శిశువును అపహరించిన ఆస్పత్రి సిబ్బంది

9 Feb, 2019 09:48 IST|Sakshi

పుట్టిన బిడ్డను దాచిన వైద్యురాలు 

పోలీసులను ఆశ్రయించిన బాధితులు 

డాక్టర్‌ను అదుపులోకి తీసుకున్న వైనం

అదృశ్యమైన మగ శిశువు ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యక్షం

సాక్షి, కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): పుట్టిన శిశువు మగబిడ్డ కావడంతో జన్మనిచ్చిన తల్లికి సైతం ఆ శిశువును చూపించకుండా ఓ వైద్యురాలు ఆడిన నాటకం.. సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. పుట్టిన బిడ్డను తనివితీరా చూసుకోవాలన్న ఆ తల్లి తాపత్రయాన్ని సైతం పట్టించుకోని ఆ వైద్యురాలు బిడ్డను అప్పటికపుడు వేరే ప్రాంతానికి తరలించేసింది.  గత్యంతరం లేని ఆ అభాగ్యురాలి తల్లి న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. ఈ అమానవీయ ఘటన కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో శుక్రవారం చోటు చేసుకుంది. 

బందరు మండలం సత్రవపాలెంకు చెందిన చిన్నం వెంకటనరసమ్మ కూలి పనులు చేస్తుంటుంది. ఆమెకు నలుగురు సంతానం కాగా కనకదుర్గ పుట్టుకతోనే వికలాంగురాలు. అంగవైకల్యంతో ఉన్న ఆమెకు సంబంధాలు రాకపోవడంతో తల్లితోనే కలసి ఉంటుంది. ఇదిలా ఉండగా కనకదుర్గ అక్క మొగుడు రమణ తరచూ అత్తింటికి వస్తూ కనకదుర్గతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. అనేక మార్లు ఆమెపై లైంగికదాడి చేయడంతో గర్భం దాల్చింది. విషయం కాస్తా చేయి దాటిపోవడంతో ఈ నెల 3వ తేదీన ప్రసవం నిమిత్తం రాజుపేటలోని వాణికుసుమ ఆస్పత్రి వైద్యురాలు వాణికుసుమను తల్లి నరసమ్మ కలిసింది. విషయం వివరంగా చెప్పి ఆపరేషన్‌ చేయాలని కోరింది. అందుకోసం వైద్యురాలు పెద్ద మొత్తంలో  డబ్బు డిమాండ్‌ చేయగా నరసమ్మ తగిన మొత్తంలో ముట్టజెప్పింది.

ఆదివారం కనకదుర్గను ఆస్ప త్రిలో చేర్చగా సోమవారం ఆమెకు ఆపరేషన్‌ చేశారు. కనకదుర్గ మగబిడ్డకు జన్మనిచ్చింది.పుట్టిన బిడ్డను సదరు వైద్యురాలు తల్లికి చూపించకుండా ఉంచింది. అలా రోజు, రెండు రోజులు, మూడు రోజులు గడవగా అనుమానం వచ్చిన బాధితురాలి తల్లి నరసమ్మ వైద్యురాలిని కలిసి పుట్టిన బిడ్డను చూపించాలంటూ వేడుకుంది. పుట్టింది బిడ్డ కాదు గడ్డ మాత్రమే అంటూ వైద్యురాలు బుకాయించింది. గత్యం తరం లేని నరసమ్మ చివరికి పోలీసులను ఆశ్రయించి న్యాయం కోరింది.  రంగంలోకి దిగిన పోలీసులు వైద్యురాలిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న ల్యాబ్‌ టెక్సీషియనే బిడ్డను అపహరించి మచిలీపట్నం దాటించినట్టుగా పోలీసులు  గుర్తించారు. ప్రస్తుతం  శిశువు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఉన్నట్టు సమాచారం. కాగా ఈ తతంగాన్ని తప్పుదారి పట్టించేందుకు పలువురు టీడీపీ నేతలు తెర వెనుక కథ నడిపినట్టు విమర్శలు వస్తున్నాయి.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా