కుటుంబం ఆత్మహత్యాయత్నం

17 Nov, 2018 12:22 IST|Sakshi
భార్య శిరీష, కుమారుడు ఉమేష్‌చంద్రలతో శ్రీనివాసులు (ఫైల్‌ ) కీర్తన (ఫైల్‌)

కుమారుడి ఆత్మహత్యతో మనస్తాపం..

పురుగుమందు తాగిన భార్యాభర్త, కూతురు

తండ్రీ కూతురు పరిస్థితి విషమం

అనంతపురం, బత్తలపల్లి : ఒకే ఇంట్లో ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. కుమారుడి బలవన్మరణంతో మనస్తాపానికి గురైన తల్లిదండ్రులు కూతురుతో కలిసి పురుగుమందు తాగి అర్ధంతరంగా తనువుచాలించాలనుకున్నారు. వీరిలో తండ్రీ కూతురు పరిస్థితి విషమంగా ఉంది. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. బత్తలపల్లి మండలం జలాలపురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు, శిరీష దంపతులు. వీరికి కుమారుడు ఉమేష్‌చంద్ర (11), కూతురు కీర్తన ఉన్నారు. శ్రీనివాసులు వెలుగులో పని చేస్తూ శిక్షణ ఇచ్చేందు కోసం ఇతర రాష్ట్రాలలో పర్యటిస్తుంటాడు. శిరీష ఆశా వర్కర్‌. కుమారుడు బత్తలపల్లిలోని ప్రయివేట్‌ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. కుమార్తె కీర్తన తనకల్లు రెసిడెన్షియల్‌ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతోంది.  

తల్లిపై నిందలకు మనస్తాపం..
ఆశావర్కర్‌ విధుల్లో భాగంగా శిరీష ఇంటింటికీ తిరుగుతుండటం వల్ల స్థానికులు మాట్లాడే మాటలకు కుమారుడు ఉమేష్‌చంద్ర మనస్తాపం చెందాడు. సోమవారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఉమేష్‌చంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు. సమాచారం అందుకున్న శ్రీనివాసులు వెంటనే మధ్యప్రదేశ్‌ నుంచి స్వగ్రామానికి చేరుకుని కుమారుడి అంత్యక్రియలు పూర్తి చేశాడు. 

కుమారుడి లేని జీవితం వద్దని..
గురువారం రాత్రి ఇంటిలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో శ్రీనివాసులు, శిరీష దంపతులతో పాటు కుమార్తె కీర్తన పురుగుమందు తాగారు. అంతకు ముందే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని శ్రీనివాసులు వెలుగు కార్యాలయం అధికారికి వాట్సప్‌ ద్వారా మెసేజ్‌ పంపాడు. వెంటనే ఆయన బత్తలపల్లి ఎస్‌ఐ వెంకటేశ్వర్లుకు సమాచారం అందించారు. ఎస్‌ఐ గ్రామస్తులను అప్రమత్తం చేశారు. దీంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని ముగ్గురినీ ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం శిరీషను అనంతపురం ఆస్పత్రికి పంపారు. శ్రీనివాసులు, కీర్తనల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

ఆ లేఖ ఏమైంది..?
ఆత్మహత్యాయత్నానికి కారుకైలన వారి పేర్లను సూచిస్తూ శ్రీనివాసులు లేఖ రాసినట్లు బంధువులు తెలిపారు. అయితే ఆ లేఖ ఎవరి వద్ద ఉందనేది తెలియడం లేదు. పోలీసులు కూడా ఇంతవరకూ ఆ లేఖను స్వాధీనం చేసుకోలేదు. ఆ లేఖ దొరికితే ఎవరెవరి పేర్లు ఉన్నాయి.. ఎందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారనేది తెలిసే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు