8.86 కిలోల బంగారం స్వాధీనం

25 Nov, 2019 04:19 IST|Sakshi
బంగారాన్ని పరిశీలిస్తున్న విజయవాడ సీపీ తిరుమలరావు

పట్టుబడ్డ ఆభరణాల విలువ రూ.3.18 కోట్లు

బిల్లుల్లేకుండా ముంబై నుంచి అక్రమంగా విజయవాడకు తరలింపు

ఇద్దరిని అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

ఆటోనగర్‌(విజయవాడ తూర్పు): బిల్లులు లేకుండా బంగారు ఆభరణాలను అక్రమంగా విజయవాడకు తరలిస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.3.18 కోట్ల విలువ చేసే 8.861 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి కోట్ల రూపాయల విలువ చేసే బంగారం విజయవాడకు వస్తోందన్న పక్కా సమాచారం నేపథ్యంలో విజయవాడ పోలీసు కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు ఆదేశం మేరకు ఆదివారం టాస్క్‌ఫోర్స్‌ ఏడీసీపీ శ్రీనివాసరావు నేతృత్వంలో విజయవాడలో పలుచోట్ల తనిఖీలు చేపట్టారు.

ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం రింగ్‌ సెంటర్‌ సమీపంలోని బస్టాప్‌ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి బిల్లులు లేకుండా రెండు బ్యాగుల్లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ముంబైకు చెందిన జయేష్‌ జైన్, విజయవాడ ఇస్లాంపేట వాసి పాగోలు శ్రీనివాసరావుగా గుర్తించారు. వీరిని ఇబ్రహీంపట్నం పోలీసులు విచారించగా.. ముంబైలో బంగారు ఆభరణాలను కొనుగోలు చేసి, వాటికి ఎలాంటి బిల్లులు లేకుండా అక్రమమార్గంలో విజయవాడకు చేరవేస్తున్నట్టుగా అంగీకరించారు. ఇలా అక్రమంగా రవాణా చేస్తున్న బంగారు వస్తువులను ఎటువంటి పన్నులు చెల్లించకుండా మార్కెట్‌ ధరలకు జ్యువెలరీ షాపులకు విక్రయిస్తున్నారని, కొంతకాలంగా ఈ దందా కొనసాగుతున్నదని పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు