ఏసీబీ కొరడా

27 Jan, 2019 12:32 IST|Sakshi
ఏసీబీ అధికారులకు పట్టుబడిన దేవరపల్లి ఏఎస్సై (తలదించుకున్న వ్యక్తి) (ఫైల్‌) 

భీమవరం (ప్రకాశం చౌక్‌): రైతుకు పాస్‌బుక్‌ కావాలంటే లంచం.. రొయ్యల చెరువులకు అనుమతులు కావాలంటే లంచం.. పొలాలను సర్వే చేయాలంటే లంచం.. పోలీసు కేసు లేకుండా చూడాలంటే లంచం.. ప్రభుత్వ అధికారులతో పని చేయించుకోవడం సామాన్యుడికి కష్టంగా మారింది.. అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ కొందరు అవినీతి అధికారులు సామాన్యుడి నుంచి మధ్యతరగతి వరకూ అందరినీ పీల్చిపిప్పిచేస్తున్నాయి.. పోలీసు శాఖలో డీఎస్పీ స్థాయినుంచి రెవెన్యూలో ఆర్‌ఐ, వీఆర్వో వరకూ ఇందుకు మినహాయింపు కాదు.

ఏడాది వ్యవధిలో ఉభయగోదావరి జిల్లాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడుల్లో ఇలాంటి ఎన్నో నిజాలు వెలుగుచూశాయి. ఏసీబీ అధికారులు కొరడా ఝుళిపించడంతో 2018 నుంచి ఇప్పటివరకూ 25 కేసులు నమోదు కావడం ఇందుకు నిదర్శనంగా ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలో 14 కేసులు, తూర్పుగోదావరి జిల్లాలో 11 కేసులు నమోదయ్యాయి.  జిల్లాలో ఈనెలలోనే ఐదు రోజుల వ్యవధిలో ఒక ఎస్సై, ఏఎస్సై, సీనియర్‌ అసిస్టెంట్‌ లంచం తీసుకుంటూ  ఏసీబీ అధికారులకు  పట్టుబడటం సంచలనం కలిగించింది. రెవెన్యూ, పోలీస్‌ శాఖలతో పాటు రిజిస్ట్రేషన్, పంచాయతీరాజ్, విద్యా, అటవీ, ట్రెజరీ, ఆడిట్, హౌసింగ్‌ తదితర శాఖల్లో అధికారులపై ఏసీబీ దాడులు ఎక్కువగా జరిగాయి.

నాన్‌బెయిలబుల్‌ కేసులు
అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో చిక్కుకున్న అధికారులపై నాన్‌బెయిలబుల్‌ కేసులను అవినీతి నిరో ధక శాఖ అధికారులు పెడుతున్నారు. సామాన్యుడి అవసరాన్ని ఆసరాగా చేసుకుని సొమ్ములు డిమాండ్‌ చేస్తున్న అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఏసీబీ అధికారులు హెచ్చరిస్తున్నారు.

బ్రోకర్ల ద్వారా వ్యవహారాలు
జిల్లాలోని పోలీస్‌ శాఖలో కొందరు అధికారులు తమ పరిధిలోని గ్రామాల్లో బ్రోకర్లను ఏర్పాటుచేసుకుని ఏ కేసు వచ్చినా పరిష్కరిస్తామని భరోసా ఇస్తూ లంచాలు డిమాండ్‌ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. న్యాయమైన కేసు ఫైల్‌ చేయాలన్నా, అక్రమ కేసు నమోదు చేయకుండా ఉండాలన్న బ్రోకర్ల ద్వారా వ్యవహారాలు నడుతుపున్నట్టు తెలుస్తోంది. మరికొందరు అధికారులు నేరుగా బాధితులతో మాట్లాడి సొమ్ములు డిమాండ్‌ చేస్తున్నారు. జిల్లాలో ఈనెలలో అవినీతి నిరోధక శాఖ అధికారులకు  చిక్కిన ఇద్దరు పోలీసు అధికారులు నేరుగా లంచం డిమాండ్‌ చేసి పట్టుబడినవారే కావడం విశేషం. 

లంచం అడిగితే మాకు చెప్పండి
జిల్లాలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం కోసం డిమాండ్‌ చేసినా, సొమ్ములు ఇవ్వకపోతే పనులు చేయకపోయినా మా దృష్టికి తీసుకురండి. నా సెల్‌ నం: 94404 46157 ఫోను, వాట్సాప్‌ ద్వారా వివరాలు తెలియజేయవచ్చు. అక్రమ అస్తుల వివరాలు తెలిపే వారి వివరాలు రహస్యంగా ఉంచుతాం. లంచం తీసుకోవడమే కాదు ఇవ్వడం కూడా నేరం అని ప్రజలు తెలుసుకోవాలి. లంచం తీసుకుంటూ పట్టుబడిన వారిపై బెయిల్‌ రాని కేసులు కడుతున్నాం. వారిని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తాం. లంచం ఇవ్వకుండా ప్రభుత్వ అధికారులతో పనిచేయించుకోవాలి. ప్రస్తుతం చాలా శాఖలకు సంబంధించి పనులు ఆన్‌లైన్‌లో అయిపోతున్నాయి. చదువుకున్న యువత మంచి అవగాహన కల్పించుకుని సామాన్యులకు ఆన్‌ౖలñ న్ల ద్వారా పనులు జరుగుతున్నట్టు వివరించాలి. – వి.గోపాలకృష్ణ, ఏసీబీ డీఎస్పీ ఏలూరు

మరిన్ని వార్తలు