రూ.కోటికి పైగా నగదు పట్టివేత

20 Mar, 2019 04:26 IST|Sakshi
చిత్తూరు జిల్లాలో స్వాధీనం చేసుకున్న నగదును చూపుతున్న పోలీసులు

పలు జిల్లాల్లో పోలీసుల తనిఖీలు 

పెద్ద ఎత్తున నగదు,బంగారం స్వాధీనం

విశాఖలో టీడీపీ గుర్తు కలిగిన కారులో తరలిస్తున్న రూ.కోటి స్వాధీనం

ఆ సొమ్ము తమదంటూ రంగప్రవేశం చేసిన ఏపీ జీవీబీ అధికారులు

పత్రాలు లేకపోవడంతో నగదు, కారు సీజ్‌ చేసిన పోలీసులు

చిత్తూరు జిల్లాలో 11 కిలోల బంగారం, 60 ఖరీదైన రాళ్లు సీజ్‌ చేసిన పోలీసులు  

సాక్షి, నెట్‌వర్క్‌: ఎన్నికల నేపథ్యంలో పోలీసులు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదు, బంగారం, ఖరీదైన రాళ్లను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లాలో టీడీపీ గుర్తు కలిగిన కారులో తరలిస్తున్న కోటి రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం విశాఖ జిల్లా సీతమ్మపేట నుంచి టీడీపీ గుర్తు ఉన్న కారు పాడేరు వైపు వెళుతోంది. సబ్బవరం వద్ద పోలీసులు ఈ కారును ఆపి తనిఖీ చేశారు. అందులో ఉన్న పెట్టెను తెరిచిచూడగా.. కోటి రూపాయల నగదు కనిపించింది. డ్రైవర్‌ మాణిక్యాలరావు, అందులో ఉన్న మల్లేశ్వరరావు పొంతనలేని సమాధానం చెప్పడంతో కారును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కొద్దిసేపటికి ఏపీ గ్రామీణ వికాస బ్యాంక్‌ రీజనల్‌ మేనేజర్‌ సూర్యనారాయణ, ఇతర అధికారులు సబ్బవరం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఆ నగదు తమ బ్యాంక్‌కు చెందినదని.. సీతమ్మపేట ప్రధాన బ్రాంచ్‌ నుంచి పాడేరులోని శాఖకు తరలిస్తున్నామని చెప్పారు. సరైన పత్రాలు చూపించకపోవడంతో ఆ నగదును సీజ్‌ చేశారు. కారులోని ఇద్దరినీ అదుపులోకి తీసుకొని.. కేసు నమోదు చేశారు. కారుపై టీడీపీ గుర్తు స్పష్టంగా ఉంది. దీంతో అధికారపార్టీకి బ్యాంక్‌ అధికారుల సహకారం ఉందేమోనని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 
గుంటూరు జిల్లాలో.. 
గుంటూరు జిల్లా క్రోసూరు మండలంలోని పెరికపాడు ఎస్‌ఎస్‌టీ చెక్‌పోస్టు వద్ద మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో రూ.4.40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. తుళ్లూరు మండలం పెదపరిమి, వెంకటపాలెం, హరిశ్చంద్రపురంలో పలువురు వ్యక్తుల వద్ద రూ.4,22,000 నగదు దొరికింది. మంగళగిరి పరిధిలోని ఆర్‌ అండ్‌ బీ బంగ్లా వద్ద  తనిఖీల్లో రూ.4,46,646 నగదు పట్టుబడింది. ఈ మొత్తాన్ని సీజ్‌ చేశారు. రెంటచింతల మండలం సత్రశాల వద్ద ఉన్న చెక్‌పోస్టు దగ్గర తనిఖీలు చేపట్టగా రూ.లక్ష దొరికాయి. ఆ వ్యక్తి సరైన పత్రాలు చూపడంతో వదిలివేశారు. 

బంగారం, ఖరీదైన రాళ్లు సీజ్‌..
బీవీసీ లాజిస్టిక్‌ కొరియర్‌ సర్వీస్‌ వాహనం చెన్నై నుంచి తిరుపతికి 11.66 కిలోల బంగారం, 60 ఖరీదైన రాళ్లను తరలిస్తుండగా అధికారులు గంగాధరనెల్లూరు పళ్లిపట్టు చెక్‌పోస్టు వద్ద పట్టుకున్నారు. పట్టుబడిన బంగారాన్ని, ఖరీదైన రాళ్లను ట్రెజరీలో భద్రపరిచారు. 

>
మరిన్ని వార్తలు