అవినీతి ‘శివ’తాండవం

4 Oct, 2019 09:23 IST|Sakshi
శివప్రసాద్, ఎంవీఐ  

సాక్షి, తాడిపత్రి : ఆయన రూటే సప‘రేటు’. ఏజెంట్లను అడ్డుపెట్టుకొని లక్షలాది రూపాయలను దండుకున్నాడు. నాపరాళ్ల ట్రాక్టర్ల డ్రైవర్లతోనూ మామూళ్లు వసూలు చేసి లక్షలు వెనకేసుకున్నాడు. ఈ అవినీతి తిమింగళం నేడు ఏసీబీ వలలో చిక్కుకుంది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టి కోట్లకు పడగలెత్తిన కర్నూలు మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎంవీఐ) అక్కిరాజు శివప్రసాద్‌ అరెస్టయ్యారు. కర్నూలు, హైదరాబాద్, బెంగళూరుతో పాటు మొత్తం ఐదు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఇప్పటికే రూ.8 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించారు. ఆయన పేరుమీద దాదాపు రూ.20 కోట్ల మేర ఆస్తులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అనంతపురానికి చెందిన ఈయన గతంలో తాడిపత్రిలో నాలుగేళ్లపాటు ఎంవీఐగా విధులు నిర్వహించారు. రెండు నెలల క్రితమే బదిలీపై ఇక్కడి నుంచి కర్నూలుకు వెళ్లారు. కర్నూలులో పట్టుబడిన ఈయన అవినీతి ప్రస్థానం తాడిపత్రి నుంచే మొదలైంది.

ఎఫ్‌సీ ఇవ్వాలంటే రూ.4వేలు  
సాధారణంగా పసుపు పచ్చ నంబర్‌ ప్లేట్‌ గల మూడు, నాలుగు  చక్రాల వాహనాలకు ఎఫ్‌సీ సర్టిఫికేట్‌ (ఎఫ్‌సీ) ఇవ్వాలంటే రూ.4వేల నుంచి రూ.5వేలు ముట్టజెప్పాల్సిందే. సాధారణంగా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే రూ.800తో సరిపెట్టుకోవచ్చు. అయితే అలా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి ఏవేవో సాకులు చెప్పి వెనక్కు పంపించేవాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ ఏజెంట్ల దార్వా ఎఫ్‌సీ కోసం వెళితే వెంటనే పనిచేసి వారి ద్వారా ముడుపులు తీసుకునేవారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

ట్రాక్టర్ల నుంచి రూ.20 లక్షలు వసూళ్లు 
తాడిపత్రి ప్రాంతం కర్నూలు, కడప జిల్లా సరిహద్దు. కర్నూలు జిల్లా నుంచి అధికంగా నాపరాళ్ల లోడు ట్రాక్టర్లు తాడిపత్రి పట్టణంలోని నాపరాళ్ల పరిశ్రమలకు సరుకును దిగుమతి చేసేందుకు వస్తూంటాయి. అదనపు లోడుతో వస్తున్న ట్రాక్టర్ల నుంచి కూడా ఈయన లక్షల్లో మామూలు వసూలు చేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక్కొ ట్రాక్టర్‌కు నెలకు రూ3.వేలు చొప్పున ఏజెంట్ల ద్వారా నెలకు రూ.15 లక్షల నుంచి రూ.20లక్షల వరకు వసూలు చేశాడన్న ఆరోపణలున్నాయి.  

స్పీడ్‌ గవర్నర్‌ పరికరాల విక్రయాల్లోనూ వాటా 
వాహనం వేగ నియంత్రణ కోసం అమర్చే స్పీడ్‌ గవర్నర్‌ పరికరాల విక్రయాల్లో కూడా భారీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ వాహనానికి స్పీడ్‌ గవర్నర్‌ పరికరం అమర్చాలంటే దాని అసలైన ఖరీదు రూ.4,500 నుంచి రూ.5000 వరకు పలుకుతోంది. కానీ ఎంవీఐ శివప్రసాద్‌ తన బినామీ ఏజెంట్‌ను నియమించుకొని ఒక్కొక్క స్పీడ్‌ గవర్నర్‌ పరికరాన్ని అదనంగా రూ.2వేలు అంటే రూ.7వేలకు విక్రయించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  ప్రతి రోజూ ఎఫ్‌సీకి వెళ్లిన ప్రతి వాహనానికీ స్పీడ్‌ గవర్నర్‌ పరికరాన్ని విధిగా అమర్చుకోవాలని నిబంధనలు విధించడంతో గత్యంతరం లేని పరిస్థితులో వాహనదారులు అమర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడంతో ఈ స్పీడ్‌ గవర్నెన్స్‌ పద్ధతి రద్దు అయినట్లు తెలిసింది.  

ఏజెంట్ల ద్వారానే లైసెన్సులు మంజూరు  
సాధారణంగా రవాణా సంస్థలో ఏజెంట్ల వ్యవస్తను రద్దు చేసింది. కానీ తాడిపత్రిలో ఆర్టీఓ కార్యాలయంలో ఏజెంట్లు నిత్యం తారసపడుతూనే ఉంటారు. ఎంవీఐ శివప్రసాద్‌ ఏజెంట్ల ద్వారా వచ్చిన లైసెన్సులను మాత్రమే పరిశీలించి ఎల్‌ఎల్‌ఆర్, ఆర్సీలు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఏజెంట్లు టూవీలర్, ఫోర్‌వీలర్‌కు లైసెన్సు కావాలంటే రూ.4వేలు చెల్లించాల్సిందే. ఈ మొత్తంలో ఎంవీఐ శివప్రసాద్‌కు వాటా అన్న విషయాన్ని ఇక్కడి ఏజెంట్లు బాహాటంగా పేర్కొంటున్నారు. ఏజెంట్ల కార్యాలయాలు కూడా ఆర్టీఏ కార్యాలయం ప్రాంగణంలోనే ఉండడం విశేషం.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా