్డు చేసేవాడని, ఆపై వారిని బెదిరించేవాడని కూడా పోలీసులు తేల్చారు. సోనూ క్లయింట్లుగా హై ప్రొఫైల్ వ్యక్తులున్నారని, అర్బాజ్ ను కూడా బెదిరించే సోనూ తన సిండికేట్ లో చేర్చుకున్నాడని చెప్పారు. సోనూ క్లయింట్లుగా 1,200 మంది ఉన్నారని, ఈ సోనూ లాంటి వ్యక్తులను దేశవ్యాప్తంగా 100 మందిని ‘జూనియర్ కోల్కతా’ అనే వ్యక్తి నియమించుకున్నాడని తెలుస్తోంది.

‘జూనియర్ కోల్ కతా’ అండర్ వరల్డ్ డాన్‌ దావుద్‌ అనుచరుడని, బెట్టింగ్ రాకెట్ బయటకు రాగానే అతను దేశాన్ని వదిలి పారిపోయాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకూ ఆరుగురిని అరెస్ట్ చేశామని ముంబై క్రైమ్ బ్రాంచ్ డీసీపీ అభిషేక్ త్రిముఖే మీడియాకు తెలిపారు. మరికొందరిని విచారిస్తున్నామని, సోనూ జలన్ విచారణలో అర్బాజ్ ఖాన్ పేరు చెప్పాడని, ఆయన్ను విచారించి స్టేట్ మెంట్ ను రికార్డు చేశామన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా