అవినీతిలో ‘సీనియర్‌’ 

7 Sep, 2019 05:11 IST|Sakshi
జవ్వాది శ్రీనివాసరావు

ఏఎన్‌యూలో సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాసరావుపై ఏసీబీ పంజా

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో పలు చోట్ల సోదాలు 

మాజీ స్పీకర్‌ కోడెల బినామీ అంటున్న స్థానికులు

ఏఎన్‌యూ, కాజ (మంగళగిరి)/సాక్షి, అమరావతి: ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులు మరో అవినీతి తిమింగలాన్ని పట్టుకున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) అకౌంట్స్‌ విభాగంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న జవ్వాది శ్రీనివాసరావుపై ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం అతని కార్యాలయం, నివాసం, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో 8 బృందాలు సోదాలు నిర్వహించాయి. బహిరంగ మార్కెట్‌లో రూ. 30 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీజీ కుమార్‌ విశ్వజిత్‌ శుక్రవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. కాజ, ఆరేపల్లి ముప్పాళ్ల, అన్నవరం, నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు, నర్సరావుపేట, అమరావతి పట్టణాల్లో తనిఖీలు చేశారు.

శ్రీనివాసరావు పేరుతో జీ ప్లస్‌ 2, జీ ప్లస్‌ 1 భవనాలు, పలు అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు, ఏడు ఇళ్ల స్థలాలు, 7.56 ఎకరాల వ్యవసాయ భూమి, ఆయన భార్య సుజాత పేరుతో రెండు భవనాలు, 5.94 ఎకరాల వ్యవసాయ భూమి, కుమారుడు వెంకటకృష్ణ పేరుతో ఆరు ఇళ్ల స్థలాలు, 5.19 ఎకరాల వ్యవసాయ భూమి, కుమార్తె నందిని పేరుతో రెండు ఇళ్ల స్థలాలు, 6.90 ఎకరాల వ్యవసాయ భూమి, కోడలు మానస పేరుతో ఇంటి స్థలం గుర్తించారు. సోదాల్లో రూ. 29 లక్షల నగదు, రూ. 26.23 లక్షల బ్యాంకు నిల్వ, రూ. 12 లక్షల విలువైన బంగారం ఆభరణాలు, రూ. 47,600 విలువైన వెండి ఆభరణాలు, రూ. 4.50 లక్షల విలువైన సామగ్రి, రూ. 3.65 లక్షల ప్రామిసరీ నోట్లు దొరికాయి. ఆస్తుల రిజిస్ట్రేషన్‌ విలువ రూ. 3.50 కోట్లు ఉంటుందని ఏసీబీ డీజీ విశ్వజిత్‌ తెలిపారు. అయితే బహిరంగ మార్కెట్‌లో ఆస్తుల విలువ రూ. 30 కోట్లకుపైగా ఉండవచ్చని తెలిసింది. తనిఖీలు నిర్వహించిన అనంతరం శ్రీనివాసరావును అరెస్ట్‌ చేసి గుంటూరు ఏసీబీ కార్యాలయానికి తరలించారు. 

ఏసీబీ వలలో రెండోసారి.. 
ప్రస్తుతం సీనియర్‌ అసిస్టెంట్‌గా ఉన్న శ్రీనివాసరావు ఏసీబీ కేసులో ఇరుక్కోవడం ఇది రెండోసారి. 14 ఏళ్ల కిందట అతను యూనివర్సిటీలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడి సస్పెండ్‌ అయ్యాడు. అయినా తన తీరు మార్చుకోలేదు. టీడీపీ హయాంలో మాజీ శాసన సభాపతి కోడెల శివప్రసాద్‌ అండతో అతను అక్రమాస్తులు కూడబెట్టారని స్థానికులు చెబుతున్నారు. 

విశ్రాంత ఉద్యోగి ఇంటిపై ఏసీబీ సోదాలు 
వర్సిటీలో విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన ఎం.మల్లేశ్వరరావు అనే ఉద్యోగి నివాసంలోనూ ఏసీబీ దాడులు చేసినట్లు సమాచారం. గుంటూరులోని జేకేసీ కళాశాల ప్రాంతంలో ఉన్న ఇతని నివాసంలో శుక్రవారం మూడు గంటలకుపైగా తనిఖీలు నిర్వహించారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఏసీబీ కేసులో సస్పెండ్‌ అయిన శ్రీనివాసరావు తిరిగి విధుల్లో చేరేందుకు మల్లేశ్వరరావు సహకరించారని సమాచారం. దీంతో వీళ్లిద్దరి మధ్య సంబంధాలపై అధికారులు విచారిస్తున్నారు. 

మరిన్ని వార్తలు