చిన్నారిని బలిగొన్న టీవీ సీరియల్‌!

29 Nov, 2017 23:17 IST|Sakshi
చిన్నారి ప్రార్థన (ఫైల్‌ ఫొటో)

ఏడేళ్లకే.. నూరేళ్లు!

టీవీలు, సినిమాలు వినోదాన్ని పంచాలి. నవ్వించాలి. ఏకాంతాన్ని మరిపించాలి. విజ్ఞానాన్ని పంచాలి. చరిత్రను, సంస్కృతిని చాటిచెప్పాలి. కానీ.. అలా జరగడంలేదు. సినిమాలే కాదు, సీరియళ్లు కూడా హింసను, పగను, ద్వేషాన్ని ప్రేరేపిస్తున్నాయి. వినోదాన్ని పంచాల్సిందిపోయి.. విషాదాన్ని మిగిలిస్తున్నాయి.

సాక్షి, బెంగళూరు: హింస, పగ, ద్వేషంతో కూడిన నేటి టీవీ సీరియళ్లు పిల్లలపై ఎంతటి దుష్ప్రభావాన్ని చూపుతాయో తెలిపే సంఘటన ఇది. తల్లిదండ్రులతో కలిసి టీవీలో సీరియల్‌ చూసిన ఓ చిన్నారి, అందులో హీరోయిన్‌ చేసినట్లుగానే మంటల మధ్య డ్యాన్స్‌ చేయడానికి యత్నించి సజీవ దహనమైంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాల్లోకెళ్తే...

దావణగెరె జిల్లా హరిహర పట్టణలోని ఆశ్రయ కాలనీలో నివాసం ఉంటున్న చైత్రా, మంజునాథల కుమార్తె ప్రార్థన (7). రెండో తరగతి చదువుతోంది. ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో ఓ టీవీ చానల్‌లో ప్రసారమయ్యే ‘నందిని’ సీరియల్‌ను ఇష్టంగా చూసేది. ఈ నెల 11న  ప్రార్థనను పాఠశాల నుంచి తీసుకొచ్చిన నాయనమ్మ టీవీ ఆన్‌ చేసి బయటికి వెళ్లిపోయింది. ఆ సమయంలో సీరియల్‌లో హీరోయిన్‌ తనకు తాను నిప్పంటించుకొనే సన్నివేశం రావడంతో తాను కూడా అలాగే చేయాలనుకున్న బాలిక.. ఇంట్లో ఉన్న పేపర్లను చుట్టూ వేసుకుని నిప్పంటించింది. వాటి మధ్య నిలబడి డ్యాన్స్‌ చేయడానికి ప్రయత్నించింది. ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రార్థనా శరీరానికి నిప్పంటుకొని తీవ్ర గాయాలయ్యాయి. బాధను తట్టుకోలేక ప్రార్థన కేకలు వేయడంతో పొరుగువారంతా వచ్చి, మంటలను ఆర్పేసి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కోలుకోలేనిస్థాయిలో బాలిక శరీరం కాలిపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 24 గంటలు గడవకముందే మరణించింది.

ఏ తల్లిదండ్రులకూ ఈ పరిస్థితి వద్దు..
ఘటన వివరాలను ప్రార్థన తల్లిదండ్రులు బుధవారం మీడియాకు వివరించారు. ‘మా చిన్నారి ఆ సీరియల్‌ను ప్రతిరోజూ చూస్తూ వాటిలోని పాత్రలను అనుకరించేది. ఆ సీరియల్‌లో హీరోయిన్‌ చేసినట్లుగానే చేసింది. ఇన్ని రోజులు బాధలో ఉన్న మేము, భవిష్యత్తులో ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రాకూడదనే నిజాన్ని మీడియా ఎదుట చెబుతున్నాం’అని కంటతడి పెట్టుకున్నారు.

మరిన్ని వార్తలు