ఏఎస్పీ, సీఐలపై సస్పెన్షన్‌ వేటు

23 Jan, 2018 19:28 IST|Sakshi

     వివాహేతర సంబంధం నేపథ్యంలో ఉత్తర్వులు జారీ చేసిన ఉన్నతాధికారులు

     నా కుటుంబాన్ని నాశనం చేయవద్దని అభ్యర్థించినా సీఐ వినిపించుకోలేదు

     చంపుతానంటూ బెదిరించాడు, దీంతోనే బట్టబయలు చేయాల్సి వచ్చింది

     పోలీసుల విచారణలో ఏఎస్పీ భర్త సురేందర్‌రెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: వివాహేతర సంబంధం కేసులో అవినీతి నిరోధక శాఖ అదనపు ఎస్పీ సునీతారెడ్డి, కల్వకుర్తి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మల్లికార్జున్‌రెడ్డిని సస్పెండ్‌ చేస్తూ మంగళ వారం ఆదేశాలు వెలువడ్డాయి. సీఐ మల్లికార్జున్‌ రెడ్డిని వెస్ట్‌జోన్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర సస్పెండ్‌ చేయగా, ఏఎస్పీ సునీతారెడ్డిని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్‌ మిశ్రా సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు వెలువరించారని పోలీస్‌ శాఖ తెలిపింది. వీరిద్దరి వ్యవహారంపై సునీతారెడ్డి భర్త సురేందర్‌రెడ్డి మంగళవారం డీజీపీని కలసి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరినట్టు ఆయన తెలిపారు. 

విచారణ ముమ్మరం చేసిన పోలీసులు
మరోవైపు ఇరువురి అక్రమ సంబంధం విషయంలో కేపీహెచ్‌బీ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా ఏఎస్పీ భర్త సురేందర్‌రెడ్డి, తల్లి ప్రమీలమ్మ, పెద్దమ్మ సునంద, సురేందర్‌రెడ్డి స్నేహితుడు సురేష్‌ కుమార్‌లను పోలీసులు విచారించి ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘటన వివరాలు నమోదు చేసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజిలు, ఇరువురి ఫోన్‌ కాల్‌ డేటాను పోలీసులు సేకరిస్తున్నారు. మల్లికార్జున్‌రెడ్డి తమ కుటుంబంలో నిప్పులు పోశాడని, ఏవేవో ఆశలు చూపి పచ్చని కాపురంలో చిచ్చుపెట్టాడని ఏఎస్పీ తల్లి, పెద్దమ్మలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరువురి కుటుంబాలు రోడ్డున పడొద్దని తాము ఎంతగానో ఓపికపట్టి వివాదం లేకుండా సర్దిచెప్పినా వినిపించుకోలేదని పోలీసులకు తెలిపారు. నా కుటుంబాన్ని నాశనం చేయవద్దని అభ్యర్థించినా సీఐ తీరు మార్చుకోకపోగా తమనే చంపుతానంటూ హెచ్చరించడంతో బట్టబయలు చేయాల్సి వచ్చిందని భర్త సురేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

2016లోనే దొరికినా తీరు మారలేదు
ఏఎస్పీకి, సీఐకి నడుమ సాగుతున్న అక్రమ సంబంధం విషయాన్ని 2016 జూలైలోనే భర్త సురేందర్‌రెడ్డి, కుటుంబసభ్యులు కనిపెట్టి వారిని ప్రశ్నించారు. తమ మధ్య ఎలాంటి సంబంధాల్లేవని బుకాయించడంతో పాటు అనుమానించవద్దని ఇరువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. భర్తతో పాటు కుటుంబసభ్యులు గట్టిగా నిలదీయడంతో మరోమారు ఇలా జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చి ఇరువురు క్షమాపణ చెప్పారు. ఇకపై ఎలాంటి సంబంధాలను కలిగి ఉండనని చెప్పడంతో భార్య మాటలను నమ్మిన సురేందర్‌రెడ్డి కాపురం సాగించాడు.

ఇటువంటి చర్యలను ఉపేక్షించబోం: నాయిని 
పోలీసు శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించిన ఏఎస్పీ, సీఐలపై చర్యలు తీసుకున్నామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. భవిష్యత్తులో పోలీస్‌ శాఖలో ఇటువంటి చర్యలకు పాల్పడితే ఎంతటి స్థాయి అధికారులనైనా ఉపేక్షించ బోమని ఆయన స్పష్టం చేశారు.

మెసేజ్‌లో పెళ్లి ప్రపోజల్‌..
కొన్ని రోజుల తర్వాత మల్లికార్జున్‌రెడ్డి నుంచి సునీత ఫోన్‌కు మెసేజ్‌లు రావడం, తనకంటే ఉన్నతస్థాయిలో ఉన్న అధికారిణి పట్ల గౌరవం లేకుండా ఏక వాక్యంగా మెసేజ్‌లు పంపడం చూసిన సురేందర్‌రెడ్డికి అనుమానం మొదలైంది. మల్లికార్జున్‌రెడ్డి ఏఎస్పీ సెల్‌కు పంపిన మెసేజ్‌లో వివాహం చేసుకుందామని ప్రతిపాదించడం చూసిన ఆయన ఇరువురు అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారని నిర్ధారణకు వచ్చాడు. ఈ క్రమంలో మల్లికార్జున్‌రెడ్డి తనను చంపేస్తానని బెదిరించడంతో మనోవేదనకు గురైన ఆయన భార్య తరఫు కుటుంబీకుల మద్దతు తీసుకుని ఇరువురి బండారం బట్టబయలు చేయాలని నిర్ణయించు కున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆదివారం అర్ధరాత్రి ఇరువురు తన నివాసానికి 11.30 సమయంలో వచ్చి సుమారు రెండున్నర గంటల పాటు కలసి ఉన్న విషయాన్ని బట్టబయలు చేశాడు.

మరిన్ని వార్తలు