అతడు ఓ.. అవినీతి ‘ఘను’డు

1 Feb, 2019 07:15 IST|Sakshi
ఏసీబీ అధికారుల సోదాల్లో గుర్తించిన కోట్లకుపైగా నగదు

అనకాపల్లి ఏడీ ఆస్తులపై ఏసీబీ దాడులు

మూడు జిల్లాల్లో.. ఏడు చోట్ల సోదాలు

బయటపడిన రూ.50 కోట్లకుపైగా అక్రమాస్తులు

ఉద్యోగానికి డొక్కు స్కూటర్‌లో ప్రయాణం ఇంట్లోని వాటర్‌ క్యాన్‌లో మాత్రం లక్షలు నిల్వ

దాదాపు 2 కేజీల బంగారం, 3 కేజీల వెండి లభ్యం మూడు లాకర్లలో రూ.2 కోట్లకుపైగా నగదు

కోట్ల విలువ చేసే భవంతులు, వ్యవసాయ భూములు, స్థలాలు

ఆరు నెలలుగా నిఘా వేసి పంజా విసిరిన ఏసీబీ

లాకర్లలో రూ.కోట్ల కట్టలు.. వాటర్‌ క్యాన్‌లోనూ లక్షలకు లక్షలు.. కోట్ల విలువైన బంగారు నిధి.. విశాఖ నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో భారీ భవంతులు.. పక్క జిల్లాల్లో వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలు.. వెరసి రూ.50 కోట్లకుపైగా అక్రమాస్తులు..రోజూ కాలం చెల్లిన పాత బజాజ్‌ స్కూటర్‌పై రైల్వేస్టేషన్‌కు వెళ్లి.. అక్కడి నుంచి రైలులో తను పనిచేసే అనకాపల్లికి వెళ్లే ఓ అధికారి ఇన్ని భారీ ఆస్తులు సంపాదించారంటే ఎవరైనా సరే.. నమ్మరేమో!..కానీ గురువారం ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో బయటపడిన అవినీతి గని.. దీన్ని నమ్మక తప్పదని చెబుతోంది..

ఆ అవినీతి ‘గను’డు.. అనకాపల్లి కేంద్రంగా పని చేస్తున్న గనులు, భూగర్భ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గుండు శివాజీ.టెక్నికల్‌ అసిస్టెంట్‌గా 1993లో ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఈయన ఈ పాతికేళ్లలో ఏడీ స్థాయికి ఎదిగిన క్రమంలోనే ఎడాపెడా అక్రమార్జనకు పాల్పడ్డారు. అవనీతి సంపాదనతో ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లోనూ భూములు, ఇళ్లు, ఇళ్లస్థలాలు, బంగారు నగలు సమకూర్చుకొని కోట్లకు పడగెత్తారు.
ఈయనగారి అక్రమాలపై అందిన ఫిర్యాదులతో ఆరునెలల నుంచే ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. అదను చూసి గురువారం దాడులు చేశారు. బృందాలుగా విడిపోయి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. అనకాపల్లిలోని అతని కార్యాలయం, విశాఖ ఎంవీపీ కాలనీలోని నివాసంతోపాటు పీఎంపాలెంలోనే అతని బావమరిది అయిన ఓ కానిస్టేబుల్‌ ఇంటిలోనూ సోదాలు జరిపారు. విజయగనం జిల్లాలోని అతని స్వగ్రామంతోపాటు పలువురు బంధువుల నివాసాల్లో జరిపిన సోదాల్లో అక్రమా ఆస్తులకు సంబంధించి కళ్లుచెదిరే వివరాలు లభ్యమయ్యాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ ఆస్తుల విలువ రూ.2.50 కోట్లు అని అంచనా వేసినప్పటికీ.. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ.50 కోట్ల పైమాటేనని అధికారులే చెబుతున్నారు. లాకర్లు, ఇళ్లలో ఉన్న నగదులో అధిక శాతం 2000, 500 నోట్ల కట్టలే ఉండటం విశేషం.

సీతమ్మధార(విశాఖ ఉత్తర): అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అందినకాడికి దోచుకుని కోట్ల రూపాయలు కూడబెట్టిన అవినీతి ఘని ఏసీబీ అధికారులకు చిక్కింది. 25 సంవత్సరాల కిందట సాధారణ టెక్నికల్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించి రూ.50కోట్లకుపైగా కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో జియాలజీ అండ్‌ మైన్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గుండు శివాజీ, అతని బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు చేపట్టారు. విజయనగరంం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అనకాపల్లిలోని ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించి అక్రమార్జన గుట్టు విప్పారు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీఎస్పీ కె.రామకృష్ణప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం... గురువారం ఉదయం 6 గంటల నుంచి ఎంవీపీ కాలనీ సెక్టార్‌ – 3లోని శివాజీ ఇంటిలో సోదాలు చేపట్టారు. అదే సమయంలో అతని సోదరుడు బాలాజీ ఇల్లు, పీఎంపాలెంలోని బావమరిది ఇల్లు, స్వగ్రామం బంటుపల్లిలోని ఇల్లు, అనకాపల్లిలోని కార్యాలయంలో సోదాలు చేపట్టారు. భోగాపురంలో నిర్మాణంలో ఉన్న ఇంటిని పరిశీలించారు. గుర్తించిన ఆస్తుల విలువ ప్రభుత్వ ధర ప్రకారం రూ.2.50కోట్లు ఉంటుందని, బహిరంగ మార్కెట్‌ ప్రకారం రూ.50కోట్లపైనే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఏసీబీ అధికారులు గణేష్, రమేష్, గఫూర్, మూర్తి, అప్పారావు, ఉమామహేశ్వరరావు సిబ్బందితో బృందాలుగా ఏర్పాడి సోదాలు నిర్వహించారు.

గుర్తించిన ఆస్తులివే
శివాజీ ఇంటిలో 240 గ్రాముల బంగారం, 3.3 కిలోల వెండి, రూ.9.5లక్షలు గుర్తించారు.
శివాజీ భార్య శారదామణి పేరిట ఎంవీపీ సెక్టార్‌ –6లోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచిలోని లాకర్‌లో రూ.39.50 లక్షలు నగదు (అన్నీ రూ.2 వేలు, రూ.500ల నోట్లు) గుర్తించారు.
ఎంవీపీ సెక్టార్‌ – 10లోని ఎస్‌బీఐ లాకర్‌ 34.50 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. అందులోనే 1358 గ్రాముల బంగారం ఉన్నట్లు గుర్తించారు.  
కాపులుప్పాడలో 267 గజాల స్థలం.
ఎంవీపీ కాలనీలో మూడు అంతస్తుల భవనం. (దీని విలువ సుమారు రూ.2కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.)
విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో నిర్మాణంలో ఉన్న జీ ప్లస్‌ వన్‌ భవనం.
భోగాపురంలోని 25 సెంట్ల వ్యవసాయ భూమి.
స్వగ్రామం బంటుపల్లిలో వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు.
ఇంకా కొన్ని లాకర్లలో నగదు, బంగారం ఉందని, ఫిక్సిడ్‌ డిపాజిల్లు ఉన్నాయని... అవన్నీ పరిశీలిస్తున్నామని డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్‌ తెలిపారు. శివాజీని అరెస్ట్‌ చేసి మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించామని, శుక్రవారం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.

స్వగ్రామంలోని ఇంటిలో...

డెంకాడ(నెల్లిమర్ల): విశాఖ జిల్లా అనకాపల్లి మైన్స్‌ ఏడీగా పని చేస్తున్న గుండు శివాజీ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న అభియోగంపై అవినీతినిరోధక శాఖ అధికారులు ఆయన ఇళ్లపై గురువారం ఏకకాలంలో సోదాలు చేపట్టారు. దీనిలో భాగంగా శివాజీ స్వగ్రామమైన విజయనగరం జిల్లా డెంకాడ మండలంలోని బంటుపల్లి గ్రామంలోని ఆయన స్వగృహంలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ గఫూర్‌ ఆధ్వర్యంలో సోదాలు చేశారు. ఇక్కడ సోదాల్లో వంశపారపర్యంగా వచ్చిన ఆస్తులకు సంబంధించిన భూమి పత్రాలను గుర్తించామని, కొత్తగా ఏమీ ఇక్కడ లభ్యం కాలేదని ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ గఫూర్‌ ‘సాక్షి’కి తెలిపారు. వీటన్నింటినీ నమోదు చేసుకుని, రెవెన్యూ అధికారుల నుంచి కూడా వీటిపై సమాచారం తీసుకుంటున్నామని తెలిపారు.

కానిస్టేబుల్‌ చంద్రశేఖర్‌ నివాసంలో...
పీఎం పాలెం(భీమిలి): పీఎం పాలెం ఆఖరు బస్టాపునకు సమీపంలోని ఓ అపార్టుమెంట్‌లో నివసిస్తున్న పోలీస్‌ కానిస్టేబుల్‌ కూరాకుల చంద్రశేఖర్‌ నివాసంపై ఏసీబీ సీఐ రామారావు సిబ్బందితో దాడులు నిర్వహించారు. అవినీతి ఘని మైన్స్‌ ఏడీ శివాజీకి చంద్రశేఖర్‌ స్వయానా బావమరింది. ఇంటిలో క్షుణ్ణంగా పరిశీలించామని, అయితే శివాజీ ఆస్తులకు సంబంధించిన పత్రాలు లభ్యం కాలేదని సీఐ రామారావు తెలిపారు.

ఆరు నెలలుగా నిఘాపెట్టి
మైన్స్‌ ఏడీ శివాజీ అక్రమార్జనపై సమాచారం అందడంతో అవినీతి నిరోధక శాక అధికారులు అతని కార్యాలయం, ఇల్లు, తదితరాలపై గడిచిన ఆరు నెలలుగా నిఘా ఉంచారు. రోజూ ఇంటి నుంచి స్కూటర్‌పై రైల్వేస్టేషన్‌కు వెళ్లి... అక్కడ పార్కు చేసి రైలులో అనకాపల్లిలోని కార్యాలయానికి వెళ్తుండేవాడని అధికారులు గుర్తించారు.

వాటర్‌ క్యాన్‌లో నోట్ల కట్టలు
కూలింగ్‌ వాటర్‌ క్యాన్‌లో లక్షలాది రూపాయల నోట్ల కట్టలు దాచిపెట్టి తన పడక గదిలో శివాజీ ఉంచుకున్నాడు. తనిఖీల్లో వాటర్‌ క్యాన్‌లో సుమారు రూ.10 లక్షలు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు అవాక్కయ్యారు.

పేరు    :    గుండు శివాజీ
ఉద్యోగంలో చేరింది    :    1993లో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా చేరిక
ప్రస్తుత హోదా        :    జియాలజీ అండ్‌ మైన్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గాఅనకాపల్లిలో విధుల నిర్వహణ
25 ఏళ్లలో సంపాదన  :    బహిరంగ మార్కెట్‌లో రూ.50కోట్లకుపైనే

ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టిన ప్రదేశాలు
అనకాపల్లిలోని మైన్స్‌ ఏడీ కార్యాలయం  
విజయనగరం జిల్లాలోని డెంకాడ మండలం బంటుపల్లి గ్రామంలోని
శివాజీ స్వగృహంలో       శ్రీకాకుళంలోని బంధువుల ఇంటిలో
విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మాణంలో ఉన్న ఇల్లు పరిశీలన
విశాఖ నగర పరిధి ఎంవీపీ కాలనీలోని సెక్టార్‌ –3లోని శివాజీ ఇల్లు
ఉషోదయ కూడలిలో ఆయన సోదరుడు బాలాజీ ఇల్లు
పీఎం పాలెం ఆఖరు బస్టాపునకు సమీపంలోని బావమరిది చంద్రశేఖర్‌ ఇంటిలో  

మరిన్ని వార్తలు