యువతికి నరకం చూపిన మృగాడి వికృతచేష్టలు

17 Mar, 2019 15:19 IST|Sakshi
యువతులతో సెల్ఫీ తీసుకుంటున్న నిందితుడు

సాక్షి ప్రతినిధి, చెన్నై: కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి మంటలు ఇంకా ఆరకముందే అదే తరహాలో మరో దారుణం బైటపడింది. నాగపట్టినం జిల్లాకు చెందిన మరో దుర్మార్గుడు యువతుల జీవితాలతో చెలగాటమాడిన వైనం బాధిత ప్రియురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉండగా, పొల్లాచ్చి దోషులను బహిరంగంగా ఉరితీయాలంటూ విద్యార్థినుల ఆందోళనలు శనివారం కూడా కొనసాగాయి. ఇక తాజా సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నాగపట్టినం జిల్లా వెల్లిపాళయంపేట్టై వీధికి చెందిన సుందర్‌ అనే కారు డ్రైవరు, అదే ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల యువతి ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల ప్రియురాలిని కారైక్కాల్‌లోని ఒక లాడ్జీకి తీసుకెళ్లి మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్‌ ఇచ్చాడు.

ఆమె మత్తులోకి జారుకోగానే లైంగికదాడికి పాల్పడుతూ తన సెల్‌ఫోన్‌ ద్వారా వీడియో చిత్రీకరించాడు. స్పృహలోకి వచ్చిన తరువాత తనపై లైంగికదాడి జరిగినట్లు తెలుసుకున్న యువతి అతనితో గొడవపెట్టుకుంది. తన సెల్‌ఫోన్‌లోని దృశ్యాలను ఆమెకు చూపించి బైటకు చెప్పావో వీటిని బహిర్గతం చేసి చంపేస్తానని బెదిరించాడు. అంతటితో వదిలిపెట్టక పదేపదే లైంగికవేధింపులకు పూనుకున్నాడు. దీంతో విసిగిపోయిన యువతి కీల్‌వేలూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సుందర్‌ను అరెస్ట్‌ చేసి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇలా అనేక మంది యువతులను లోబరుచుకున్నట్లు అతడు అంగీకరించాడు.

యువతులకు ఆయుధమే శరణ్యం:
పొల్లాచ్చి ఘటన బాధిత యువతులనే కాదు రాష్ట్రంలోని ప్రజలను, ముఖ్యంగా ఇతర యువతులను తీవ్రంగా కలచివేసింది. యువకులంటేనే భయపడేస్థితికి చేరుకున్నారు. ఏ మగాడి ముసుగులో ఎలాంటి మృగాడు ఉన్నాడోనని భీతిల్లితున్నారు. రాష్ట్రంలో యువతులు ఎంతగా భయభ్రాంతులకు గురవుతున్నారో తెలిపేందుకు ఇద్దరు యువతులు ఉదాహరణగా నిలిచారు. ధనమాన ప్రాణాల రక్షణకు తుపాకీలు చేతబూనడానికి సిద్ధమయ్యారు. కోయంబత్తూరుకు చెందిన 20, 14 ఏళ్ల వయసుగల యువతులు తండ్రితో కలిసి జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చి ఒక వినతిపత్రం సమర్పించారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. పొల్లాచ్చిలో చోటుచేసుకున్న దారుణాల గురించి వివిధ మాధ్యమాల ద్వారా తెలుసుకున్నాం. రాష్ట్రంలో మహిళల భద్రత ప్రశ్నార్థకమైపోయింది. కాబట్టి మా ధనమాన ప్రాణాలను మేమే రక్షించుకునేలా తుపాకీలు ఇచ్చి సహకరించండని కలెక్టరుకు దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం ఆ సోదరీమణులు మీడియాతో మాట్లాడుతూ పొల్లాచ్చి

ఘటనలో బాధితులకు న్యాయం జరుగుతుందా లేదా అని తెలియదు. ఈ వ్యవహారంలో మొదట 1500 వీడియోలు, వందకు పైగా యువతులు బాధింపులకు గురైనట్లు ప్రచారం జరిగింది.  అయితే ప్రస్తుతం నాలుగు వీడియోలు, కొద్దిమంది యువతులు మాత్రమే ఉన్నట్లు చెబుతున్నారు. ఈ దశలో తమకు పరిచయం ఉన్న మగాళ్లలో మరో తిరునావుక్కరసు లేదా సబరిరాజన్‌ ఉంటాడేమోననే భయం కలుగుతోంది. కాబట్టి మా రక్షణ కోసం తుపాకులు సిద్దం చేసుకోకతప్పదు అని చెప్పారు. యువతుల తండ్రి మాట్లాడుతూ, ఫిర్యాదు చేసిన యువతి వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయడం వల్ల విచారణపై నమ్మకాన్ని కోల్పోయామని వ్యాఖ్యానించారు. బాధిత యువతులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదుచేసే వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాల్సి ఉందని ఆయన అన్నారు.

పొల్లాచ్చి నిందితులు 20 మంది :
ఇదిలా ఉండగా, పొల్లాచ్చి దుర్మార్గాల్లో ప్రధాన నిందితుడు తిరునావుక్కరసును పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తుండగా గగుర్పొడిచే మరిన్ని వివరాలను తన వాంగ్మూలంలో అతడు బైటపెట్టినట్లు తెలుస్తోంది. కోవై జైల్లో ఉన్న తిరునావుక్కరసును సీబీసీఐడీ పోలీసులు విచారణ నిమిత్తం శనివారం పొల్లాచ్చికి తీసుకెళ్లారు. రహస్య ప్రదేశంలో ఉంచి వాంగ్మూలం తీసుకుంటున్నారు. తనకున్న ధనబలం, స్నేహితుల తోడ్పాటులో ఈ ఘాతుకాలకు పాల్పడినట్లు చెప్పాడు. పోలీసులతో కూడా పరిచయాలు ఉన్నకారణంగా తమ నేరాలను ధైర్యంగా కొనసాగించామని తెలిపాడు. నకిలీ పేర్లతో ఫేస్‌బుక్‌ అకౌంట్‌లు తెరవడం, యువతులను వల్లో వేసుకోవడం, లైంగికదాడులకు పాల్పడటం చేశామని అన్నాడు. చెన్నైలోని ఒక మహిళా డాక్టర్‌ను తమ గుప్పిట్లో పెట్టుకుని రూ.1.50 కోట్లు కాజేసినట్లు చెప్పినట్లు తెలుస్తోంది. సుమారు 8 నెలల క్రితం ఒక యువతిని బెదిరించి జల్సా చేయగా అతని సోదరుడు తమపై దాడిచేసి సెల్‌ఫోన్‌లోని సుమారు 100 వీడియోలను తొలగించాడని, పోలీసులకు ఫిర్యాదు కూడా చేయగా రాజీచేసి పంపారని చెప్పాడు. తమ అకృత్యాల వెనుక మరో 20 మంది యువకులు కూడా ఉన్నట్లు పోలీసుల ముందు అంగీకరించినట్లు తెలుస్తోంది.

పోలీస్‌శాఖకు న్యాయస్థానం హెచ్చరిక :
బాధిత యువతి వివరాలను కోయంబత్తూరు ఎస్పీ పాండియరాజన్‌ బైటపెట్టిన వ్యవహారంపై మధురై న్యాయస్థానం మండిపడింది. శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదిలా ఉండగా, తిరునెల్వేలీ, తూత్తుకూడి, కన్యాకుమారీ, విరుదునగర్‌ జిల్లాల్లో చోటుచేసుకున్న మానవహక్కుల ఉల్లంఘనలపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ శనివారం తిరునెల్వేలీలో విచారణ చేపట్టింది. పొల్లాచ్చి సంఘటనలో పోలీసుశాఖ సరైన రీతిలో వ్యవహరించకుంటే మానవహక్కుల కమిషన్‌ జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని కమిషన్‌ న్యాయమూర్తి జయచంద్రన్‌ హెచ్చరించారు. పొల్లాచ్చి, చెన్నై జిల్లా కలెక్టర్‌ కార్యాలయం తదితర ప్రాంతాల్లో శనివారం కూడా ఆందోళనలు కొనసాగాయి. యువతుల దృశ్యాలు బహిర్గతమైనట్లే నిందితులను బహిరంగంగా ఉరితీయాలి, తాము చూడాలని యువతులు నినాదాలు చేశారు. కోవైలో 180 మంది విద్యార్దులపై పోలీసులు కేసుపెట్టారు.

మరిన్ని వార్తలు