బాలుడికి ఉరి.. తల్లిపైనే అనుమానాలు!

18 Nov, 2019 10:26 IST|Sakshi

మెడపై గాయాలు..

ఉరేసినట్లు ఆనవాళ్లు

నిజామాబాద్‌ జిల్లాలో ఘటన 

సాక్షి, డిచ్‌పల్లి(నిజామాబాద్‌) :  చెల్లెలితో సరదాగా ఆడుకుంటున్న ఓ బాలుడు అంతలోనే విగత జీవిగా మారాడు. తల్లి పొంతన లేని మాటలు.. బాలుడి మెడపై తాడుతో ఉరి వేసినట్లు గాయాలు ఉండటంతో తల్లియే ఉరేసి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలంలోని ధర్మారం(బి) గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామంలో జన్నెపల్లి అశోక్, సునీత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు నాగరాజు, రాజేశ్, కూతురు ధనలక్ష్మి సంతానం. పెద్ద కుమారుడు నాగరాజు పిట్లంలో అమ్మమ్మ దగ్గర ఉంటూ చదువుకోగా.. రెండో కుమారుడు, కూతురు తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు. ఆదివారం ఉదయం ఇంటి ఎదుట చెల్లెలితో కలసి రాజేశ్‌ ఆడుకున్నాడు. కొద్ది సేపటికే విగత జీవిగా కనిపించాడు. మృతదేహాన్ని పరిశీలించిన స్థానికులు.. మెడపై గాయాలు ఉండటంతో ఉరి వేసి చంపి ఉంటారని అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.  

పొంతనలేని మాటలు  
తనతో గొడవ పడే ఇద్దరు మహిళలు రాజేశ్‌కు చాక్లెట్లు ఇచ్చి గొంతు నులిమి హత్య చేశారని తల్లి సునీత పోలీసులకు చెప్పింది. అయితే రాజేశ్‌ను పాము కాటు వేసిందని, తొందరగా రావాలని భార్య సునీత ఫోన్‌ చేస్తే ఇంటికి వచ్చానని భర్త అశోక్‌ తెలిపాడు. కొడుకు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తీసుకెళ్లనిచ్చేది లేదని సునీత పట్టు బట్టడం, పొంతన లేని సమాధానాలు చెప్పడంతో రాజేశ్‌ మృతిపై మరిన్ని సందేహాలను రేకిత్తిస్తున్నాయి. ఆమె వివాహేతర సంబంధాలకు కుమారుడు అడ్డుగా ఉన్నాడని ఉరి వేసి చంపి ఉం టుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇంట్లో పగిలిన గాజులు, ఇతర ఆధారాలను పోలీసులు సేకరించారు. మృతుడి మెడపై ఉన్న గాయాలను నిజామాబాద్‌ ఏసీపీ శ్రీనివాస్‌కుమార్‌ పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి నిజాలను రాబడతామని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా